Grandfather’s Words – A Bundle of Blessings is a powerful,

అనగనగా ఒక ఊరు. ఆ ఊరి పేరు హరితపురం. ఆ ఊరికి దగ్గర్లో వున్న కొండలు, అడవులే ఆ ఊరి ప్రజలకు జీవనాధారం. ఆ ఊర్లోనే హరితయ్య అనే కష్టజీవి ఉండేవాడు. ఆయనకి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. హరితయ్య చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవడంతో తాతయ్య వద్దే పెరిగాడు. తాతయ్య కట్టెలు కొట్టి కుటుంబాన్ని పోషించేవాడు.

తాతయ్య కొన్నాళ్ళకు ముసలివాడవడంతో హరితయ్యను పిలిచి “అడవికి వెళ్ళి ఎందుకట్టెలు కొట్టి తీసుకురా” అన్నాడు. “ఎంత దూరమైనా వెళ్ళు కానీ, పచ్చని చెట్టును మాత్రం నరకకు” అని చెప్పాడు.

ఎండిన చొట్టు దొరికే వరకు అడవంతా గాలించు. చేతిలో గొడ్డలి వుంటుంది. కాబట్టి మృగాలకు భయపడాల్సిన పని లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ పచ్చని చెట్టును నరకకు. అది నియమంగా పెట్టుకో” అని ఒట్టు వేయించి మనవడిని అడవికి పంపాడు.

ఆ తరువాత కొన్ని రోజులకే తాతయ్య చనిపోయాడు. తాతకిచ్చిన మాట ప్రకారం హరితయ్య ఎండి మోడైన చెట్లనే కొట్టి తెచ్చేవాడు. ఆ కట్టెలను అంగడిలో అమ్మి సరుకులు తెచ్చేవాడు.

ఒకరోజు హరితయ్యకు ఎండిన చెట్టుగానీ మోడు గాని కనిపించడం లేదు. అడవంతా గాలించాడు. ఫలితం లేకపోయింది. అలసిపోయి ఒక చెట్టు క్రింద కూర్చున్నాడు. తన దురదృష్టానికి బాధపడ్డాడు. ఒట్టి చేతులతో ఇంటికి వెళ్తే అందరూ పస్తులు ఉండాల్సిందే. ఏమీ తోచలేదు. తనతో వచ్చిన వాళ్ళు పచ్చని చెట్లు నరికి ఇళ్ళకు పోతున్నారు.

అడవిలో హరితయ్య ఒక్కడే మిగిలాడు. మౌనంగా రోదిస్తున్న హరితయ్యను ఒక సాధువు చూశాడు. అతని కథ విన్నాడు. తాతకిచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు మెచ్చుకున్నాడు. అలాగే “భుక్తి గడవడానికి కట్టెలే కొట్టాల్సిన పనిలేదు. ఈ అడవిలో పూలు, పండ్లు, ఔషధాలకు పనికి వచ్చే మొక్కలు ఇలా ఎన్నో వనరులున్నాయి. వాటిని తీసుకెళ్ళి అంగట్లో అమ్మి కుటుంబాన్ని పోషించు” అన్నాడు. “అడవి పచ్చగా ఉన్నంత వరకు కరువు అనేది ఉండదు.” అని హరితయ్యకు హితబోధ చేశాడు.

హరితయ్యకు జ్ఞానోదయం అయింది. ఆనాటి నుంచి అతడు ఎండిన కట్టెలతో పాటు, అక్కడ లభించే వనరులను ఏరుకొని అమ్మి ఆ డబ్బుతో హాయిగా జీవించసాగాడు. తనను చూసి తన తోటివారు కూడా పచ్చని చెట్లు నరకడం మానేశారు. అలా వారు అడవులను ఆధారం చేసుకొని అనేక వృత్తులు చేపట్టారు. వనాలు కూడా అంతరించిపోకుండా మానవులకు నిత్య వరాలు ప్రసాదిస్తూ, వర్థిల్లసాగాయి.

అది ఒక పురాతన పల్లె. ఒకప్పుడది పచ్చని చెట్లతో పాడి పంటలతో ఎంతో కళకళలాడుతూ ఉండేది. ఆడింది ఆట పాడింది పాటగా ప్రజలు కాలం గడుపుతుండేవారు. నెలకు మూడు వానలు కురుస్తుండేవి. చెరువులు, బావులు నీళ్ళతో నిండి ఉండేవి. ఎటు చూసినా పచ్చని చెట్లే. ఫలసాయం తేరగా అందుతుంటే ప్రజలు ఆనందంగా హాయిగా కాలం గడుపుతూ సోమరితనానికి అలవాటు పడ్డారు.

వంట చెరకు కోసం దూరానున్న అడవికి పోకుండా అందుబాటులో వున్న చెట్లను నరకడం ప్రారంభించారు. కొన్నాళ్ళకు పల్లె పరిసర వాతావరణంలో పెనుమార్పులు వచ్చాయి. పల్లె ప్రాంతం బీడువడింది. వర్షాలు ముఖం చాటేశాయి. చెరువులు, బావులు ఎండిపోయాయి. దీంతో ప్రజలు వంటలను పండించలేకపోయారు.

ఒకప్పుడు చెట్ల కొమ్మలపై కిలాకిలారావాలు చేస్తూ అలికిడి చేసిన పక్షులు పల్లెను వదిలి వలస పోయాయి. పల్లెలో పనులు లేక కొందరు యువకులు పట్టణాలకు పోయారు. వృద్ధులు, మహిళలు, పిల్లలు ఎక్కడో దూరానున్న కొండలు, అడవులకు పోయి కాయాకసరు తెచ్చుకొని కడుపు నింపుకుంటూ దిక్కుతోచక పుట్టిన ఊర్లోనే కాలం గడపసాగారు. అలాంటి పరిస్థితుల్లో ఒకరోజున ఒక మునీశ్వరుడు దేశాటనం చేస్తూ ఆ పల్లెకు వచ్చాడు. ఆ ముని ఆ పల్లెను గతంలో సందర్శించిన వాడే. పల్లె పరిస్థితి గమనించి దిగులు పడ్డాడు. అక్కడి వృద్ధులు ఆ మునిని గుర్తుపట్టి, “స్వామీ! చూశారుగా పల్లె. పాడిపంటలతో కళకళలాడే ఈ పల్లె ఎలా అయిపోయిందో. మీరు మనసున్న మంచివారు. మా పల్లెలో అడుగుపెట్టారు. ఇక మాకు మంచిరోజులే. చావలేక బతుకుతున్న మాకు మీరే దిక్కు కరుణించండి” అని వేడుకున్నారు.

ముని దీనులుగా కనిపిస్తున్న ఆపల్లె జనాన్ని ఉద్దేశించి “చెట్లను ఎడా పెడా నరకడం వల్లే మీకీ దుస్థితి కలిగింది. నలుగురు యువకులను నాతో పంపండి. మేలు జాతి విత్తనాలు దుంపలు వారికిస్తాను. ఆ విత్తనాలను, దుంపలను పల్లె పరిసరాల్లో నాటండి. కొద్ది రోజుల్లో పెనువర్షం పడే సూచన కనిపిస్తుంది. ఈలోగా మీరు చెరువులను, బావులను బాగుచేసి సిద్ధం చెయ్యండి. ఒక్క నీటి చుక్కను కూడా వృధా చెయ్యొద్దు. చెట్లను పెంచి పూర్వ వైభవం పొందండి. పల్లె సుభిక్షమవుతుంది. నేను మరలా ఈ పల్లెకు వచ్చేసరికి కళకళలాడాలి” అని హితబోధ చేసి నలుగురు యువకులను తనతో పాటు తీసుకువెళ్ళాడు.

యువకులు ముని ఇచ్చిన విత్తనాలను దుంపలను పెద్ద పెద్ద మూటలతో పల్లెకు తీసుకువచ్చారు. ముని చెప్పినట్లుగా వాతావరణంలో మార్పు కనిపించింది. తొలుత ఈదురు గాలులు, చిన్న చిన్న చినుకులతో ప్రారంభమైన వర్షం తుపానుగా మారింది. తుపాను తీవ్రతకు అందరూ భయపడ్డారు. తెల్లవారి వర్షం వెలిసింది. పూడిక తీసిన చెరువులు, బావులు నీటితో నిండాయి. ఊరంతా మళ్ళీ మట్టివాసనతో గుబాళించింది. యువకులు తెచ్చిన విత్తనాలు, దుంపలను పల్లె ప్రజలు నాటారు. ముని చెప్పినట్లే అవి తొందరగా మొలకెత్తాయి. కొమ్మలు, రెమ్మలతో చెట్లు ఎదగసాగాయి. గతంలో పచ్చదనంతో పాటు మాయమైన క్రిమికీటకాదులు మళ్ళీ కనిపించసాగాయి. వలస పోయిన పక్షులు తిరిగి వచ్చాయి. తూనీగలు సీతాకోక చిలుకలు గాల్లో ఎగురుతుంటే పాములు, ముంగిసలు, ఇలా ఒక దానిపై మరొకటి ఆధారపడి బతికే జీవులు పల్లె పరిసరాల్లో తారసపడసాగాయి. పచ్చని పట్టు పరికిణి కట్టుకున్న పల్లె పడుచులా కనిపించసాగింది ప్రకృతి.

రైతులు మూలన పడేసిన వ్యవసాయ పరికరాలు బయటకు తీశారు. బీడు దున్ని పంటలు పండించారు. పల్లె పూర్వ వైభవం పొందింది. కరువు కాటకాలు తొలగి, సిరిసంపదలతో తులతూగసాగారు ఆ పల్లెవాసులు. ఎంత సంపద చేతికందిన ఆ పల్లె ప్రజలు మునిమాటలు మరిచిపోలేదు. చెట్లు వాళ్ళ దృష్టిలో దేవతా మూర్తులై పూజలందుకోసాగాయి. ‘వృక్షో రక్షతి రక్షితః’ అన్న సూక్తి అక్షరాలా నిజం అయింది

పూర్వం గోస్టనీ నదీ తీరాన ‘సత్యపురి’ అనే ఒక గ్రామముండేది. ఆ గ్రామానికి కాసులయ్య అనే ఒక వ్యాపారి వచ్చి స్థిరపడ్డాడు. సత్యపురి గ్రామం చుట్టుపక్కల గ్రామాలలో పెద్దదవడం వల్ల కాసులయ్య వ్యాపారం మూడు పువ్వులారు కాయలై వర్ధిల్లింది. బాగానే అతడు సంపాదించాడు.

కాసులయ్య భార్య పేరు సావిత్రమ్మ. ఆమె ఒకరోజు భర్తతో “మంచి ఇల్లు కట్టండి. తోటలు భూములు కొనండి. డబ్బుండి ఏమీ అనుభవించలేక పోతున్నాం!” అన్నది భార్య బాధతో

కాసులయ్యకూ డబ్బుకు లంకె! భార్య మాటలు అతడికి రుచించలేదు. “నాలుగు డబ్బులు వెనుకేసుకున్నామని లోకానికి తెలిస్తే లోకం మనల్ని బతకనిస్తుందా! చేబదుళ్ళు, చందాలతోనే చల్లబడిపోతాం!” అని భార్య నోరు మూయించాడు.

రోజులు గడుస్తున్నాయి. సత్యపురి ప్రాంతం అనావృష్టికి గురయింది. జీవనదిలా ఉండే గోస్థనీ ఎండిపోయింది. వ్యవసాయం దెబ్బతింది. ప్రజలకు పనులు కరువయ్యాయి. చేతిలో చిల్లిగవ్వ ఆడక ప్రజలు బాధలు పడసాగారు. కాసులయ్య వద్దకు వచ్చి దినుసులు అరువివ్వమని ప్రాధేయపడ్డారు. కాసులయ్య అరువియ్యడానికి ఇష్టపడక వ్యాపారం పూర్తిగా మానేశాడు. తప్పు కప్పిపుచ్చుకోడానికి ఊళ్ళో వారందరితో పాటు కరువుకు ఏడ్చాడు. ఊళ్ళో వారు విస్తుపోతే… ‘నా వద్ద డబ్బులేదు. వ్యాపారంలో గడించేది అధికారుల లంచాలకే సరిపోయింది!’ అని కళ్ళు ఒత్తుకున్నాడు కాసులయ్య. గ్రామస్తులు అవాక్కయ్యారు. “బావీ చెరువూ బాగు చెయ్యడానికి సహాయపడతావని ఆశపడ్డాం. మా ఆశ నిరాశయింది” నిట్టూర్చారందారూ! డబ్బివ్వడం తప్పినందుకు కానులయ్య మనన్సులో ఆనందించాడు. అందరితో పాటు బావి వని, చెరువు పని కాలేకపోతున్నాయని విచారించాడు.

ఆ రోజు నుండి కాసులయ్య మరీ జాగ్రత్త పడ్డాడు. ఇంటి వద్ద ఒకపూటే వంట! అదీ గంజి మెతుకులే! కూరలు లేవు నారలు లేవు. పిల్లలకు కడుపునిండా తిండి పెట్టడం మానేశాడు.

సావిత్రమ్మ భర్త వైఖరికి విసుక్కుంది. ఒకరోజు భర్తతో “కలిగుండి మనకెందుకండీ ఈ కర్మ! దాచుంచిన డబ్బు బయటకు తీసి ఖర్చు పెట్టండి. కడుపునిండా తిని, పేదలకింత పెట్టండి. సంపాదించిన డబ్బుకు పరమార్థం కల్పించండి!” బోధన చేసి చూసింది. కాసులయ్య మారలేదు. రోజులు గడుస్తున్నాయి. కాని వాతావరణంలో మార్పు రాలేదు. తాగే నీరు కూడా కరువయింది. బతుకు కోసం సత్యపురి గ్రామస్తులు కొందరు దూర ప్రాంతాలకు వెళ్ళసాగారు, భవిష్యత్లో ఉపయోగపడగలదని కొందరు శ్రమదానంతో చెరువు లోతు చేయడానికి సిద్ధపడ్డారు. కాసులయ్య మాత్రం కదలలేదు. సత్యపురిలో పరిస్థితులు విషమించాయి. ఆకలితో తాళలేక కొందరు చనిపోయారు. సావిత్రమ్మకు భయమేసింది. భర్తతో “పట్నం పోయి హాయిగా బతుకుదాం. పదండి. ఇంకా ఇక్కడే కొన్ని రోజులుంటే ప్రాణాలు పోతాయేమో!” అని పిల్లలను పట్టుకుని లబోదిబోమని ఏడ్చింది.

కాసులయ్య ఆలోచనలో పడ్డాడు. పట్నం వెళ్ళడానికి అతని మనస్సు అంగీకరించ లేదు. భార్యతో “ఓసీ తెలివి తక్కువదానా! అమావాస్య తరువాత పౌర్ణమి రాక తప్పదు. ఈ యేడిలా కరువొచ్చిందని గాని రానున్నసంవత్సరం తప్పక పంటలు పండుతాయి. అప్పుడు మన వ్యాపారం బాగా ఉంటుంది! లాభాలు ఇబ్బడి ముబ్బడిగా పొందగలం!” అని తెలివిగా నచ్చజెప్పి భార్య నోరు నొక్కాడు.

ఒకరోజు అర్ధరాత్రి బందిపోటు దొంగల ముఠా సత్యపురికి వచ్చింది. గ్రామస్థులు భయపడలేదు. తలుపులు బార్లా తెరిచి, “మీరు దోచుకోడానికి పిడికెడు బియ్యం కూడా మా వద్ద లేవు. దారి తప్పి మా ఊరు వచ్చినట్టుగా వుంది!” అని దొంగలతో అన్నారు. దొంగలు “మీ వద్దకు రాలేదు. ఉన్నవారి వద్దకే వచ్చాం. అన్నీ మాకు తెలుసు!” అంటూ కాసులయ్య ఇంటివైపు వెళ్ళారు. “పిచ్చోళ్ళులాగున్నారు. కాసులయ్య బతుకు కూడా మాలాగే వుంది. బూడిదే మీకు దొరుకుతుంది. వెళ్ళండి” అని ఎద్దేవా చేస్తూ గ్రామస్తులు చలిగాలి ఇళ్ళల్లోకి చొరబడకుండా తలుపులేసుకున్నారు.

దొంగలు కాసులయ్య ఇంటిమీద పడ్డారు. మొదట కాసులయ్య ఏమీ లేదన్నాడు. తరువాత దొంగలు బెదిరించేసరికి అంతా ఇవ్వక తప్పలేదు. పాపం! కాసులయ్యకు దుఃఖం ఆగలేదు. పొగిలి పొగిలి ఏడ్చాడు. సావిత్రమ్మకు ఒళ్ళు మండింది. “చాల్లెండి మీ ఏడుపు! నిజం తెలిస్తే గ్రామస్తుల వద్ద వున్న విలువ పోతుంది. ఇకనైనా బుద్ధి కలిగి ప్రవర్తించండి” అని చెప్పింది.

తేలు కుట్టిన దొంగలాగా కాసులయ్య దుఃఖం దిగమింగాడు. ఉదయాన గ్రామస్తులతో కలిసి చెరువు తవ్వడానికి బయలుదేరాడు.

వైద్యంలో కిటుకు!

రామనాథం అనే యువకుడు ఓసారి అనుకోకుండా ఊబలూరు అనే గ్రామం వెళ్ళాడు. పేరుకు తగినట్టుగానే అక్కడందరూ ఊబకాయాలతో ఉండడాన్ని గమనించి ఆశ్చర్యపోయాడు. ఎవర్ని చూసినా ఒళ్ళు కదపలేని స్థితిలోనే వున్నారు. వెంటనే అతనికి ఓ ఆలోచన వచ్చింది. వైద్యవృత్తిలో ఎంతో కొంత ప్రవేశం ఉన్న రామనాథం అక్కడ ఓ ఆసుపత్రిని నెలకొల్పాలని నిశ్చయించుకున్నాడు.

కొన్నాళ్ళకే ఊబలూరు శివార్లలో ‘ప్రకృతి వైద్యశాల’ నిర్మించాడు. దాని ముందు ఒక బోర్డు పెట్టించాడు. ‘ఇక్కడ ఊబకాయులకు చికిత్స చేయబడును. ఫలితం లేకపోతే డబ్బు వాపసు ఇవ్వబడును’ అని రాయించాడు.

కొద్ది రోజుల కల్లా రద్దీ పెరిగింది. ఏ రోజు మందు ఆరోజు స్వయంగా వచ్చి తీసుకోవాలని రామనాథం షరతు విధించాడు. గుళికలు, లేహ్యాలు కషాయాలతో అతడు చేసే వైద్యానికి ఫలితం కనిపించింది. లావుపాటి వారంతా రోజురోజుకీ సన్నబడసాగారు. దాంతో చుట్టుపక్కల గ్రామాల్లోని స్థూలకాయులు కూడా వైద్యానికి రాసాగారు.

తీరిక లేకుండా ఉన్న రామనాథాన్ని చూడ్డానికి ఓ సారి అతని చిన్ననాటి స్నేహితుడు వచ్చాడు. అతడూ వైద్యుడే. “నువ్విచ్చే చికిత్సకి ఇంత ఫలితం కనిపిస్తోందంటే నమ్మలేకపోతున్నాను. ఏదైనా కొత్త మందు కనిపెట్టావా?” అన్నాడు రామనాథంతో.

“అన్నీ నీకు తెలిసిన గుళికలే. అసలు కిటుకు మందులో లేదు” అన్నాడు రామనాథం.

“మరేమిటా కిటుకు?” అన్నాడు మిత్రుడు.

“ఊరి చివర కొండ మీద ఈ వైద్యశాలను కావాలనే కట్టాను. రోజూ వచ్చి మందు తీసుకోవాలనడంతో ఆ శ్రమకి వాళ్ళ కొవ్వు కరిగి సహజంగానే ఫలితం కనిపిస్తోంది.”

“మరి కొండమీద ఎందుకు కట్టావని ఎవరూ అడగలేదా?”

“ఎందుకడగరు? ఊళ్ళోనే వైద్యశాల పెడితే ఇల్లు ఇస్తామన్నారు కూడా. కానీ నేనిచ్చే మందులు హిమాలయాల నుంచి తెచ్చే మొక్కల నుంచి వస్తాయని, ఆ మొక్కలు కొండమీదనే ఎదుగుతాయని చెప్పాను” అంటూ రామనాథం నవ్వేశాడు. మిత్రుడు కూడా నవ్వక తప్పలేదు.

కొత్తగా చంద్రయ్య కొనుక్కున్న ఇల్లు వీధికి చివరిలో ఉండటం వల్ల అలికిడంతగా ఉండేది కాదు. రాత్రివేళయితే మరీ అధ్వాన్నంగా ఉండేది భార్యాపిల్లలూ రాత్రివేళ బయటకు రావడానికి జంకుతుండేవారు. చంద్రయ్య కచేరీలో పని పూర్తి చేసుకుని రాత్రి బాగా పొద్దుపోయాక వచ్చేవాడు. భార్యాపిల్లలూ మరీ భయపడడం గమనించి, “మనం అడవిలో లేం. ఇరుగుపొరుగుతో మాట్లాడుతూ వుండొచ్చుకదా? తలుపులు బిగించి. ఇంట్లో బిక్కు బిక్కు మంటూ ఎందుకుండాలి?” అన్నాడు.

అతని భార్య సీతమ్మ వెంటనే కలుగజేసుకొని “మీకు చెప్పడం మర్చిపోయాను. పక్కింటి వదినగారు

ఈ మధ్య ఒక విషయం చెప్పారు. అప్పటినుంచి నా జాగ్రత్తలు నేను తీసుకుంటున్నాను” అంది. చంద్రయ్య ఆశ్చర్యపోతూ “ఏమిటి చెప్పారు?” అని అడిగాడు.

సీతమ్మ భయపడిపోతున్న పిల్లలను అక్కున చేర్చుకుని “ఎరక్కపోయి మనమిక్కడ ఇరుక్కుపోయామండీ! రాత్రివేళ మన వీధి పెరడులో దెయ్యాల నీడలు కనిపిస్తాయట! అలాగే రాత్రి పది దాటాక అర్ధరాత్రి వరకు ఒక దెయ్యం గీ పెట్టి ఈల వేస్తుందట!” భయపడుతూ పొరుగామె చెప్పిన సంగతులు చెప్పింది.

చంద్రయ్యకు దెయ్యాలు, భూతాల మీద నమ్మకం లేదు. వెంటనే పొరుగింటికి పోయి ఆమెను దెయ్యాల గురించి అడిగాడు. సీతమ్మకు చెప్పినట్టే ఆమె చంద్రయ్యకూ పూసగుచ్చినట్టు చెప్పింది.

చంద్రయ్య వస్తున్న కోపాన్ని దిగమ్రింగి, “మీరు భ్రమపడి అనవసరంగా మా ఇల్లాలిని భయపెట్టారు!” అనే సరికి ఆమె రోషంతో “మీకంతా నేను చెప్పానుగా. అక్షరాలా నేను చెప్పింది మీరు చూస్తారు. మీరు వింటారు!” అంటూ చంద్రయ్య ముఖం మీదే తలుపులు దబాలున మూసేసింది.

చంద్రయ్య మొండివాడు. ఇంటికి వచ్చి స్నానాదులు ముగించి, భోజనం చేశాడు. పిల్లలప్పటికే నిద్రపోయారు. సీతమ్మ ఇంటి అలికిడి పూర్తయ్యాక పెరటి తలుపులు మూసేయడానికి సిద్ధపడగా. “ఆగాగు! ఈ రోజు దెయ్యాల నీడలు చూసి తీరాలి!” అంటూ పెరటి వసారాలో కుర్చీ వేసుకుని మొండిగా కూర్చున్నాడు.. సీతమ్మ దెయ్యాల గురించి ఆలోచిస్తూ భయపడసాగింది.

అంతలో పొరుగామె చెప్పినట్టు పక్కింటి అవతల ఉన్న ఇంటి పెరడులో ఉన్న పూరిపాకల మీద నీడలు తిరుగాడుతున్నట్టు కనిపించాయి. సీతమ్మ హడలెత్తిపోయింది. “ఇంట్లోపలకు వచ్చేయండి!” భర్త చేయి పట్టి లాగబోయింది. చంద్రయ్య భార్య చేతిని విదిలించి, “నన్ను ఆలోచించుకోనియ్” అని ఆమెను కసిరి అక్కడే ఉండమన్నాడు. తిరుగాడుతున్న నీడలను తేరిపార చూసిన చంద్రయ్యకు దెయ్యాల నీడల రహస్యం తెలిసిపోయింది. ఫకాలున నవ్వుతూ, “సీతమ్మా! అవి దెయ్యాల నీడలు కావు! మన పొరుగున్న వాళ్ళ నీడలు! భార్యాభర్తలిద్దరూ దుకాణం కట్టేసి, ఇంటికొచ్చేసరికి రోజూ ఈ సమయమవుతుంది. స్నానాలు, వంటావార్పూ చేసుకుంటారు.

వాళ్ళ వంటింటి లైటు వెలుగుకి వాళ్ళ నీడలు వాళ్ళింటికి ఎదురుగా ఉన్న ఆ పూరిపాకల మీద పడుతున్నాయి. రా! నీకర్థమయ్యేలా చూపిస్తాను!” అంటూ భార్యను పక్కింటికి తీసుకువెళ్ళాడు. ఆ ఆలూమగలతో విషయం చెప్పి, భార్యకు నీడలెలా పూరిపాకల మీద పడుతున్నాయో వివరించి చూపించాడు. సీతమ్మకు అసలు కారణం అర్థమైంది. “మరి ఈల మాట?!” భర్తను ప్రశ్నించింది సీతమ్మ!

చంద్రయ్య భార్యను వీధిలోకి తీసుకువచ్చాడు. అప్పటికే గీ అన్న ధ్వని వినిపిస్తుంది. ఆ ధ్వని వస్తున్న

దిశను ఆలకించి, “సీతమ్మా! ఇక్కడకు దగ్గరలోనే కమ్మరి కొలిమొకటి ఉంది! అక్కడ రాత్రి బిందెలు తరిణి పడుతుంటారు. నువ్వు వింటున్న ధ్వని అదే!” అంటూ చిక్కుముడి విప్పాడు.

ఆ రోజు నుంచి సీతమ్మలో భయంపోయింది. పొరుగావిడ భయపెట్టినప్పుడల్లా అసలు కారణాలు చెప్పి, ఆమెలోని భయాన్ని కూడా పోగొట్టడానికి ప్రయత్నం చేస్తూనే ఉంది!

ఉల్లి దెయ్యం

పార్వతీపురం పట్టణానికి దగ్గరలో కొత్తగా ఒక కాలనీ వెలిసింది. దాదాపు వంద ఇళ్ళు గల కాలనీ అది. పట్టణానికి కాస్త దూరంగా వుండడం వల్ల ఆ ప్రాంతం ప్రశాంతంగా ఉందని కాలనీ వాసులందరూ సంబర పడ్డారు.

కొత్తగా వెలిసిన కాలనీ కావడం వల్ల విద్యుత్ సదుపాయం కల్పించడంలో ఆలస్యమయింది. చీకటి పడ్డాక ప్రజలు బయట తిరగక ఎవరి ఇళ్ళల్లో వాళ్ళుండసాగారు. కాలనీ ప్రాంతం కొత్తది కావడం వల్ల అక్కడి జనం పొద్దుపోయాక ఏ చిన్న చప్పుడు వినిపించినా ఏ పిట్ట గట్టిగా అరచినా ఏ జంతువు అలికిడి చేసినాజడిసి పోతుండేవారు. తెల్లవారాక ఆ శబ్దాలు గురించి రకరకాలుగా చెప్పుకుంటుండేవారు. కొన్నిశబ్దాలు కావాలని చేస్తున్నవిగా అనుకున్నారు.

సరిగ్గా అలాంటి పరిస్థితిలోనే ఎరకయ్య “మా ఇంటికి ఈ మధ్యన అర్ధరాత్రి ఉల్లిపాయ దెయ్యమొకటి వచ్చింది. వచ్చింది ఊరుకోకుండా వింతశబ్దాలు చేసి నానా హడావిడి చేసింది. మా కసలే భయం. ప్రాణాలరచేతిన పెట్టుకొని ఆరాత్రి ఎట్లాగో గడిపాం.” ఎరకయ్య మాటలు పూర్తి చేయలేదు. అక్కడున్న వారిలో ఒకడు ఉత్సుకతను ఆపుకోలేక “మీ ఇంటి కొచ్చిన దెయ్యాన్ని ఉల్లిపాయ దెయ్యమని ఎందుకు చెబుతున్నావ్?” అమాయకంగా అడిగాడు. ఎరకయ్య తడుముకోకుండా “ఆ రాత్రి ఉల్లిపాయల బుట్ట తిరగబడింది. వరుసగా మూడు రోజులు అలాగే జరిగింది. రోజూ దెయ్యమొచ్చి ఉల్లిపాయలు ఎత్తుకు పోతుంటే నేనెలా భరించేది. అసలు ఉల్లిధర ఆకాశంలో వుంది. అందుకే నేనొక ఉపాయమాలోచించాను” అన్నాడు. “ఏమిటా ఉపాయం?” ఇంకొకడడిగాడు “మరేమీ లేదు రోజూ ఒక ఉల్లిపాయను ఇంటి ముందు పెడుతున్నాను. ఆరోజు నుంచి ఆ ఉల్లిపాయను తీసుకుని ఆ దెయ్యం మరి ఇంట్లోకి రావడం మానేసింది. రోజుకొక ఉల్లిపాయ పోతేపోయింది గాని దెయ్యం పీడ మాకు విరగడయింది?” దెయ్యాన్ని వదిలించుకున్న ఉపాయం చెప్పాడు ఎరకయ్య.

అతను చెప్పిన ఉపాయం కాలనీవాసులు నమ్మారు. రాత్రిపూట వింత వింత ధ్వనులు అందరూ వింటున్నవే. ఆ ఉల్లిపాయ దెయ్యం ఎక్కడ తమ ఇంట్లోకి వస్తుందేమోనని ప్రతి ఇంటి వాళ్ళు ఆ రోజు నుంచి రాత్రిపూట ఉల్లిపాయను ఇంటికి దిష్టితీసి ఇంటి ముందు పెట్టి గడియలు వేసుకోవడం ప్రారంభించారు.

మరునాడు నుంచి ఎరకయ్య అంగడిలో ఉల్లిపాయలు కొనడం మానేశాడు. అందరి ఇళ్ళముందు రాత్రిపూట పెట్టిన ఉల్లిపాయలు మాయమవడం ఆగలేదు!

ತಾಯತ್ತು

శివయ్యకు దేశ సంచారమంటే భలే సరదా. అప్పులు చేసి దేశంలోని పుణ్య తీర్థాలు సందర్శించాడు. అప్పులు తీర్చకుండానే దాటవేస్తూ వడ్డీలు పెరిగి ప్రాణాలకే ముప్పు తెస్తాయని భయపడ్డాడు. దేశసంచారం వల్ల లౌకికం బాగానే అబ్బడంతో కొత్త అప్పులు చేసి డాబుసరిగా కుటుంబాన్ని నడపసాగాడు. ప్రజల్లో “వింధ్యపర్వత ప్రాంతంలోని ఒక యోగి కొన్ని తాయెత్తులు ప్రసాదించాడు. ఒక తాయెత్తుకు పూజ చేసి ధరించాను. ఫలితంగా నా అప్పులన్ని పటాపంచలయ్యాయి” అని అతడు వ్యాప్తి చేశాడు. శివయ్య మాటలు అప్పుల్లో మునిగున్న వాళ్ళను భ్రమలో ముంచాయి. రుణ బాధితులు శివయ్యను కలిసి తాయెత్తుల కోసంఎగబడ్డారు. శివయ్య వాళ్ళ చేత పూజలు చేయించి దండిగా డబ్బులు దండుకోసాగాడు. దీంతో చుట్టు పక్కల ఊళ్ళ నుంచి కూడా జనం వచ్చి శివయ్య కాళ్ళమీద పడ్డారు.

ఒకరోజు చిన్ననాటి మిత్రుడు శివయ్య వద్దకు వచ్చి “నీ గురించి విన్నాను. ప్రస్తుతం పీకల్లోతు అప్పుల్లో మునిగున్నాను. నాకొక తాయెత్తిచ్చి పుణ్యం కట్టుకో,” అని శివయ్య రెండు చేతులూ పట్టుకొని ప్రాధేయపడ్డాడు.

మిత్రుడికి ఏం చెప్పాలో అర్ధం కాని శివయ్య, కాసేపటికి తేరుకొని ఒక తాయెత్తు తీసి ఉచితంగా తీసుకోమన్నాడు. కాని మిత్రుడందుకు అంగీకరించక డబ్బిచ్చి వెళ్ళాడు. ఆ డబ్బు ఖర్చుపెట్టకుండా శివయ్య భద్రంగా ఉంచాడు. కొన్నాళ్ళ తరువాత ఆ మిత్రుడు శివయ్య వద్దకు వచ్చి, “అప్పులు తీరలేదు. ఎంత డబ్బయినా ఫర్వాలేదు. మంచి తాయెత్తియ్యి!” అడిగాడు.

అప్పుడు శివయ్య భద్రంగా దాచిన డబ్బు తెచ్చి మిత్రునికిస్తూ, “తాయెత్తులకు అప్పులే తీరుతున్నాయో లేదో కాని నా అప్పులు మాత్రం తీరిపోతున్నాయి. నా సంపాదనా మార్గం ఇది. నువ్వెలా గ్రహిస్తే అలా గ్రహించు. నీ డబ్బు తిరిగి తీసుకో!” అన్నాడు. నిర్ఘాంతపోయిన మిత్రుడు మారు మాట్లాడక ఇంటికి తిరుగుముఖం పట్టాడు.

చాదస్తాల యశోదమ్మ

రామయ్య గోపయ్యలిద్దరూ అన్నదమ్ములు. వారి చిన్నతనంలోనే తండ్రి పోయాడు. తల్లి యశోదే వాళ్ళను పెంచసాగింది. ఆమెకు చాదస్తాలు, మూఢనమ్మకాలు ఎక్కువ.

బడి ఈడు వచ్చిన రామయ్య గోపయ్యలను ఆమె బడికి పంపలేదు. బడికిపోతే పిల్లలు చచ్చిపోతారని ఆమెకు భయం. ఆమెకు రామయ్యా, గోపయ్యలకన్నా ముందుగా ఒక కొడుకుండేవాడట. వాడు బడికి వెళ్ళాకే చనిపోయాడట.

నిజానికి ఆ అబ్బాయి జబ్బు వచ్చి చనిపోయాడు. కానీ యశోదమ్మ పిల్లాడికి చదువొచ్చాక చనిపోయాడని నమ్మింది. అందువల్లే ఆమె రామయ్య, గోపయ్యలను బడికి పంపలేదు.

రామయ్య – గోపయ్యలు పెద్దవాళ్ళయ్యారు. కూలీనాలీ చేసి సంపాదించిన డబ్బులు తల్లి చేతిలో పెట్టేవారు. యశోదమ్మ ఆ డబ్బుతో రకరకాల పూజలు చేసేది. రకరకాల మొక్కులు దేవతలకు మొక్కేది. సోది చెప్పేవాళ్ళను ఇంటికి రప్పించి వాళ్ళను దానాలతో తృప్తి పరిచేది.

‘ఎందుకమ్మా డబ్బునలా ఖర్చుపెడుతున్నావని ఎవరైనా అడిగితే కొడుకులకు మంచి రోజులు రావడం కోసమే’ అని చెప్పేది.

కొడుకు లిద్దరికీ పెళ్ళీడు వచ్చింది. దూరపు బంధువుల పిల్లలతో పెళ్ళిళ్ళు చేసింది. ఇద్దరు కోడళ్ళ రాకతో ఆమెకు బోలెడు విశ్రాంతి లభించింది.

పనీ పాట లేని ఆమె పూజలతోనే సంతృప్తి పడక ఇంటికి బాబాలను సాధువులను పిలవడం ఆరంభించింది. ఖర్చులు పెరగడంతో ఆమె అప్పులు చెయ్యడం ప్రారంభించింది. ఆమె చేసిన అప్పులు తీర్చడానికి కొడుకులిద్దరు. సతమతమవసాగారు.

పెద్దకోడలు కమలకు అత్తచేసిన పనులు నచ్చలేదు. అత్త బుద్ధిని మార్చడానికి ఆమె ప్రయత్నించింది. కోడలి ఆలోచన పసిగట్టిన యశోదమ్మ, “మీ మంచి రోజులు కోసం నేను పూజలు నాజలు చేస్తుంటే నీవు తప్పుపడతావా? దేవుడిగదికి వెళ్ళి తప్పయిందని లెంపలేసుకో!” అని కోడలిని మందలించింది.

అంతటితో ఊరుకోక కొడుకులు రాత్రి ఇల్లు చేరాక రభస చేసింది. కోడలు మరి నోరెత్తలేకపోయింది. ఎవరు తనవైపు మాట్లాడలేదని బాధ పడింది.

రోజులు గడుస్తున్నాయి. యశోదమ్మ కోడళ్ళిద్దరు నెల తప్పారు. రోజుల తేడాతో ఇద్దరు మగ పిల్లలను కన్నారు. మనవలిద్దరకు బడి వయసు వచ్చింది. పిల్లలిద్దరినీ బడికి పంపే ప్రయత్నాలు ఇంట్లో చేస్తుంటే యశోదమ్మ అడ్డు పలికింది. మనవలను బడికి పంపడం ససేమిరా వద్దంది.

అత్తగారి నోటి నుంచి వచ్చిన ఆ మాటలు విని కమల కొయ్యబారిపోయింది. కొడుకులిద్దరు తల్లి మాటకు ఎదురు చెప్పకపోయేసరికి ఆమె కోపం నసాళానికెక్కింది.

“మీ అమ్మగారి చాదస్తాలు మరీ ఎక్కువవుతున్నాయి. ఆమె చాదస్తంతో మీకెలాగూ చదువులేదు. మన పిల్లలకు కూడా చదువును దూరం చేయాలని ఆమె అనుకుంటుంది. ఇలా అయితే నేనీ ఇంట్లో ఉండలేను!” గట్టిగానే చెప్పింది.

మంచం మీద కూర్చున్న యశోదమ్మ చివాలున మంచం నుంచి దిగి, “చిన్నా పెద్దా లేకుండా ఆ వాగుడేమిటి? నీకు వినాశకాలం దాపురించింది. అందుకే అలాగ పేలిపోతున్నావు? దేవుడూ దయ్యమూఅంటే కాస్త భయమూ భక్తి వుండాలి! పెద్దవాళ్ళు అనుభవంతో చెప్పే మాటలను గౌరవించాలి!” అని విరుచుకుపడింది.

కోడలికీ అత్తకూ మాటా మాటా పెరిగింది. రామయ్య ఎంత సర్దిచెప్పినా ఇద్దరిమధ్య వాదన తెగలేదు. చివరకు వాదన వేరు కాపురం వరకు వచ్చింది. మనస్సులు కలవనప్పుడు దూరంగా ఉండడమే శ్రేయస్కరమని పక్క ఊర్లో కాపురం పెట్టాడు రామయ్య.

కమల భర్తను తన దారికి తెచ్చి ముందు పిల్లాడిని బడిలో చేర్పించింది. పిల్లాడు బడికెళ్ళి వస్తుంటే రామయ్య ఎంతో ఆనందించాడు. రోజులు కూడా రామయ్యకు కలిసొచ్చాయి. కూలి డబ్బులు బాగా అందే పనులు దొరికాయి. నాలుగు డబ్బులు వెనకేసుకొని ఊరి చివర స్థలం చౌకగా ఆ దంపతులు కొనుక్కున్నారు. కొన్నాళ్ళకు చిన్న ఇల్లు కూడా కట్టుకున్నారు.

కమల సోమరిగా కూర్చోలేదు. పెరటి జాగా బాగు చేసింది. వానాకాలం రాగానే ఆమె ఆనప, గుమ్మడి, బీర, పొట్ల పాదులు వేసింది. తొందరగా కాపుకు వచ్చే కొబ్బరి మొక్కలు నాటింది.

యశోదమ్మకు వాళ్ళద్వారా వీళ్ళద్వారా రామయ్య కుటుంబ విషయాలు తెలిశాయి. ఆమెకు ఒళ్ళు మండింది. కోడలి వల్లనే కొడుకు మారిపోయాడని కోడలికి శాపనార్థాలు పెట్టింది.

బడికి వెళ్ళడం వల్ల మనవడు చచ్చిపోతాడని రాగాలు పెట్టింది. రామయ్యను తనను కలవమని కబురు పంపించింది.

అతడు వచ్చాక, “మన కుటుంబానికి అచ్చిరానివన్నీ నీ పెళ్ళాం చేస్తుంది. నీవు నష్టపోతావు. నీప్రాణం నీ కొడుకు ప్రాణం హరీమంటాయి” అని హెచ్చరించింది.

రామయ్య మనస్సులో నవ్వుకున్నాడు. తల్లితో నెమ్మదిగా, “అచ్చిరాదంటూ పనికొచ్చే ఏ పనీ చెయ్యనివ్వకుంటున్నావు. పూర్వకాలంలాగా ఈ కాలం కాదు. చదువు తప్పని సరి. సంపాదన తప్పనిసరి.

ఆ రోజుల్లో నీవు పెరట్లో మొక్కలు నాటడం ఆ సమయంలోనే నాన్న చనిపోవటం కాకతాళీయంగా జరిగిన సంఘటనలు. చిన్నతనం కదా మంచి చెడ్డలు మాకంతగా అప్పుడు తెలియలేదు. పెద్దయ్యాక ఊళ్ళోవాళ్ళు అనుకుంటే నాన్న ఒక తాగుబోతనీ విసుగు విరామం లేకుండా తాగి తాగి గుండె ఆగి చనిపోయాడని విన్నాం.

సారాయి తాగడం వల్లనే నాన్న చనిపోయాడు. కాని పెరట్లో పాదులు మొక్కలు వెయ్యడం వల్ల కాదని నేనూ, కమలా నమ్ముతున్నాం. అందువల్లే మేము తెగించి బాగుపడడానికి కొత్తదారులు వెతుకుతున్నాం!” అని అన్నాడు.

కొడుకు మాటలు విని యశోదమ్మ తోక తొక్కిన పామయింది. కొడుకును నానా తిట్లు తిట్టి “కనిపించకు పో” అని అంది. తమ్ముడు మరదలు అక్కడే ఉన్నారు కాని వారు జోక్యం చేసుకోలేదు.

రామయ్య మనస్సు బాధపడింది. అక్కడ మరి ఒక్క క్షణం ఉండకుండా ఇంటిదారి పట్టాడు.

కాలం గడుస్తోంది. ఐదు సంవత్సరాలుగడిచాయి.

రామయ్య దంపతులు పూర్తిగా పేదరికానికి దూరమయ్యారు. పెరటిలో వేసిన కొబ్బరి చెట్లు అందుకొచ్చాయి. కాయగూరల పంట దిగుబడి అధికమయింది.

రోజూ కమల కొబ్బరికాయలు, కాయగూరలమ్మకం వల్ల రాబడి పెరిగింది. తిండికి గుడ్డకు వాళ్ళకు కరువులేకపోయింది. పిల్లాడు మంచి బడిలో చదువుకోసాగాడు.

రామయ్య తమ్ముడు గోపయ్య పరిస్థితి సొంత ఊర్లో దీనంగా మారిపోయింది. తల్లి చాదస్తాలకు, మూఢ నమ్మకాలకు అతడి కుటుంబం బలయింది.

చదువూ సామూ లేక అతని కొడుకు జులాయయ్యాడు. గోపయ్య తెచ్చుకుంటున్న రోజు కూలీ కుటుంబానికి సరిపోయేది కాదు. ఇల్లు గడవడం కష్టమయింది.

గోపయ్య ఆలోచనలో పడ్డాడు. అన్నయ్య కన్నా తన బతుకు ఎందుకు వెనుకబడిందో గ్రహించాడు. తల్లి మూఢనమ్మకాలు, చాదస్తాలు ఆమె అమాయకత్వం వల్ల ఏర్పడినవే అని తెలుసుకున్నాడు.

ఒకరోజు తల్లితో, “అమ్మా! అన్నయ్య బాటలోనే నేనూ నడుస్తాను. మా జీవితాలను బాగు చేసుకుంటాం. మన ప్రయత్నముంటేనే దేవుని దీవెన వుంటుంది. ఏకంగా దేవుని మీదే భారం వేసి కూర్చుంటే ఫలితముండదు.

ప్రతీదీ అచ్చిరాదని పాతదారిలోనే పయనిస్తే మనమెప్పుడు జీవితంలో ముందుకెళ్ళగలం?” నిలదీసినట్టే అడిగాడు.

ఆ మాటలు గోపయ్య నోటినుంచి విని యశోదమ్మ దిగ్భ్రాంతురాలయింది. కాసేపు నోట మాట లేకుండా చేష్టలుడిగిపోయింది. ఏమనుకుందో ఏమో కొంతసేపయ్యాక “నీ ఇష్టం! మీ కొత్త ఆలోచనలకు నేనడ్డురాను!” භයි.

గోపయ్య దంపతులు ఆనందించారు. కొన్నాళ్ళకు అందరి శ్రమతో ఆ ఇల్లు కూడా సిరిసంపదలకు లోటు లేకుండా అభివృద్ధి చెందింది.

ఔదార్యం

పూర్వం శివసతీపురంలో నీలవర్మ, లుబ్ధవర్మ అనే ఇద్దరు మిత్రులుండేవారు. ఇద్దరూ స్థానికంగా దొరికే సుగంధద్రవ్యాలు, ఔషధమూలికలు, ముత్యాలు, రంగురాళ్ళు సేకరించి సుదూర దేశాలతో వ్యాపారం చేస్తుండేవారు. విశేష లాభాలార్జించి అచిరకాలంలోనే శ్రీమంతులయ్యారు. నీలవర్మ తనకొచ్చిన లాభాలలో కొంత భాగంతో ఆయా దేశాలలో ప్రజల కోసం సంక్షేమ పనులు చేయగా లుబవర్మ ఇబ్బడిముబ్బడిగా వచ్చిన లాభాలను పోగేసుకుని ఆనందించేవాడు. కానీ అతడి ఆనందం నీలవర్మకొచ్చిన కీర్తి ప్రతిష్టల ముందు దిగదుడుపే అయింది.

ఒకరోజు లుబ్ధవర్మ నీలవర్మ ఇంటికి వెళ్ళి, “మిత్రమా! ఆర్జించిన ధనాన్ని ఇష్టానుసారం ఖర్చు చేస్తున్నావు. వయసులో ఉన్నంత వరకు బాగానే సంపాదించగలం కాని వృద్ధులమయ్యాక ఇప్పటిలాగ సంపాదించగలమా? భవిష్యత్తు గురించి కూడా మనమాలోచన చేయగలగాలి. మనవద్ద డబ్బు లేనప్పుడు మన అవసరాల కెవరు ఆదుకుంటారు? మన కుటుంబాల గతేమిటి? అందుకే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని డబ్బుని దాచుకోవడం మంచిది!” అని నీలవర్మ చేస్తున్న దానధర్మాలకు అడ్డుకట్ట వెయ్యటానికి ప్రయత్నించాడు.

నీలవర్మ మిత్రుని అంతరంగం గ్రహించి, “లుబ్దవర్మా, మనకొచ్చే లాభాలన్నీ ఆయా దేశ ప్రజల నుంచి సంపాదన చేసేదే కదా, భవిష్యత్ను నేను పూర్తిగా విస్మరించలేదు. నా కుటుంబం కోసం నాకొచ్చే లాభాలలో కొంతమేర ఆదా చేస్తున్నాను. లక్షాధికారైనా లవణమన్నమే తింటాడన్న పెద్దల సూక్తి వినలేదా? భవిష్యత్తు పేరుతో కోట్లు కోట్లు పోగు చేయడం నాకు నచ్చదు. అందుకే అవసరం మేరకు వెనుకేసుకొని మిగిలినది దానధర్మాలు చేస్తున్నాను. అలాగ చెయ్యడంలో వచ్చే సంతృప్తికి ఏదీ సాటిరాదు” అని తెగేసి చెప్పాడు.

లుబ్దవర్మకు నీలవర్మ మాటలు నచ్చలేదు. అయినా వాదనకు దిగకుండా ఇంటికి వెళ్ళి ఆలోచించాడు. నీలవర్మ వాదనలో నిజం కొంత లేకపోలేదని గ్రహించాడు. అంతమాత్రాన పూర్తిగా నీలవర్మ వాదనతో ఏకీభవించలేకపోయాడు. మధ్యేమార్గంగా ఒక నిర్ణయానికి వచ్చాడు. కుటుంబ సభ్యులకు కూడా ఆ నిర్ణయాన్ని తెలుపలేదు.

కాలం సాగుతోంది. ఇద్దరు మిత్రుల వ్యాపారం మూడు పువ్వులారుకాయలుగా వర్థిల్లుతోంది. దేశదేశాలలో నీలవర్మ కీర్తిని చెవులారా విన్న లుబ్ధవర్మ, ‘ముందు ముందు కాలంలో నా పథకం ఆచరణలో పెట్టేటప్పుడు నా కీర్తి ముందు నీలవర్మ కీర్తి దిగదుడుపే అవుతుంది. అప్పుడు నీలవర్మ నా ఆలోచనను ప్రశంసించక మానడు, అనుకోసాగాడు.

రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు హఠాత్తుగా లుబ్ధవర్మ అనారోగ్యానికి గురయ్యాడు. పక్షవాతం వచ్చి కాలూ చెయ్యిపడిపోయింది. నోరు కూడా పడిపోయింది. అంతే, లుబ్రవర్మ ఆలోచనలన్నీ తలక్రిందులయ్యాయి. కొడుకులు స్థానికంగా, ఉన్న వైద్యులకు తండ్రిని చూపించారు. ఫలితం కనిపించలేదు. వైద్యులు తమ అశక్తతను తెలియపరచారు.

లుబ్ధవర్మకు ఆరోగ్య విషయం పూర్తిగా అవగతమయింది. ఏదో చెప్పాలని ఆరాటం. కాని అతడు చెప్పలేడు. అందుకు శరీరంలో ఏ అంగమూ సహకరించలేదు. దేశ దేశాలలో తన కీర్తిని ఇనుమడింపజేసుకోడానికి తను దాచి ఉంచిన అపార నిధిరాశులు గుర్తుకు తెచ్చుకుని తల్లడిల్లసాగాడు.

విదేశాలలో వున్న నీలవర్మకు లుబ్దవర్మ అనారోగ్య విషయం తెలిసింది. చాలా బాధపడ్డాడు. విదేశాలలో వున్న వైద్య నిపుణులను వెంటబెట్టుకుని లుబ్దవర్మ ఇంటికి తీసుకెళ్ళాడు. ఆ వైద్యులు రోగిని పరీక్షించి కొంతవరకు నయం చేయవచ్చని అభయమిచ్చారు.లుబ్దవర్మ మిత్రుని చూసి పశ్చాత్తాపపడ్డాడు. మిత్రుడి కన్న ఎక్కువ కీర్తిప్రతిష్టలు పొందడానికి తను దాచి వుంచిన నిధులు ఎవరికీ తెలియకుండా భూస్థాపితమవబోతున్నందుకు వెక్కి వెక్కి ఏడ్చాడు తప్ప ఏమీ చెప్పలేకపోయాడు. మిత్రుడి దీనస్థితిని చూసి నీలవర్మ విచారపడ్డాడు.

వైద్యులు లుబ్ధవర్మకు వైద్యం ప్రారంభించారు. వైద్యం ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే లుబ్ధవర్మ తేరుకున్నాడు. కాళ్ళూ చేతులూ స్వాధీనమయ్యాయి. మాట కూడా వచ్చింది. వెంటనే నీలవర్మను పిలిపించి విదేశాలలో తను ఎక్కడెక్కడ నిధులు దాచాడో ఆ రహస్యం చెప్పి ఆయా దేశాల ప్రజలకు ఉపయోగపడేటట్టుగా వైద్యశాలలు, అన్నసత్రాలు కట్టించమని అర్ధించాడు.

లుబ్ధవర్మ మారినందుకు నీలవర్మ చాలా సంతోషించాడు. అలాగే చేస్తానని లుబ్ధవర్మ మాటిచ్చాడు. వెంటనే అమలు పరిచాడు.

నీలవర్మ కీర్తితో పాటు లుబ్దవర్మ కీర్తి కూడా మారుమ్రోగింది. లుబ్ధవర్మ ఆనందించాడు. అప్పటినుంచి కుమారుల సహాయంతో మాతృదేశంలోనే వ్యాపారం నిర్వహించి, ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టి శేషజీవితాన్ని సద్వినియోగం చేసుకున్నాడు.

బెడిసికొట్టిన పన్నాగం

నారాయణ అనే యువకుడు పండ్లతోట కాపరిగా పనిచేస్తూ, కాయకష్టం లేకుండా సుకుమారంగా వుండడానికి బాగా అలవాటు పడ్డాడు. ఒకరోజు తోట యజమాని వద్ద నుండి నారాయణకు పిలుపు వచ్చింది. నారాయణను పిలవడానికి వచ్చిన మనిషిని తోటకు కాపలా వుంచి, యజమాని వద్దకు వెళ్ళాడు. యజమాని నారాయణను చూసి, “ఇంటి పనులు చేస్తున్న రామయ్యకు ఆరోగ్యం బాగాలేదు; బలహీనతవల్ల ఇంటిపనులు చెయ్యలేకపోతున్నాడు; మొదటినుండి నా వద్ద నమ్మకంగా పనిచేసే మనిషి అతడు; ఉద్యోగం నుండి తొలగించి, ఇంటికి పంపేయడం నాకు సబబనిపించలేదు. అందువల్ల అతడిని తోటకు కాపరిగా వుంచి, నిన్ను ఇంటిపనులుచేయటానికి నియమిస్తున్నాను. తోటకాపరి పని ఏమంత కష్టమైంది కాదు కాబట్టి, ఆ తేలిక పని వల్ల అతను వేగంగా కోలుకోగలడని నా విశ్వాసం!” అని అన్నాడు.

నారాయణ గుండెల్లో రాయి పడ్డది. యజమానికి ఎదురు చెప్పలేక ‘సరే’ అని ఒప్పుకున్నాడు; అయిష్టంగానే మర్నాడు యజమాని ఇంటికి వచ్చాడు.

రోజులు గడుస్తున్నాయి. బరువులు మోయడం, బావి నీళ్ళు తోడడం, పిల్లల నెత్తుకొని సముదాయించడం, అంగడి నుండి ఇంటికి, ఇంటి నుండి అంగడికి పదిసార్లు తిరగడం నారాయణకు కష్టమనిపించింది. ఎలాగోలా తోట కాపరి పని తిరిగి సంపాదించుకోవాలని నిర్ణయించుకున్నాడు. బాగా ఆలోచించి, ఒక పన్నాగం పన్ని, కార్యరంగంలోకి వెంటనే దిగాడు. తుంటరి పిల్లలను చేరదీసి వాళ్ళచేత తోటలోని పండ్లను దొంగిలించేట్టు చేశాడు. కట్టెలు కొట్టేవాళ్ళను ఉసిగొల్పి చెట్లకొమ్మలను నరికించాడు. చెట్ల నీడల్లో చల్లగా, హాయిగా చీట్లపేక ఆడుకోవచ్చని జూదరులకు సలహా యిచ్చాడు.

దుండగులు విజృంభించారు. రామయ్య ఎంత వారించినా, వాళ్ళు తోటలోకి రావడం విడువలేదు. వాళ్ళు పెట్టే అల్లరి భరించలేక, చివరకు రామయ్య యజమానిని కలుసుకున్నాడు. అంతా వివరించి చెప్పి, “రేపటి నుండి ఇంటిపనులు చెయ్యడానికి వచ్చేస్తాను; నా అసమర్థత వల్ల మీకు నష్టం కలగకూడదు!” అని యజమానితో మనవి చేసుకున్నాడు.

నారాయణ పన్నాగం ఫలించింది. యజమాని నారాయణకు తోటపని అప్పజెప్పాడు. నారాయణ ఆనందానికి అవధులు లేవు. మరల సుఖపడే రోజులు వచ్చాయని సంబర పడ్డాడు. క్షణం ఆలస్యం చెయ్యకుండా తోటలోకి ప్రవేశించాడు. తోటంతా చిందర వందరగా వుంది. అల్లరి పిల్లలు యధేచ్ఛగా తోటలో వీరవిహారం చేస్తున్నారు. వాళ్ళను చూసి నారాయణ, “మీ కారణం వల్ల మరల నాకీ ఉద్యోగం వచ్చింది!” అని కృతజ్ఞతలు తెల్పుకొని, తోటనుండి వెళ్ళిపొమ్మని వాళ్ళని కోరాడు. తుంటరి పిల్లలు కదల్లేదు. చాలా రోజుల నుండి తోటను స్వేచ్ఛగా అనుభవిస్తున్న వాళ్ళకు నారాయణ అభ్యర్ధన కష్టంగా తోచింది. అందరూ కూడబలుక్కుని, “మా వల్ల నీకీ ఉద్యోగం మళ్ళీ లభించింది గాబట్టి, మాకు నీవు ఎల్లప్పుడూ విధేయుడిగా వుండాలి. మాకవసరమయినప్పుడు పళ్ళు, కాయలు అడుగుతుంటాం, కాదన్నావా, ఈ తోటంతా ధ్వంసం చేస్తాం జాగ్రత్త!” అని బెదిరించారు.

రోజులు గడుస్తున్నాయి. తుంటరి పిల్లలను నారాయణ అదుపులో పెట్టలేకపోయాడు. చివరకు యజమాని ఆగ్రహానికి గురియై ఉద్యోగం పోగొట్టుకున్నాడు.

పశ్చాత్తాపం

విశ్వం ఆకతాయి అబ్బాయి. ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఊర్లో ఎవరినో ఒకరిని ఏడిపించడం అతడికి మహా వేడుక.

విశ్వం దృష్టి ఒకనాడు బల్లకట్టు యజమానిపై పడింది. అతడిని ఏడిపించడానికి పథకం వేశాడు. ఒకనాడు రాత్రి విశ్వం ఒంటరిగా కాలువ గట్టు దగ్గరకు వెళ్ళాడు. అక్కడ కట్టివున్న బల్లకట్టు విప్పేశాడు. బల్లకట్టు కాలువ నీటిలో జరజర పోతుంటే విశ్వం మనస్సు ఆనందంతో ఉవ్విళ్ళూరింది. మర్నాడు బల్లకట్టులేకపోవడం చూసి బల్లకట్టు యజమాని ఎలా ఏడుస్తాడో ఊహించుకొని ఉత్సాహంతో గంతులు వేసుకుంటూ ఇంటికి పోయాడు. ఇష్టపడిన కూర లేకపోయినా తృప్తిగా భోంచేసి నిద్రపోయాడు.

అర్ధరాత్రి అయింది. ఇంట్లో గొల్లున ఏడుపులు వినిపించేసరికి త్రుళ్ళిపడి నిద్రలేచాడు విశ్వం. మంచం దిగి ఆత్రుతగా గడపలోకి వచ్చాడు. తమ్ముడు స్పృహతప్పి మంచం మీద పడివున్నాడు. ఆ ఊరి వైద్యుడు ఆచారిగారు తమ్ముడిని పరీక్షిస్తున్నారు. అందరూ ఏడుపులు ఆపి ఆచారిగారు చెప్పబోయే మాటల కోసం ఎదురు చూస్తున్నారు. ఆచారిగారి పరీక్ష పూర్తి అయింది. “చాలా ప్రమాదకరమైన జబ్బు. నేను చేసే వైద్యం పనికిరాదు. పట్నం తీసుకుపోయి, పెద్ద వైద్యుడికి చూపించండి. అశ్రద్ధ చేశారా ప్రాణం పోగలదు!” అని హెచ్చరించి ఆచారిగారు వెళ్ళిపోయారు.

విశ్వం తండ్రి ఒక్కక్షణం కూడా ఆలస్యం చెయ్యలేదు. వెంటనే వీధిలోకి పరుగు తీశాడు. తండ్రి ఆ సమయంలో ముందుగా ఎక్కడకు వెళ్ళి ఎవరిని కలుసుకుంటాడో విశ్వంకి బాగా తెలుసు. ఆ ఆలోచన రాగానే విశ్వం గజగజ వణికిపోయాడు. బల్లకట్టు తన ధర్మాన కొన్ని గంటలకు ముందే కాలువ నీటిలో కొట్టుకుపోయింది. బల్లకట్టు లేకపోతే తొందరగా పట్టణం చేరడం బహుదుర్లభం. విశ్వంకి భయంతో చెమటలు పోశాయి. మృత్యువుతో పోరాడుతున్న తమ్ముని వంక చూస్తూ విలవిలలాడసాగేడు.

అంతలో తండ్రి ఇంటికి చేరుకున్నాడు. తండ్రి చెప్పబోయే మాట లూహించుకొని విశ్వంకి దుఃఖం ఆగలేదు. గొల్లున ఏడుస్తూ తండ్రి పాదాలను చుట్టేశాడు. తండ్రి విశ్వంని లేవనెత్తాడు. “భయపడకు విశ్వం. తమ్ముడి ప్రాణం తప్పక నిలువ గలదు. మన అదృష్టం బాగుంది. ఎక్కడికో కొట్టుకు పోవలసిన బల్లకట్టు సరిగ్గా వీరాస్వామి కంట్లో పడడమేమిటి? వెంటనే అతను కాలువ నీటిలో ఈది బల్లకట్టును తిరిగి ఒడ్డుకు చేర్చడమేమిటి? అంతా విచిత్రంగా వుంది కదా! ఆ బల్లకట్టే ఈ సమయాన లేకపోతే తమ్ముడిని పట్టణానికి ఎలా తీసుకు వెళ్ళి వుండే వాళ్ళం? ఎవడో ఆకతాయి వెధవ ఆ ఘోరమయిన పనికి పాల్పడినా దేవుడు మన పక్షాన వున్నాడు. కనుకనే బల్లకట్టు తిరిగి దొరికింది” అని వెంటనే ప్రయాణం ఏర్పాటు పూర్తి చేశాడు.

కుటుంబమంతా ఆ రాత్రి బల్లకట్టు మీద ప్రయాణం చేశారు. తొందరగా పట్టణం కూడా చేరుకున్నారు. వెంటనే తమ్ముడిని పెద్ద డాక్టర్కి చూపించారు. ఆ డాక్టర్ ఇచ్చిన మందులతో విశ్వం తమ్ముడు తెల్లారేసరికి కోలుకున్నాడు. అందరూ సంతోషించారు. ఆ రోజు సాయంత్రం తిరుగు ప్రయాణమయ్యారు.

ఇంటికి వచ్చేక విశ్వం అందరి ముందూ తను చేసిన తప్పును బయట పెట్టి పశ్చాత్తాప పడ్డాడు. అప్పుడు అతడి మనస్సు తేలికయింది. ఆనాటి నుండి ఆకతాయి పనులు మానివేసి పరోపకారిగా పేరు పడ్డాడు.

బడాయి కాకి

ఒకప్పుడు వింధ్యారణ్యంలో ఒక బడాయి కాకి నివసిస్తూ వుండేది. అది సాటికాకుల మాదిరిగా కాకుండా ఎంతో ప్రత్యేకంగా కాలం గడిపేది. అది అన్ని కాకుల కంటే ముందుగానే నిద్రలేచి ఎటో వెళ్ళేది. తిరిగి రాత్రికి తన గూటికి చేరుకునేది. అప్పటికీ నిద్రపోయేది కాదు. ఒక్కో గూటికి పోయి, అప్పటికే కునుకులో పడిన ఒక్కొక్క పక్షిని లేపి బడాయిగా వాటితో కబుర్లు చెబుతూ వుండేది.

“పొరపాటున ఇలా కాకిగా పుట్టాను నేను. బహుశా కారణజన్మురాలినై వుంటాను. నేనంటే ప్రతి వారికీ ఎంత గౌరవమనుకున్నారు? నిన్నటికి నిన్న తోటపల్లి ప్రజలు నాకు పాయసంతో విందు చేశారు. మొన్ననేమోగదబవలస గ్రామంలో నేతి గారెలు వండి పెట్టారు. రేపు లచ్చిరాజుపేటలో బూరెల విందుకి రమ్మన్నారు. మీరంతా చెత్తా చెదారంలోనూ పేడకుప్పట్లోనూ పురుగుల్ని ఎలా ఏరుకుతింటున్నారో ఏమో మరి?…. కాకిగా పుట్టినా నాకింత వైభవంగా వెళ్ళమారిపోతున్నదంటే పెట్టిపుట్టి వుంటాను….” అంటూ ఆ బడాయి కాకి గుక్క తిప్పుకోకుండా కోతలు కోస్తూ వుండేది రకరకాలుగా.

ఇలా ఉండగా ఒకనాటి తెల్లవారుజామున గూటినుండి బయలుదేరని ఆ బడాయి కాకి మూడు రోజులైనా తిరిగి రాలేదు. దాంతో మిగతా కాకులన్నీ విస్మయంతో తలమునక లయ్యాయి.

అయితే ఆ మరుసటి రోజు మధ్యాహ్నానికి గూటిని చేరుకున్న బడాయి కాకిని చూచి మిగతా కాకులు మరింత ఆశ్చర్యపోయాయి. దాన్ని అసలు పోల్చుకోలేకపోయాయి. దాని తలపైన వెంట్రుకలనేవి లేవు. రెక్కలకు ఈకలు కొన్నే వున్నాయి. అక్కడక్కడ దాని శరీరం కమిలిపోయి వున్నది. అదీగాక దాని మెడలో ఒక గంట వ్రేలాడగట్టబడి వుంది.

తన వంక వింతగా చూస్తున్న మిగతా కాకులవైపు చూసి పేలవంగా నవ్వి, తన బడాయి కబుర్లు ప్రారంభించింది కాకి.

“పార్వతీపురం జమీందారుగారి అబ్బాయి గాలిపటాన్ని ఎగురవేస్తుంటే ఆ గాలిపటం ఆ అబ్బాయిని దారంతో పాటుగా గాల్లోకి లాక్కుపోయింది. అందరూ గోలగా అరిచారు తప్ప ఒక్కరూ సాహసం చేయలేకపోయారు. జరుగుతున్న ఘోరాన్ని చూసి రెక్కలు ముడుచుకుని ఊరుకోలేక పోయాను నేను! వెంటనే విజృంభించాను. పల్టీలు కొట్టుకుంటూ పోయి ఆ అబ్బాయిని క్షేమంగా నేల మీదికి దించి జమీందారుగారికి అప్పగించాను.

దాంతో జమీందారుగారు నన్ను మెచ్చుకుని, ఈ మూడు రోజులూ తమ భవంతిలో వుంచుకున్నారు. నన్ను వాళ్ళ సాంప్రదాయం ప్రకారం ఘనంగా సన్మానించారు. వాళ్ళ మర్యాదలకి వుక్కిరి బిక్కిరైపోయాననుకోండి!” అంటూ ముగించింది.

అంతలో అటువైపుగా వచ్చిన చిలుక, “దీని కోతలు నమ్మకండి జమీందారుగారి వంట గదిలో జొరబడి అన్ని వంటకాల్లోనూ మూతిపెట్టటమే కాకుండా, వెండి నేతిగిన్నెను దొంగిలించుకుని వస్తుంటే వంటవాళ్ళు చూసి, పట్టుకుని బంధించి, ఈ మూడురోజులూ తిండి తిప్పలు లేకుండా మాడ్చి, చివరికి దీన్నిలా చావగొట్టి, గంట కట్టి వదిలేశారు. ఇకపై ఇది వెళ్ళినచోటల్లా దీని గంట మోతను విని జనం దీన్ని కనిపెట్టి ఇలాంటి సన్మానాలే చేస్తుంటారు” అంటూ అసలు విషయాన్ని చెప్పింది.

బడాయి కాకి సిగ్గుపడిపోయింది, వారితో వుండటానికి మొహం చెల్లక ఎటో ఎగిరిపోయింది.

ఇరుగు-పొరుగు

సీతారాంపురానికి సచ్చిదానందస్వామి అనే ఒక యోగి వచ్చాడు. అతడు గొప్ప ధార్మికుడు. ప్రజలు తండోపతండాలుగా అతడి దర్శనం చేసుకొని సందేహాలను తీర్చుకుంటున్నారు. ఒకరోజు దేవదాసు అనే సంసారి సచ్చిదానందస్వామి దర్శనం చేసుకున్నాడు. యోగిని చూసి దేవదాసు “నాకు ఇరుగుపొరుగు వాళ్ళు విరోధులయ్యారు. పచ్చగా బ్రతుకుతున్న మా కుటుంబాన్ని చూసి వాళ్ళు అసూయపడుతున్నారు. ఎప్పుడూ తగువలాటకే ఎదురుచూస్తుంటారు. మాకు శాంతిలేదు. సౌఖ్యంలేదు. మాతో అన్యోన్యంగా వుండే ఇరుగు పొరుగువాళ్ళు మాకు లభిస్తారా? లేదా?” సందేహం తీర్చమని అడిగాడు.యోగి కళ్ళు మూసుకొని ఆలోచించాడు. సమాధానం తట్టగానే కళ్లు తెరచి, “నాయనా! దేవదాసూ! నీవు ఎటువంటి ఇరుగుపొరుగు వాళ్ళను కోరుకుంటున్నావు?” అని అడిగాడు.

దానికి దేవదాసు, “కష్టసుఖాలలో తోడుగా నిల్చేవారు, మాకు కలిగిననాడు ఈర్ష్యపడకుండా వుండేవారు, మాకు లేనినాడు ఎద్దేవా చెయ్యకుండా వండేవారు. ఇరుగు పొరుగు వాళ్ళు కావాలి!” అని ఠకీమని సమాధానమిచ్చేడు. సచ్చిదానందస్వామి మందహాసం చేస్తూ, “నీ సందేహానికి సమాధానం నువ్విచ్చే సమాధానంలో వుంది. ఎటువంటి గుణాలు నీ ఇరుగుపొరుగు వాళ్ళలో వుండాలని కోరుకుంటున్నావో ఆ గుణాలు ముందుగా నీలో వృద్ధి చేసుకో. ఆనాడు తప్పనిసరిగా నువ్వు కోరుకునే ఇరుగు పొరుగు వాళ్ళు లభ్యంకాగలరు!” అని సమాధానమిచ్చాడు.

దేవదాసుకు జ్ఞానోదయమయింది. ‘యోగి మాటలు నిజమే. ఇరుగుపొరుగువాళ్ళతో నా ప్రవర్తనను మార్చుకోవాలి’ మనసులో అనుకొని అక్కడ నుండి కదిలాడు.మారిన రాము

టైం ఉదయం ఎనిమిదిన్నర. పాఠశాల తలుపులు ఇంకా తెరవలేదు. పిల్లలందరూ పుస్తకాలు పట్టుకొని వీధిలో తిరుగుతున్నారు.

అంతలో ఒక వింత జరిగింది.

ఒక మనిషి ఒక ఇంట్లో దొంగతనం చేస్తూ దొరికిపోయాడు. వీధిన పోయే వాళ్లు దొంగను చుట్టు ముట్టేశారు. బాగా దేహశుద్ధి చేసి ఆ మనిషి పారిపోకుండా కాళ్ళూ చేతులూ కట్టిపడేశారు. ఒకరిద్దరు వెళ్లి పోలీస్టేషన్లో దొంగ మీద ఫిర్యాదు చేశారు.పోలీసులు రంగంలోకి దిగారు. దొంగ చేతులకు సంకెళ్ళు వేసి పోలీస్ స్టేషన్కి తీసుకుపోయారు.

పాఠశాల తలుపులు అంతలో తెరిచారు. బిలబిలా విద్యార్థులు పాఠశాలలోకి దూరిపోయారు. ప్రార్థనగంట కొట్టాక మైదానంలోకి వచ్చి వరుసగా నిలబడ్డారు.

ప్రార్ధన పూర్తి అయింది. విద్యార్థులు ఎవరి తరగతికి వాళ్ళు వెళ్ళబోతున్న సమయంలో ప్రధానోపాధ్యాయుడు వాళ్లను ఆగమని చెప్పి, ఇలా ఉపన్యాసం ఆరంభించారు.

“ప్రియమైన విద్యార్థులారా! ఇప్పుడు పోలీసులు తీసుకువెళ్లిన దొంగ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆ దొంగ ఈ బడిలోనే ఒకప్పుడు చదువుకున్నాడు. తరుచు తోటి పిల్లల పెన్నులు. పుస్తకాలు, పెన్సిళ్ళు దొంగిలిస్తుండేవాడు. ఉపాధ్యాయులెంత మందలించినా దొంగబుద్ధిని మార్చుకోలేకపోయాడు. చివరకు బడిమాని దొంగగా స్థిరపడిపోయాడు. ఎన్నోసార్లు లాఠీ దెబ్బలు, జైలుశిక్షలు అనుభవించాడు. కొన్ని నిమిషాలు కిందట అతడికి జరిగిన అవమానం మీరు చూశారు కదా! అతను చిన్నప్పుడు ఉపాధ్యాయులు చీవాట్లు పెట్టేటప్పుడు మారివుంటే ఈనాడు ఈ అవమానం పొందేవాడు కాడు. ఎందుకిదంతా చెప్తున్నానంటే ప్రస్తుతం మన పాఠశాలలో అప్పుడప్పుడూ పెన్సిళ్ళూ, పెన్నులూ, పుస్తకాలూ పోతున్నట్టు ఫిర్యాదులు నాకందుతున్నాయి. దొంగలెవరో ఇంతవరకూ తెలియలేదు. ఆ అబ్బాయికి మాత్రం ఆ బుద్ధి ఏమంత మంచిది కాదు. దొంగతనం అలవాటుగా మారి, అతడు ఎన్నో అవమానాలకు భవిష్యత్తులో గురికాగలడు. ఈరోజు దొంగకు జరిగిన నిర్వాకం చూసైనా బుద్ధి తెచ్చుకుంటారని నమ్ముతున్నాను!” అంటూ ఉపన్యాసాన్ని పూర్తి చేశారు.

పిల్లలు ఎవరి తరగతికి వాళ్ళు వెళ్ళిపోయారు. రెండు పీరియడ్లయ్యాక విరామ సమయం గంటకొట్టారు. పిల్లలందరూ బయటకు వెళ్ళి ఐదు నిమిషాలలో తిరిగి వచ్చేశారు. ఉపాధ్యాయులు పాఠాలు ఆరంభించారు.

అయిదో తరగతి చదువుతున్న రాము మిగిలిన పిల్లలతో పాటు వెంటనే బడిలోకి రాలేదు. ఆ తరగతిలో హెడ్మాష్టారు పాఠం చెప్తున్నారు. పాఠం సగమయింది. రాము ఒక సంచీని మోసుకొని తరగతి గదిలోకి వచ్చాడు. హెడ్మాష్టారి టేబుల్ వద్దకు వచ్చి దాని మీద సంచీని కుమ్మరించాడు. అందులోని పెన్నులూ, పుస్తకాలు, పెన్సిళ్ళు దొంతర దొంతరగా టేబుల్ మీద పడ్డాయి. అందరూ నివ్వెర పోయారు.

రాము తలవంచుకుని “వీటిని నేనే దొంగిలించాను. ఎవరి వస్తువులు వాళ్ళు తీసుకోండి. ఈ నాటినుండి దొంగతనం చెయ్యను. దొంగ ఎన్ని అవమానాల పాలవుతాడో ఉదయం జరిగింది చూశాక నాకర్ధమయింది!” అని అన్నాడు. అతడి కళ్ళనుండి కన్నీరు జారింది. హెడ్మాష్టారు, మిగిలిన ఉపాధ్యాయులు రాము మారినందుకు చాలా ఆనందించారు.

గర్వభంగం

అమరావతి నగరం చివర ఒక ఉద్యానవనం ఉండేది. ఆ ఉద్యానవనంలో మందాకిని అనే ఒక పిచ్చుక వుంటుండేది. ఒకరోజు ఆ వనానికి సుందరి అనే ఒక రామచిలుక వచ్చింది. అది గొప్ప అహంకారి. తనే గొప్ప అందగత్తెనని దానికి గర్వం. అది పిచ్చుకను చూసింది. దానిని వెక్కిరించి ఆట పట్టించాలని తలంచింది. పిచ్చుక దగ్గర వాలి, “ఏయ్ పిచ్చుకా! నువ్వు నా లాగా అందంగా వుండవు! మనుష్యుల్లాగ మాట్లాడలేవు! నా ముక్కు లాగ నీ ముక్కు ఎరుపుగావుండదు! నా కళ్ళు లాగ నీ కళ్ళు పెద్దవిగా వుండవు! హి….. …………” అని విరగబడి నవ్వుతూ వెక్కిరించసాగింది.మందాకిని చిలుక వాలకం చూసి నివ్వెరపడింది. సుందరికి దూరంగా జరిగి రివ్వున మరొక కొమ్మపై వాలింది. సుందరికి అవమాన మనిపించింది. “ఏయ్! పిచ్చుకా! ఎందుకలా నన్ను చూసి దూరంగా ఎగిరావ్? నా కన్నా నువ్వు అందగత్తెవా తెలివైన దానివా?” అని ఎకసెక్కాలాడింది.

పిచ్చుక బాధపడలేదు. “నీకు దగ్గరగా వుంటే నీకు రాబోయే ప్రమాదం నాకు కూడా చుట్టగలదని నా భయం. అంతే” అంది.

చిలుక ఫకాలున నవ్వింది. “పక్షిజాతి అంతటికీ నేనంటే భయం! నా ముక్కంటే భయం! నా మాటంటే భయం! ఎవ్వరూ ఏమీ నన్ను చెయ్యలేరు. నా తెలివితేటలంత గొప్పవి!” అని సుందరి బీరాలు పలికింది.

మందాకిని విస్తుపోయింది. “చిలుకా! చిలుకా! అందమైన దానినని బులిసిపోకు! మాట్లాడగలనని మురిసిపోకు! ఎరుపు ముక్కు వున్నదని గొప్పైపోకు! పెద్దకళ్ళు ఉన్నాయి కదా అని తైతక్కలాడకు! నువ్వెంత తొందరగా ఈ ఉద్యానవనం దాటి వెళ్ళిపోతే అంత మంచిది నీకు! ” అని చిలుకకు సలహా ఇచ్చింది.

చిలుక అంతెత్తున కోపంతో ఎగురుతూ “ఏం, నన్ను బెదిరిస్తున్నావా?” అని పిచ్చుకనడిగింది.

పిచ్చుక వెంటనే, “అదెంత మాట! అందవికారమైన దానిని! నేను నిన్ను బెదిరించగలనా? నీ మంచి కోరి విన్న వించుకుంటున్నాను. జాగ్రత్తగా విను! మీ చిలుక జాతికున్న అందం మీ స్వేచ్చా బ్రతుక్కి ముందర కాళ్ళు బంధం లాంటిది. ఈ ఉద్యాన వనంలో రాకుమార్తె తిరిగేవేళ ఆసన్నమయింది. ఆమె దృష్టిలో పడ్డావా. నీ పని సరి! గర్వంతో ఇంకా ఇక్కడ వుండకు! దయచేసి పో!” అని చిలుకకి హితబోధ చేసింది.

చిలుక కదలలేదు. గర్వంతో కళ్ళు నెత్తికెక్కాయి. మూతి వంకర చేసి పిచ్చుకను వెక్కిరించడం ఆరంభించింది. పిచ్చుక మరి వాదన పెంచుకోలేదు. రివ్వున ఎగిరి మరొక చెట్టుపై వాలిపోయింది.

అయితే ఎక్కడి నుండి వచ్చిందో ఒక వల చిలుక మీదకు విసురుగా వచ్చి పడింది. అప్పటికి గాని చిలుక కళ్ళు నెత్తినుండి క్రిందకి దిగలేదు. పరిస్థితి గమనించి తప్పించుకోడానికి రెక్కలు టప టప కొట్టుకొంది. ఫలితం కనిపించలేదు. రాజభటులు దగ్గరకు వచ్చేశారు. “అయ్యో! గర్వంతో పిచ్చుక మాట వినకుండా పోయానే. ఎంత ఘోరం జరిగింది! ఈ రోజునుండి నాకు ఇక స్వేచ్చే లేదా?” అని వల వల ఏడుస్తూ రాజభటుల చేతికి చిక్కిపోయింది సుందరి

శ్రీమంతుని స్నేహం

మగ్గంపై బట్టలు నేస్తూ బతుకుతున్న పద్మనాభయ్య వికటకవిగా పేరు పొందాడు. అతడి గొప్పతనం జమీందారు వరకు వెళ్ళింది. జమీందారు రోజూ పద్మనాభయ్యను కొలువుకు పిలిచి అతని హాస్య కవిత్వం వింటూ కాలం వెళ్లబుచ్చసాగాడు. జమీందారు మాట జవదాటలేక పద్మనాభయ్య రోజూ జమీందారు కొలువుకు వెళ్తుండేవాడు. అతని చేనేత వృత్తి దెబ్బతింది. కుటుంబాన్ని గడవడం అతనికి కష్టసాధ్యమయింది. అవసరం వచ్చి ఎవరినైనా అప్పు అడిగినా “నీకేమి? జమీందారు స్నేహితుడవయ్యావు” అని తప్పించు కోవడం ఆరంభించారు. అందరి దృష్టిలో పద్మనాభయ్య ఒక శ్రీమంతుడై పోయాడు.

రోజులు భారంగా గడుస్తున్నాయి. తన ఆర్థిక దుస్థితి లోకానికి తెలియజెయ్యాలను కున్నాడు. పద్మనాభయ్య ఒకరోజు సాయంత్రం కొడుకు పుట్టినరోజు పండుగకని పట్టణంలోని ప్రముఖుల నందరినీ ఆహ్వానించాడు. పురప్రముఖులందరూ జమీందారు స్నేహితుడైన పద్మనాభయ్య ఇవ్వబోయే విందును ఊహించుకుని గొప్ప గొప్ప కానుకలతో అతడింటికి వెళ్ళారు.

పద్మనాభయ్య ఇంట్లో లేడు. అతని భార్యాపిల్లలు కానుకలందుకుని వచ్చిన వాళ్ళను కూర్చోమని మర్యాద చేశారు. అందరూ కూర్చున్నారు. అంతలో విస్తరాకుల దొంతరతో పద్మనాభయ్య వచ్చాడు. ఆలస్యమైనందుకు అతిథులను మన్నించమని చెప్పి వాళ్ళ ముందు విస్తరాకులు సర్దాడు. అంత పెద్ద విస్తరాకులు అక్కడున్న వాళ్లెవరూ అంతకుముందు చూడలేదు. విస్తరి నిండా వెయ్యబోయే మిఠాయిలను ఊహించుకుంటూ అందరూ లొట్టలెయ్యసాగారు. అప్పుడు తెచ్చాడు పద్మనాభయ్య ఒక పెద్ద తొట్టినిండా నానేసిన అటుకులు. కూర్చున్న వారి ముఖాలను చూడకుండా గబగబా విస్తర్లలో వడ్డించి “నా తాహతుకు తగ్గట్టుగా చేసిన విందును స్వీకరించండి” అని అన్నాడు.

పురప్రముఖులు మండిపడ్డారు. “విందుకు పిలిచి మమ్మల్ని అవమానించావు, జమీందారుతో చెప్పి నీకు దండన వేయిస్తాం” అని చిరుబుర్రులాడుకుంటూ విస్తర్ల ముందు నుంచి లేచారు.

పద్మనాభయ్యకు కావలసింది అదే. ఎవరినీ బతిమిలాడి కూర్చోపెట్టలేదు.

అందరూ జమీందారు వద్దకు వెళ్ళారు. “మీ అండ చూసుకుని విర్రవీగి మీ మిత్రుడు మమ్మల్ని అవమానించాడు. అతడిని దండించండి!” అని జరిగిందంతా పూసగుచ్చి ఫిర్యాదు చేశారు.

జమీందారుకూ పద్మనాభయ్య మీద ఆగ్రహం కలిగింది. వెంటనే కొలువుకు పద్మనాభయ్యను పిలిపించాడు.

సభ నిశ్శబ్దంగా వుంది. పద్మనాభయ్య చేతులు కట్టుకుని జమీందారు ముందు నిలబడ్డాడు. జమీందారు కోపంగా “విందుకు పిలిచి అవమానించావట! నిజమేనా! ఎందుకలా చేశావు?” అడిగాడు. “మీతో స్నేహం కుదిరిందని నన్ను పూర్తిగా శ్రీమంతుల జాబితాలో కలిపారు. అవసరానికి అప్పు పుట్టడం గగనమవుతోంది. అందువల్ల లోకానికి నా వరిస్థితిని తెలియపర్చడానికి ఈ వని చేశాను. ప్రభువులు మన్నించాలి. మీ స్నేహం వల్ల మీ ధనాగారం నుంచి నేనెంత లాభపడుతున్నానో మీకు తెలియనిది కాదు!” అని మనవి చేసుకున్నాడు.

జమీందారుకు కనువిప్పు కలిగింది. త్వరలోనే మీ అందరకూ మంచి విందును పద్మనాభయ్య ఏర్పాటు చేయగలడంటూ పట్టణ ప్రముఖులను పంపించి వేశాడు. అందరూ వెళ్ళిపోయాక పద్మనాభయ్య చేతిని తన చేతిలోకి తీసుకుంటూ “నేటి నుంచి నా ఆస్థాన కవిగా ఉండు. నెలకు ఐదు వందల వరహాలు నీకు జీతం ఏర్పాటు చేస్తాను.” అన్నాడు.

తన ప్రయత్నం ఫలించినందుకు పద్మనాభయ్య ఎంతో సంబరపడ్డాడు. తన మనస్సంతా కవిత్వం మీదే కేంద్రీకరించి గొప్ప కవిగా పేరు తెచ్చుకున్నాడు.

ప్రేమ పరీక్ష

ధనగుప్తుడు విజయనగరంలో ముత్యాల వర్తకుడు. అతడికి దీపవర్మ అనే మిత్రుడున్నాడు. ఆ మిత్రుడు వైద్యం చేస్తూ విజయనగర పట్టణంలోనే వుంటున్నాడు. ఒకనాడు ధనగుప్తుడు దీపవర్మను కలుసుకొని “మిత్రమా! నాకు ఇద్దరు కొడుకులు ఉన్నట్టు తెలుసుకదా. ఆ ఇద్దరిలో ఎవరికి నా మీద నిజమైన ప్రేమ ఉందో నాకు తెలియకుంది. ప్రేమ ఉన్న కొడుకుకి ఊర్లో వ్యాపారం అప్ప జెపుతాను. ఊర్లో వ్యాపారం వల్ల ఆ కొడుకు నా ఆలనాపాలనా చూసుకోగలడు. నా ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ చూపించగలడు. ఇంకొక కొడుక్కి పైఊళ్ళల్లో వ్యాపారం అప్పజెపుతాను. నీవు బాగా ఆలోచించి నా కొడుకులిద్దరిలో ఎవరికి నా మీద నిజమైన ప్రేమ ఉన్నదీ తేల్చి చెప్పాలి!” అని కోరేడు.

దీపవర్మ ఆలోచనలో పడ్డాడు. కొద్దిక్షణాల తరువాత ధనగుప్తుడితో, “నువ్వు రేపటిదినం అనారోగ్యంతో బాధపడుతున్నట్టు నటించు. మందుకోసం ఉదయాన పెద్దకొడును, సాయంత్రం చిన్నకొడుకును నా వద్దకు పంపించు. చిన్న పరీక్ష పెడతాను. ఎవరు ఆ పరీక్షలో నెగ్గేరో రాత్రికి మీఇంటికి వచ్చి నీకు తెలియపరుస్తాను!” అని ఉపాయం చెప్పాడు.

ధనగుప్తుడు సరే అని మిత్రుని వద్ద నుండి సెలవు తీసుకున్నాడు.

అనుకున్న ప్రకారం ఉదయం పెద్ద కొడుకును ధనగుప్తుడు దీపవర్మ వద్దకు పంపించాడు.

దీపవర్మ ధనగుప్తుడి పెద్దకొడుకు తండ్రికి వచ్చిన రోగలక్షణాలు చెప్పాడు.

దీపవర్మ బెంబేలు ఎత్తినట్టు నటించి, “నీ తండ్రికి వచ్చిన జబ్బు చాలా తీవ్రమైన జబ్బు! విలువైన మందులు వాడాలి. మందులు తయారు చేయడానికి పదివేల వరహాలు ఖర్చు పెట్టాలి. ఇంత విలువైన వైద్యం జరిపినా నయమవుతుందని నేను మాత్రం మాటివ్వలేను. అందువల్ల ఇంట్లో వాళ్ళతో సంప్రదించి నాతో చెప్పు! మందు సిద్ధం చేస్తాను” అని అన్నాడు.

ధనగుప్తుడి పెద్ద కొడుకు దీపవర్మతో ఇంటికి వెళ్ళివస్తానని చెప్పి ఇంటికి వెళ్ళకుండానే రెండు క్షణాలలో తిరిగి వచ్చాడు. దీపవర్మతో “అంతవిలువైన మందు తీసుకోవడానికి మా నాన్నగారికి ఎంతమాత్రం ఇష్టంలేదు. ఆస్తి హరించుకునిపోతుందని ఆయన భయపడుతున్నారు. సాధారణమైన మందే ఇమ్మన్నారు!” అని చెప్పాడు.

దీపవర్మ మనస్సులో నవ్వుకున్నాడు. ఏదో ఇంత మందు తీసి ఒక సీసాలో పోసి ఇచ్చాడు. ధనగుప్తుడి పెద్దకొడుకు ఆనందంతో వెళ్ళిపోయాడు.

సాయంత్రం అయింది. ధనగుప్తుడి రెండోకొడుకు దీపవర్మ వద్దకు వచ్చాడు. ఆందోళన పడుతూ తండ్రి గురించి దీపవర్మకు చెప్పాడు. దీపవర్మ పెద్ద కొడుక్కి చెప్పినట్టే చిన్న కొడుక్కి కూడా మందు గురించి చెప్పాడు. చిన్నకొడుకు – “ఇంటికి వెళ్ళి మా నాన్నగారితో చెప్పవలసిన అవసరం లేదు. ఎంత విలువైనది అయినప్పటికీ మీరు మందు తయారు చేయవలసిందే. ఇంటికి వెళ్ళి మా నాన్నగారికి నచ్చజెప్పి ఆ డబ్బు తీసుకొస్తాను!” అని ఇంటికి వెళ్ళాడు.తండ్రితో అతడు అంతా చెప్పాడు. ధనగుప్తుడు ముందు వద్దన్నాడు. కొడుకు నచ్చజెప్పాడు. చివరకు సరే అన్నాడు ధనగుప్తుడు. కొడుకు ఆనందానికి అంతులేకపోయింది. దీపవర్మ వద్దకు వెంటనే వెళ్ళి మందు తయారు చేయమని చెప్పాడు. దీపవర్మ మనస్సు తృప్తిపడింది. రాత్రి అయింది. దీపవర్మ మిత్రుడి వద్దకు వెళ్ళాడు. మిత్రుడితో ప్రేమ పరీక్షలో ఏ కొడుకు నెగ్గినదీ చెప్పాడు.

ధనగుప్తుడు ఆనందించాడు. మర్నాడే చిన్నకొడుక్కి ఊర్లో వ్యాపారం, పెద్దకొడుక్కి పై ఊళ్ళో వ్యాపారం అప్పజెప్పి నిశ్చింతగా జీవితమంతా గడిపేడు.

విశ్వాసం

కుండపోతగా వర్షం కురుస్తుంది. కన్ను పొడుచుకున్నా కనిపించని కటిక చీకటి అలుముకుంది. మల్లన్న అడవిమార్గం దాటి కొత్తపట్నంవైపు బయల్దేరాడు. కొత్తపట్నంలో జమీందారుగారి బంగళాకి మల్లన్న ప్రయాణం!

ఆకాశంలో మెరుపులూ, ఉరుములూ భయంకరంగా వుండి, అడవినుంచి గాలి. ప్రయాణం మధ్యలో అడవి ప్రక్కనే వున్న పల్లె తగిలింది. ఆకాశంలో మెరుపు మెరిసింది. మెరుపు కాంతిలో పాత పెంకుటిల్లు కనిపించింది మల్లన్నకి. ఇంట్లోకి వెళ్ళాడు మల్లన్న. ఆ ఇల్లు ఒక అవ్వది. చుట్టు ప్రక్కల ఎవ్వరూ లేని ఇంట్లోధైర్యంగా వుంటోంది అవ్వ! మల్లన్న ఆ ఇంట్లో ప్రవేశించే సమయానికి అవ్వ పాముకు పాలు పోస్తోంది. అవ్వ దృష్టిలో పడ్డాడు మల్లన్న. “ఎవరు నువ్వు?” అని ఆమె ప్రశ్నించింది. అవ్వ ఒక్కతే ఇంట్లో వున్న సంగతి అతడికి అర్థమయింది. తడబడుతూ “పార్వతీపురం నుండి వస్తున్నాను; కొత్తపట్నంలో పని వుంది. వర్షంలో వెళ్ళడానికి భయంగా వుంది. వర్షం తగ్గాక వెళ్తాను. అంతవరకు…..” అతడు మాట పూర్తి చెయ్యలేదు. అవ్వ బోసినవ్వు నవ్వింది. “కంగారు పడకు, బాగా చలిగా వుంది. వేడి అన్నమూ, పులుసూ కమ్మగా వండిపెడతా, ఇంత తిని హాయిగా నిద్రపో!” అంది అవ్వ.

పాము పాలు త్రాగడం పూర్తి చేసి నెమ్మదిగా తన బుట్టలోకి వెళ్ళి, లుంగ చుట్టుకుపడుకుంది. పాము బుట్టప్రక్కనే అవ్వ పండుకునే మంచం వుంది.

మల్లన్న సంభాషణను పొడిగించలేదు. బల్లమీద కూర్చుని వర్షం వైపు చూస్తున్నాడు. అంతలో అవ్వ తువ్వాలందించింది. “తల తుడుచుకో! గజదొంగ ఒకడు ఈ ప్రాంతంలో తిరుగుతున్నాడు. రాత్రుళ్ళల్లో ఎవరైనా ఒంటరిగా కనిపిస్తే, నిలువు దోపిడీ చేసి ప్రాణం తీయగలడు!” అంది. మల్లన్న పొడిబట్ట అందుకొని ముఖం చాటు చేసుకున్నాడు.

అవ్వ వంట చేసింది. అతడికి వడ్డించింది. భోజనం చేస్తూ ఆమె మెడలోని హారాన్ని చూశాడతడు. అతడి కళ్ళు జిగేల్ మన్నాయి. అవ్వ అతడ్ని చూచి “ఒక అర్ధరాత్రి ప్రమాదకర పరిస్థితిలో ఒక మనిషి నా ఇంటికి వచ్చాడు; అతడు మారువేషంలో దేశసంచారం చేస్తున్న రాజని నాకు తెలియదు, నా శక్తి మేరకు సేవ చేసి, అతడికి సేద తీర్చాను. నా ఆతిథ్యం స్వీకరించి, అందుకు గుర్తుగా ఈ హారాన్ని నాకు కానుకగా ఇచ్చాడు!” అంది.

మల్లన్న సంతోషించాడు. ఈ రాత్రికి ఇక్కడ ఆగిపోవడం లాభించిందని పొంగిపోయాడు. మల్లన్న భోజనం పూర్తి అయింది. వర్షం తగ్గుముఖం పట్టింది. అతడి కళ్ల ముందు హారం మెరుస్తూనే వుంది, అవ్వ ఏర్పాటు చేసిన పక్కమీద ఆలోచనతో అటూ ఇటూ దొర్లుతున్నాడు; నిద్ర పట్టలేదు; అవ్వ వంటగది సర్ది హారం తీసి పెట్టెలో పెట్టి నిద్రకు మంచం ఎక్కింది.

అవ్వవైపు చూస్తూ మల్లన్న నిద్ర పట్టినట్టు నటించాడు. కొంతసేపటికి అవ్వ గురక పెట్టింది. క్షణం కూడా ఆలస్యం చెయ్యలేదు మల్లన్న. మెల్లగా లేచి రెండడుగులు వేశాడు; అవ్వ కదిలింది; అతడు కంగారు పడ్డాడు; ఆతృతలో అతడి కాలికి ఏదో తగిలి చప్పుడయింది. అవ్వ దిగ్గున లేచి కూర్చుంది. అతడి మనస్సులోని ఉద్దేశం పసిగట్టి, అరవబోయింది. అంతే! ఆమె అరపు గొంతులోనే ఉండిపోయింది. ఆమె గుండెల్లో మల్లన్న చేతి కైజారు దిగిపోయింది. గబగబా పెట్టె తెరచి, హారం చేతిలోకి తీసుకున్నాడు. హారం చూస్తూ మురిసిపోయాడు. వెనక పడగవిప్పి కాటు వెయ్యడానికి సిద్ధంగా వున్న పామును గమనించలేదు. ఇంతకు ముందు అతడి కాలికి తగిలింది. పామువున్న బుట్టే! అవ్వ చచ్చిపోయిందని మల్లన్న పొంగిపోయాడు. కాని, అతడి సంతోషం ఒక్కక్షణం కూడా నిలవలేదు. హారం వున్న చేతిమీదికి ఎగిరి పాము కాటువేసింది. “అమ్మోయ్!” బాధగా అరిచాడు మల్లన్న! అతడి చేతిలోని హారం ఎగిరి అవ్వమీద పడింది. మల్లన్న హారం వైపు సైతం చూడలేకపోయాడు. విషం శరీరంలోకి ఎక్కుతోంది. ఒళ్ళంతా నిప్పుకణిక పెట్టినట్టు కాలుతోంది. మల్లన్న పల్లెమధ్యకు పరుగెత్తాడు. వర్షం తగ్గిపోయింది. “రక్షించండోయ్ బాబూ! రక్షించండి!’ చావుకేకలు వేశాడు మల్లన్న.

అతడి కేకల్తో పల్లె ప్రతిధ్వనించింది. గ్రామస్తులు తెల్లబోయారు. తలుపులు తెరుచుకొని బయటకు వచ్చారు. మల్లన్న వద్దకు వచ్చి, “ఏమయింది?” అని ప్రశ్నించారు. పాము కాటు వేసిందని చెప్పాడు మల్లన్న. గ్రామస్తులు, “ఫర్వాలేదు, ధైర్యంగా వుండు; మా పల్లెలోపామును పెంచుకొనే అవ్వ వుంది. ఆమెవద్ద విరుగుడు మందు వుంది. విషాన్ని హరించే పసరు వెయ్యగలదు!” అన్నారు.

అంతలో ఒకడు ముందుకు వచ్చి “ముందు ఇతన్ని ఆ అవ్వ వద్దకు తీసుకుపోదాం. ఆలస్యం అయితే, ఇతని ప్రాణాలు పోతూంది రండి” అంటూ మల్లన్నను తమతో రమ్మని తీసుకుపోసాగారు. కానీ వీరికి మల్లన్న అవ్వను చంపిన సంగతి తెలియదు. తాను చంపిన అవ్వ దగ్గరికి తనను తీసుకువెళుతున్నారని మల్లన్నకు తెలిసింది.

మల్లన్న గుండె గుభేల్ మంది. విషం శరీరమంతా పాకింది. చేసిన పనికి పశ్చాత్తాప పడ్డాడు. అవ్వవద్దకు తీసుకువెళ్తున్న గ్రామస్తులను ఆపి “అవ్వ ఇంటి నుండి వస్తున్నాను; అన్నం పెట్టి ఆదరించిన ఆమెను హత్యచేసాను: పాము జన్మ ఎత్తినా నాకంటే ఆ పామే గొప్పది, విశ్వాసం చూపింది; అవ్వను చంపిన ఈ కృతఘ్నుడికి పాము తగిన శిక్షే వేసింది!” నురుగులు కక్కుతూ ప్రాణం విడిచాడు గజదొంగ మల్లన్న!

మురళీధరుడి సన్మానం

అవంతీ రాజయిన శేషేంద్రవర్మకు తన పుట్టిన రోజు పండుగ సందర్భాన ఒక సంగీత విద్వాంసుడిని సన్మానించాలన్న కోరిక కలిగింది. మంత్రిని పిలిచి తన కోరికను తెల్పి సన్మానానికి ఎవరు అర్హులో నిర్ణయించే బాధ్యతను అప్పజెప్పాడు. మంత్రి బాగా ఆలోచించి చివరకు కాశీ విద్యాపీఠంలో సంగీతాచార్యునిగా వుంటున్న మురళీధరుడిని సన్మానానికి ఎన్నిక చేశాడు.

మంత్రి నిర్ణయం రాజాస్థానంలోని కొందరు ఉన్నతాధికారులకు నచ్చలేదు. వాళ్ళకు అవంతీనగరంలోనే వుంటున్న కృష్ణశర్మంటే మహా మోజు. రాజును కలుసుకుని, “మహారాజా! మహావిద్వాంసుడైన కృష్ణశర్మనువదిలి ఎక్కడో దూరాన వున్న కాశీనగర విద్వాంసుడిని రప్పించి సన్మానం చెయ్యడంలో ఔచిత్యం కనిపించలేదు. మహామంత్రి ఈ విషయంలో తప్పటడుగు వేశారు” అని ఫిర్యాదు చేశారు.

శేషేంద్రవర్మ ఉన్నతాధికారుల ఫిర్యాదును లక్ష్యపెట్టలేదు. “మహామంత్రిపై నాకు నమ్మకముంది. అతడేనాడు తప్పటడుగు వెయ్యడు!” అని అతడు ఉన్నతాధికారులను మందలించి పంపించివేశాడు.

శేషేంద్రవర్మ జన్మదినోత్సవ రోజు వచ్చింది. ఉత్సవ వేడుకలు చూడడానికి రాజ్యం నలుమూలల నుండి ప్రజలు తండోపతండాలుగ నగరం చేరుకున్నారు.

మధ్యాహ్నమయింది. నగరానికి వస్తున్న మురళీధరుడికి స్వాగతం పలుకడానికి అధికారులు నగర ప్రవేశద్వారం వద్దకు వెళ్ళారు. అంతలో మురళీధరుడున్న రథము వచ్చింది. అధికారులు రథాన్ని ఆపి మురళీధరుడిని ఆహ్వానించారు. మురళీధరుడు అధికారులుతో ఎక్కువ మాట్లాడలేదు. “క్షమించండి! మీతో నేను రాలేను. నగరంలో పని వుంది. ఆ పని పూర్తి చేసుకొని సభకు వచ్చేస్తాను!” అని చెప్పి రథాన్ని నగరంలోకి తీసుకు వెళ్ళమని రథసారధికి హెచ్చరించాడు. అధికారులు ముఖాలు మాడ్చుకున్నారు. రాజువద్దకు వెంటనే వెళ్ళి, “మహారాజా! మంత్రిగారు ముచ్చటపడి ఎన్నిక చేసిన మురళీధరుడు వచ్చాడు. మాతో కలసి సభకు రావడానికి ఇష్టపడడం లేదు. నగరంలో మీ కార్యక్రమం కన్నా ముఖ్యమైన కార్యక్రమాలు వున్నాయట! అవి పూర్తి చేసుకుని సభకు వస్తానన్నాడు. రాజన్న గౌరవం కూడా మీ మీద లేనట్టుంది. ఉంటే ముందుగా మీ దర్శనం చేసుకోకుండా ఉండగలడా?!” అని నిష్ఠూరంగా పలికారు. శేషేంద్రవర్మ అధికారుల మాటలను పట్టించుకోలేదు.

సాయంత్రమయింది. సభా ప్రాంగణం జనంతో కిటకిటలాడుతుంది. మురళీధరుడి కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఉన్నతాధికారులు గుసగుసలాడిపోతున్నారు. వాళ్ళను చూసి మహామంత్రి చిన్నగా నవ్వుకున్నాడు.

అంతలో మురళీధరుడు రథం నుండి దిగి సభా వేదికను చేరుకున్నాడు. సభ నిశ్శబ్దమయింది. మురళీధరుడు మహారాజుకు మహామంత్రికి ఉన్నతాధికారులకు, సభకు వచ్చిన ప్రజలకు నమస్కరించి, “నా ఆలస్యమునకు మీరందరూ మన్నించాలి. నా బాల్యం గడిచిన నగరం ఇది. లేబ్రాయంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకొని ఈనగరంలో అనాధగా తిరుగుతుండేవాడిని. నన్ను ఏడుగురు గొప్ప మనస్సున్న తల్లులు ఆ సమయాన చేరదీశారు.

రోజుకో తల్లి వంతున ఇంతన్నం పెట్టి నన్నాదుకున్నారు. సంగీతం మీద గల నా ఇష్టాన్ని గుర్తించి సంగీతం నేర్పించారు. నేనీనాడు ఈ ఉన్నత స్థాయిని చేరేనంటే అంతా ఆ మహాతల్లుల చలవే. ఆ మహాతల్లులను నేనెన్నటికీ మర్చిపోలేను. అందుకే ఈ నగరానికి వచ్చీరాగానే ఆ తల్లుల దర్శనం చేసుకోకుండా వుండలేక పోయాను. వాళ్ళను దర్శించి వారి ఆశీస్సులు పొంది సభకు బయలుదేరడంతో ఆలస్యమయింది!” అన్నాడు.

సభకు వచ్చిన ప్రజలు మురళీధరుడి ప్రసంగం విని అబ్బురపడ్డారు. అతడి కృతజ్ఞతా భావానికి జేజేలు పలికారు. మహారాజు, మహామంత్రి ఉన్నతాధికారుల వంక చూశారు. ఉన్నతాధికారులు ముఖం చాటు చేసుకున్నారు.

వేద పురోహితులు మంత్రాలు చదువుతుండగా శేషేంద్రవర్మ మురళీధరుడిని సన్మానించాడు. మురళీధరుడు కృతజ్ఞతలు తెల్పి, తన మృధు మధురగాత్రంతో సంగీతాలాపన చేసి సభను ఉర్రూతలూగించాడు. ప్రజలు మురళీధరుడి మధుర గాత్రాన్ని వేనోళ్ళ పొగిడారు. మురళీధరుడు ఆ మరునాడే కాశీనగరానికి బయలుదేరి వెళ్లిపోయాడు. ఉన్నతాధికారులు మహారాజు వద్దకు వచ్చారు. “మహారాజా! మురళీధరుడిని సన్మానానికి ఎంచడం సరి అయిన నిర్ణయమే అని మేం ఒప్పుకుంటున్నాం. మహా విద్వాంసుడు గొప్ప వినయ సంపన్నుడు, కృతజ్ఞతయే ఊపిరిగా తీసుకుని బతుకుతున్న మురళీధరుడు ఎక్కడ? కనీ పెంచీ విద్యాబుద్ధులు నేర్పించిన తల్లిదండ్రులను హింసించి ఆనందించిన కృతఘ్నుడు, త్రాగుబోతు, పొగరుబోతు అయిన కృష్ణశర్మ ఎక్కడ?! మత్తెక్కించే పానీయాలు మా అందరికీ పంచిపెడుతున్నాడన్న అభిమానంతో మేం కృష్ణశర్మను వెనకేసుకొచ్చాం. అందుకు మేమెంతో బాధపడుతున్నాం. మహామంత్రి నిర్ణయం సరియైనదే. మమ్మల్ని క్షమించండి!” అని వేడుకున్నారు.

మహారాజు మందహాసం చేసి, “మహామంత్రి సన్మానితుని విషయంలో తప్పటడుగు వెయ్యలేదని గ్రహించారు చాలు!” అని అన్నాడు.

చాటునుండి అంతా వినిన మహామంత్రి ఉన్నతాధికారులు పశ్చాత్తాపపడినందుకు ఎంతగానో సంతోషించాడు.

బెదురు

గిరిజ మారుమూల పల్లెనుంచి నగరం వచ్చిన పిల్ల! వాళ్ళ బాబాయి గారి ఇంట్లో ఉంటూ ఆమె సిటీ హైస్కూల్లో 6వ తరగతి చదువుతూంది.

ఆమె తెలివైనదే కాని బెదురెక్కువ. ఎప్పుడూ తరగతిలో వెనుక బెంచీలో కూర్చునేది. మాస్టార్లు పాఠాలు పూర్తయ్యాక పిల్లలకు ప్రశ్నలు వేస్తే వాటికి జవాబులు తెలిసినా నోరు మెదిపేది కాదు.

మనస్సులో ఎక్కడో ఆ జవాబులు తప్పని గిరిజకు అనుమానం. నగరం పిల్లల చురుకుదనం వాళ్ళ మాట తీరు, కట్టుతీరు, నడక తీరు చూసి వాళ్ళందరు గొప్ప తెలివైన వాళ్ళని ఆమె అభిప్రాయపడుతుండేది.అందుకే ఆమె వాళ్ళతో కలిసి తిరిగేది కాదు. అంతగా మాట్లాడేది కాదు. చివరకు గిరిజ అందరి దృష్టిలో ఒక పల్లెటూరి బెరుకుపిల్ల అయింది.

రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు తరగతి ఉపాధ్యాయుడు పాఠం చెబుతుండగా ఒక సర్క్యులర్ అందుకుని చదివి ఇలా వినిపించాడు. “6వ తరగతి, 7వ తరగతి చదువుతున్న బాల బాలికలకు నగర బాలానందం సంఘం వారు పాటల పోటీ ఏర్పాటు చేస్తున్నారు. పోటీలో పాల్గొనదలచిన విద్యార్థులు రేపు సాయంత్రంలోగా ప్రధానోపాధ్యాయునకు పేర్లు ఇవ్వవలసినదిగా కోరడమైనది.”

విద్యార్థులు సర్క్యులర్ విన్నారు. పోటీ గురించి కాసేపు గుసగుసలాడుకున్నారు. ‘సైలెన్స్! సైలెన్స్!” అని హెచ్చరిక చేసి టీచర్ మళ్ళీ పాఠం చెప్పడం ఆరంభించారు. పాఠం వినడంలో గిరిజ లీనమైపోయింది.

సాయంత్రం హైస్కూలు వదిలారు. గిరిజ ఇంటికి చేరుకుంది. ఇంట్లో వున్న బాబాయ్, “గిరిజా! ఈ రోజు మీకు పాటల పోటీ గురించి సర్క్యులర్ వచ్చిందా” అని అడిగాడు.

“ఆఁ వచ్చింది!” హాలులో వున్న పుస్తకాల షెల్స్లో పుస్తకాలు సర్దుతూ గిరిజ అంది.

వాళ్ళ బాబాయి సంభాషణ పొడిగించాడు.

“నీకు పాటలు బాగా వచ్చు కదా పోటీకి వెళ్లకూడదా?” అడిగాడు.

“అబ్బే! పోటీకి నేను వెళ్ళడమా? పల్లెపదాలు తప్పించి నాకేం తెలుసు?” గిరిజ సమాధానమిచ్చింది.

“పల్లెపదాలు కూడా మంచివే. బాగా పాడొచ్చు. నువ్వు పోటీకి వెళ్ళావంటే బహుమతి తప్పదు” అన్నాడు.

గిరిజ వాళ్ళ పిన్ని అప్పుడే హాల్లోకి వచ్చింది. గిరిజ చెంగున ఆమె దగ్గరకు చేరి, “చూడు పిన్నీ! బాబాయ్ ఎలా నాతో వేళాకోళమాడుతున్నాడో పల్లెటూరి పిల్లను. ఇంత పెద్ద పట్టణంలో పోటీకి నిలబడగలనా?” అని అంది.

పిన్ని గిరిజను అక్కున చేర్చుకుంది. “బాబాయ్ వేళాకోళమాడడం లేదు గిరిజా! నగరంలోని పిల్లల వేష భాషలు చూసి భయపడకు. వాళ్ళలో కూడా మెచ్చుకోదగిన వారుంటారు. నేను కాదనను. నువ్వు పోటీకి వెళ్తే

బహుమతి నీకు తప్పక వస్తుందని నా నమ్మకం” గిరిజను ప్రోత్సహించింది.

మర్నాడు గిరిజ పాఠశాలకు వెళ్ళీవెళ్ళగానే హెడ్మాష్టారు రూమ్లోకి ఉత్సాహంగా వెళ్ళింది. పాటల పోటీకి పేరిచ్చి క్లాస్ూమ్లోకి వచ్చింది. తోటి విద్యార్థుల గుసగుసలు ఆమె వినిపించుకోలేదు.

పాటల పోటీ నిర్వహించిన రోజు వచ్చింది. ఆమె పోటీలో పాల్గొంది. పోటీ పాటలు వినడానికి వచ్చిన వాళ్ళందరూ గిరిజ పాట విని అబ్బురపడిపోయారు. మొదటి బహుమతి గిరిజకే దక్కింది. కరతాళధ్వనులు మిన్నుముట్టగా ఆమె కలెక్టర్ చేతినుండి బహుమతిని అందుకుంది.

ఆరోజు నుండి ఆమె మనస్సులోని బెదురు పూర్తిగా తొలగిపోయింది.

ప్రాణం తీసిన దురాశ!

కృష్ణరాయపురానికి రెండు మైళ్ళ దూరాన ఒక పాడుబడ్డ కోట వుంది. ఆరేడు శతాబ్దాల కిందట ఆ కోట గొప్ప ప్రాభవంతో విలసిల్లిందంటారు. రాజ్యాలూ, రాజులూ అంతరించిపోయాక అది గత వైభవాలకు గుర్తుగా నిలబడి వుంది.

రాజయ్య మేకల కాపరి. ఒకరోజు మేకలను కోటకు తోలుకు వెళ్ళాడు. పచ్చని రొడ్డ కనిపించగానే మేకలు ఆనందంతో మే మే అరుస్తూ పోటీపడి తినసాగాయి. రాజయ్య సంతోషించాడు.

మేకలు మేస్తున్న స్థలానికి దగ్గరలోనే మర్రినీడన చేరికూర్చున్నాడు.రాజయ్యకు ఊసు పోలేదు. దగ్గరలో ఒక కుండ పెంకు కనిపిస్తే దానితో కూర్చున్న చోటు వద్దే మట్టి తవ్వడం ఆరంభించాడు. గట్టి నేల కాకపోవడం వల్ల తొందరగా మట్టి వస్తుంది. గబగబ అతడు రెండు చేతుల్తో మట్టి బయటకు తీశాడు.

అతని మనస్సులో ఎందుకో నిధి మెదిలింది. కోటల్లో నిధులు అక్కడక్కడా నిక్షిప్తమై వుంటాయని ఎప్పుడో విన్నాడు. అది నిజమైతే…. అనుకుంటున్నాడు.

మట్టి పొర తరువాత అక్కడ ఒక రాతి పలక అడ్డు వచ్చింది. తన ఊహ నిజం అవుతుందేమోనని ఆశపడ్డాడు. ఇటూ అటూ చూశాడు. ఎవరి అలికిడీ లేదు. ఒక చిన్న రాయి తెచ్చి రాతి పలక మీద కొట్టాడు.

లోపల గుల్లగా వున్నట్టు శబ్దం వినిపించింది. అంతే. తప్పనిసరిగా అది నిధే కావచ్చుననుకున్నాడు.

అంతలో పొద్దుకూడా వాలింది. మేకలను తోలుకొని ఇల్లు ముఖం పట్టాడు. దారంతా పిచ్చి ఆలోచనలు. ఇల్లు చేరాడు. మేకలను దొడ్డిలో పెట్టి భార్యకు విషయం చెప్పాడు.

భార్య రాజయ్య మాటలను నమ్మలేదు. రాజయ్య స్నానం చేసి భోం చేశాడు. అతని మనస్సు నిండా ఆలోచనలే. నిధే నిజమయితే తన వంశంలోని దరిద్రం పటాపంచలవుతుంది. భార్యతో అసలు విషయం చెప్పకుండా నాయుడుగారింటికి వెళ్తానని చెప్పి బయటకు వచ్చాడు. చేతిలో ఒక దీపం బుడ్డీ, చిన్న పలుగూ పట్టుకున్నాడు.

చీకటిలోనే కోటను చేరుకున్నాడు. కీచురాళ్ళ రొద తప్పించి మరే శబ్దం కోటలో వినిపించలేదు. మొండి ధైర్యంతో కోటలో ప్రవేశించాడు. చీకటిలో తడుముకుంటూ మర్రిచెట్టును చేరుకోగలిగాడు.

అగ్గిపుల్ల గీచి దీపం బుడ్డీ వెలిగించాడు రాజయ్య. ఆ గోరంత వెలుగులో గబగబ మట్టిని బయటకు తీసేశాడు. పలుగుతో కొంతవరకే రాతి పలకను పక్కకు కదపగలిగాడు. చేయి దూరిన సందు ఏర్పడింది.

అతనిలోని ఆశ ప్రాణానికి కూడా వెరవలేదు. సందులో చేయి దూర్చి లోపల తడిమాడు. తన ఊహ నిజమే. అందీ అందనట్లు నాణేలు చేతికి తగిలాయ్. అతి కష్టం మీద కొన్ని బయటకు తీసి దీపం బుడ్డీ వెలుగులో చూశాడు. అతని గుండె గుభేలుమంది.

బంగారం వెండీ నాణేలవి! అతని లోని ఆశ పురివిప్పింది. కప్పుకున్న కంబళి కింద పరిచాడు కంబళి నిండా రంధ్రాలే. చేతితో నాణేలు తీసుకున్నాడు. కంబళిలో వేస్తున్నాడు. ఎక్కువ నాణేలు కంబళిలో పట్టలేదు. దీపం బుడ్డీ వెలుగులో లోపల చూశాడు. అతని కళ్ళు జిగేల్మన్నాయి. ధగధగ మెరిసే రత్నరాసి కనిపించింది.

రాతి పలకను యథాస్థానంలో అమర్చి పైన మట్టి వేసి ఇంటికి బయలుదేరాడు.

కంబళి గుడ్డలో నాణేలు భార్యకు చూపించాడు. రాజయ్య భార్య గజగజ వణికి పోయింది.

“నిధి నిజమేనా? ఇన్ని నాణేలు ఎందుకు తెచ్చావు? ఎవరికంట పడేనా మన బతుకు ఏమవుతుంది?” ఆమెలో వణుకు తగ్గలేదు.రాజయ్య ఆమె భయాన్ని కొట్టిపారేశాడు. “ఎందుకంత భయపడతావు? ఏ నగరమో పోయి వ్యాపారం చేసుకుని ఎంచక్కా బతకొచ్చు” అని కోటలో తాను నాణేలు తీసిన వైనమూ, అక్కడున్న రత్నరాశి సంగతీ చెప్పాడు.

రాజయ్య భార్య తెల్లబోయింది. అంత సాహసం భర్త చేయడం ఆమెకు ఇష్టం లేదు. పరుగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీరు తాగడం మంచిదనుకున్న మనస్సు ఆమెది! నిధి గురించి తెల్లారి గ్రామాధికారికి తెలియజెప్పేద్దామని భర్త వద్దనుంచి మాట తీసుకుని నిద్రపోయింది.

రాజయ్యకు నిద్రపట్టలేదు. అతని మనస్సు నిండా రత్నరాశే! భార్యకు నచ్చచెప్పొచ్చన్న నమ్మకంతో కోటవైపు బయలుదేరాడు. రత్నరాసిని కొంతైనా తెచ్చి ఇంట్లో పాతిపెట్టి వుంచుకోవాలని అతని ఆరాటం!

ఆ చీకట్లో దురాశే మళ్ళీ రాజయ్యను నడిపించింది. కోటను చేరుకున్నాడు. చాలా దూరం నుంచి గుడ్లగూబ అరుపు వినిపించింది. ధైర్యాన్ని కూడగట్టుకుని మర్రిచెట్టును చేరాడు. పలుగుతో రాతి పలకను నెట్టేడు. పలక కొంతే జరిగింది. చేయి లోపలకు దూర్చాడు. ఎంత ప్రయత్నించినా అందలేదు. శక్తినంతా కూడదీసుకుని రాతిపలకను మరి కొద్దిగా కదిపాడు. తల దూర్చగలిగే సందు ఏర్పడింది. ఒక విధమైన కాంతి ఆ సొరంగంలో కనిపించింది.

రాజయ్య ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు. లోపలకు తల దూర్చి చూడాలన్న కోరిక అతడికి కలిగింది.

వజ్ర వైఢూర్యాలు తనపరం కాబోతున్నాయన్న దురాశతో సందు లోపలకు తలదూర్చాడు. లోపల అతను ఊహించినట్టుగానే వజ్రాలున్నాయి. పిచ్చిగా ఆనందంతో అరిచాడు. ఇంతలోనే ప్రక్కనున్న పాత గోడల సందునుండి కాలసర్పం ఒకటి వచ్చి రాజయ్యను కాటు వేసింది.

అతని మనస్సులో వజ్రాలు లేవు, రత్నాలు లేవు. భార్యా పిల్లలు గుర్తుకొచ్చారు. తల బయటకు తీయడానికి ప్రయత్నిస్తూనే, అతడు నిర్జీవమయిపోయాడు.

రోమీ

ఆ రోజు శివరాత్రి. ‘పిట్టల వలస’ గ్రామంలో జాతర జరుగుతోంది.

పార్వతీపురం పట్టణానికి పిట్టల వలస నాలుగుమైళ్ళ దూరంలో వుంది. బస్సు సౌకర్యం లేదు. కాలిబాటనే వెళ్ళాలి. మా వీధిలోని పదిమంది పిల్లలం పార్వతీపురం నుంచి పిట్టల వలస బయలుదేరాం.

ఉదయాన బయలుదేరడం వల్ల మాకంత ఎండ దెబ్బ తగల్లేదు. తొమ్మిది అయ్యేసరికి పిట్టల వలస చేరుకున్నాం.

దైవదర్శనం చేసుకుని తొందరగా దేవాలయం నుండి బయటపడ్డాం. జాతర సరదా, చుట్టుపక్కలంతా

తిరిగేశాం. రంగుల రాట్నం ఎక్కాం. గాలిలో ఎగిరే బెలూన్లు కొన్నాం. షూటింగ్ సెంటర్కి వెళ్ళి గన్ షూటింగ్ చేశాం. చెల్లెళ్ళ కోసం తమ్ముళ్ళ కోసం ఆటవస్తువులు కొన్నాం. పెరుగన్నాల పొట్లాలు కొనుక్కుని కడుపులు నింపుకున్నాం. సాయంత్రం మూడు దాకా తిరిగి మేమందరం తిరుగు ప్రయాణమయ్యాం.

పొలాల గట్ల మీద నడుస్తున్న మాకు దూరాన ఒక కుక్కపిల్ల కనిపించింది. దాని ఒంటిమీద నల్లటి తెల్లటి చారలు ముద్దుగా కనిపిస్తున్నాయి. అప్పటి వరకు దిక్కుతోచక అయోమయంగా చూస్తూ నిలబడి ఉన్న ఆ కుక్క పిల్ల మమ్ములను చూడగానే మా వెనుక పడింది. మాకు వింతనిపించింది. ఆనందంతో దాని చుట్టూ మూగాం. అది అంతటితో ఆగక చిందులేస్తూ మా పాదాలు నాకడం ఆరంభించింది. దానినక్కడ విడిచి వచ్చేయడానికి మాకు బుద్ధిపుట్టలేదు. వెంటనే నేను దానిని అందుకున్నాను. అరచేతిలో అది ఇమిడిపోయింది.

సాయంత్రానికి పార్వతీపురం చేరుకున్నాం. కుక్కపిల్లను స్నేహితులడిగారు. నేనివ్వలేదు. ఇంటికి తీసుకుపోయి పెంచాలని నా కోరిక. ఎప్పటి నుంచో కుక్కపిల్లను పెంచాలన్న కోరిక ఉంది. స్నేహితులకు వీడ్కోలు చెప్పి ఇంటికి వచ్చాను.

నా చేతిలోని కుక్కపిల్లను చూసి మా తమ్ముడు మా చెల్లెలు ఆనందంతో చప్పట్లు చరిచారు. కుక్కపిల్లను అందుకొని నడవాలో ఉన్న మా తాతగారి దగ్గరకు పరుగుతీశాను. తాతగారు కుక్కపిల్లను చూశారు. దాన్నెందుకు తెచ్చావురా అని నామీద మండిపడతారను కున్నాను. అలాంటిదేమీ జరుగలేదు. కుక్కపిల్లను నఖశిఖపర్యంతం పరిశీలించి, “మంచి లక్షణాలు గల కుక్క పిల్లనే తెచ్చావురా” అని నన్ను మెచ్చుకుని కుక్కపిల్ల ఎక్కడ దొరికిందీ ఎలా వచ్చిందీ ఆ విశేషాలన్నీ అడిగి తెలుసుకొని సంబరపడ్డారు. ఎవరెస్ట్ శిఖరం ఎక్కిదిగినంత ఆనందం కలిగింది.

కుక్కపిల్లను తాతగారు ప్రేమతో నిమురుతూ. “జంతువులను ప్రేమతో ఆదరించాలి. వాటిని ఈసడించుకోకూడదు. కుక్క చాలా విశ్వాసం గల జంతువు. మనం పెట్టే పట్టెడు మెతుకులకే తృప్తిపడి మన ఇంటిని కాస్తుంది. పశువులను కాపాడుతుంది. యజమానికి ఎనష్టం కలగకుండా చూసుకుంటుంది” అని కుక్క జాతి ప్రత్యేకతను చెప్పారు.

తాతగారి బోధన వల్ల మాకు మరీ కుక్కపిల్లపై అభిమానం ఎక్కువయింది. మా చెల్లాయి కుక్కపిల్లకు ‘రోమీ’ అని పేరు పెట్టింది. ఆ పేరు మాకందరకూ నచ్చింది. ‘రోమీ… రోమీ….’ ముద్దుగా పిలుస్తున్న మా పిలుపు అమ్మ చెవిని పడింది. ఆమెకు కుక్కపిల్లను పెంచడం ఇష్టం లేదు. మామీద మండిపడుతూ “మీ పనులు చేసి పెట్టడానికే నాకు సమయం చాలడం లేదు. ఇంకా అది చాలదని ఈ కుక్కపిల్లను నా నెత్తిమీదకు తెచ్చారా?” అని అంది.

మేము అమ్మ మాటలకు భయపడిపోలేదు. “అమ్మా! ఈ కుక్కపిల్లకు నువ్వేమీ సేవ చేయనక్కరలేదు. నేనూ తమ్ముడూ చెల్లాయి వంతులు వేసుకొని దీని సేవ చేస్తాం!” అని అన్నాను. తమ్ముడూ చెల్లాయి నామాటకు సై అన్నారు. తాతగారు ‘భేష్’ అని చప్పట్లు చరిచారు. అమ్మ మాట్లాడకుండా చరచరా వంట గదిలోకి వెళ్ళిపోయింది.

తాతగారి ముందు కూర్చొని మేమంతా కుక్కపిల్లతో ఆడుకుంటున్నాం. అంతలో నాన్నగారు వచ్చారు. మమ్మల్ని, కుక్కను మార్చి మార్చి చూసి కోపంతో, “కుక్క పిల్లనెందుకు ఇంట్లోకి తీసుకొచ్చారు? లేనిపోని జబ్బులు వ్యాపిస్తాయి. దానినవతల విడిచి పెట్టేయండి” అని కేకవేశారు.

నాన్నగారిని ఎదిరించే ధైర్యం మాకు లేదు. రోమీని పట్టుకొని మేం తాతగారి వెనక్కి చేరిపోయాం. తాతగారు ఆ సమయాన బాగానే మమ్ములను ఆదుకున్నారు. నాన్నగారికి నచ్చజెప్పి రోమీని మాకు దూరం కాకుండా చూశారు.

కాలం గడుస్తోంది. చూస్తుండగానే రోమీ ఎదిగి మంచి బలమైన కుక్కగా తయారైంది. అమ్మ నాన్నలకు మాత్రం కుక్కమీద ప్రేమ కలగడం లేదు. ఈసడించుకుంటూనే దానిని ఇంట్లో ఉండనిస్తున్నారు.

ఒకరోజు అర్ధరాత్రి ఒక వింత జరిగింది. వసారాలో ఉన్న రోమీ ఎప్పటినుంచి అరుస్తుందో గాఢనిద్రలో ఉన్న మాకు తెలియలేదు. తాతగారికి ముందుగా మెలకువ వచ్చింది. రోమీని నెమ్మదించటానికి చూసారు. రోమీ మొరగడం ఆపలేదు. వసారా నుండి నాన్నగారి గది కిటికీ ఊచల మీదకు అదేపనిగా దూకుతోంది. మాకు పూర్తిగా తెలివి వచ్చేసింది. మంచాలు దిగవద్దని తాతగారు మమ్ములను హెచ్చరించారు. ఆందోళన పడుతూ తాతగారు గది కిటికీ దగ్గరకు పోయి గట్టిగా కేకవేస్తూ నాన్నగారిని లేపారు. “గదిలో లైటువేసి చూడు. పురుగూ పుట్రా చేరిందేమో!” అన్నారు. నాన్నగారు విసుక్కుంటూనే గదిలో లైట్ వేశారు. అంతే. “అమ్మోయ్ పాము!” గది తలుపులు భళ్ళున తెరిచి బయటకు వచ్చారు. మేము నాన్నగారి చుట్టూ చేరుకున్నాం. రోమీ సర్రున గదిలోకి దూరిపోయింది. పామును పట్టి చంపటానికి విశ్వప్రయత్నం చేసింది. వీలు చిక్కలేదు. తాతగారు అంతలో ఇరుగుపొరుగు వాళ్ళను లేపుకొచ్చారు. వాళ్ళు కర్రతో బాది పామును చంపేశారు. రోమీ అప్పటికి గానీ మొరగడం ఆపింది కాదు.

రోమీ వీపు నిమురుతూ మేం విజయగర్వంతో అమ్మానాన్నల వంక చూశాం. నాన్న గారు రోమీ వద్దకు వచ్చి దానిని ప్రేమతో ఒడిలోకి తీసుకున్నారు. అమ్మ కూడా రోమీని ప్రేమతో నిమిరింది. రోమీ కళ్ళు ఆనందంతో మెరిశాయి. తాతగారు ఆసందించారు.

వేట

శివసతీపురం రాజు ఆనందవర్మకు వేటంటే సరదా. జీవహింస మహాపాపమని తెలిసినా తనలోని క్షాత్రధర్మం వేట కోసం ఉవ్విళ్ళూరేది.

ఆనందవర్మ పూర్వీకులు వేటలో ఆరితేరిన వారు. వాళ్ళు వేటాడిన జంతువుల కొమ్ములు, గోళ్ళు, చర్మాలు రాజభవనాలలో అలంకార సామగ్రిగా చోటు చేసుకున్నాయి. అవి చూపరుల దృష్టిని ఆకర్షించి పూర్వీకుల వేట నైపుణ్యాన్ని చెప్పకనే చెపుతుండేవిఅలాంటి వంశంలో పుట్టిన ఆనందవర్మ వేట మానలేక పోయేవాడు. అతడి వాడి బాణాలకు పులి, సింహం, తోడేలు లాంటి క్రూరమృగాలే కాక లేడి, దుప్పి, కొండమేక లాంటి శాఖాహార జీవులూ బలి అవుతుండేవి.

ఒక్కొక్కసారి అవి ప్రాణాలు వదిలేటప్పుడు అమాయకంగా చూస్తూ ప్రాణాలు విడిచే తీరు అతని మనస్సును కలచి వేస్తుండేది. ఆ రోజు మాత్రమే ఆనందవర్మ బాధపడుతుండే వాడు. మళ్ళీ రెండు మూడు రోజుల తరువాత వేటకు మామూలుగా సిద్ధమయ్యేవాడు.

ఒకరోజు ఆనందవర్మ వేటకోసం నాగావళీ నదీతీరాన విస్తరించి ఉన్న అడవికి వెళ్ళాడు. ఆ ఆడవి ప్రారంభంలో ఏటి ఒడ్డున నిత్యానందస్వామి ఆశ్రమం వుంది. అక్కడకు వెళ్ళి స్వామి ఆశీస్సులు పొందాలనుకొని ఆశ్రమంలోకి అడుగుపెట్టాడు. ఆ సమయంలో నిత్యానందుడు విద్యార్థులకు అహింస గూర్చి చెబుతున్నాడు. జంతువులను చంపుట మహాపాపమని మానవుల లాగే భూమిమీద బ్రతికే హక్కు ప్రతి జీవరాశికి ఉందని అవి ఒకరికి హాని చేయనంతవరకు వాటి ప్రాణాల్ని తీసే హక్కు ఏ ఒక్కరికీ లేదని బోధిస్తున్నారు.

అంతలో ఆనందవర్మ రాకను నిత్యానందస్వామి గమనించారు. సాదరంగా అతడిని ఆహ్వానించి కుశలప్రశ్నలు వేశాడు. ఆనందవర్మ విచారవదనంతో “మునివర్యా! విద్యార్థులకు మీరు బోధిస్తున్న అహింస పాఠం నేను విన్నాను. మీరు బోధిస్తున్నది సత్యమే. మన ఊసుపట్టని జంతువులను మన వినోదం కోసం చంపడం అన్యాయమే, నేను…..” మాటలు పూర్తి చేయకుండా ఆగిపోయాడు.

నిత్యానందస్వామి కలుగజేసుకుంటూ, “మధ్యలో ఆగిపోయేవేమి? నీ సంశయమేదో చెప్పు. నివృత్తి చేస్తాను” అని అన్నాడు.

ఆనందవర్మ అప్పుడు, “మరేమీ లేదు గురువర్యా! వేట తప్పు అని తెలిసినా మానలేక పోతున్నాను. అది వ్యసనంగా మారింది. ఎలా మానగలను వేట? తరుణోపాయం చెప్పండి” అని వేడుకున్నాడు.

నిత్యానందుడు మందహాసం చేస్తూ “నీకు సంతానం ఎంతమంది మహారాజా!” అని అడిగాడు.

“ఒక్కరే, లేకలేక కలిగారు గురువర్యా!” అని చెప్పాడు.

“నీ బిడ్డంటే నీకు ప్రాణమేనా?” మరో ప్రశ్న వేశాడు నిత్యానందుడు.

“ప్రాణం కన్నా మిన్న!” బదులిచ్చాడు మహారాజు.

నిత్యానందుడు చిరునవ్వు నవ్వుతూ, “అందరిలోనూ ఉన్న ప్రాణం ఒకటే. నీలో, నాలో, జంతువుల్లోకడకు నీ బిడ్డలో వున్న ప్రాణం ఒక్కటే. ఇతర ప్రాణుల్లో మనలాంటి ప్రాణమే వుందని గమనించాలి. వేటాడబోయే జంతువుల్లో నీ బిడ్డను చూడు. వేటనుంచి నీ మనస్సు మరలగలదు” అని హితబోధ చేశాడు.

ఆనందవర్మ ఆలోచనలోపడ్డాడు. ఆరోజు వేటకోసం అడవిలోకి వెళ్ళలేక వెనుదిరిగిపోయాడు. ఆ తరువాత అలవాటు ప్రకారం వారం రోజుల తర్వాత వేటకు బయలుదేరాడు. బాణం గురిపెట్టగానే బిడ్డ గుర్తుకొచ్చాడు. అంతే మనస్సు వికలమయింది. వేటమాని తిరిగి వచ్చాడు.

తరుచూ నిత్యానందస్వామి ఆశ్రమానికి వెళ్ళడం ఆనందవర్మ అలవాటు చేసుకున్నాడు. నిత్యానందస్వామి బోధనల వల్ల రాజ్యంలో వేటను నిషేధించాడు. ధర్మ పరిపాలన చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు.

బన్నీ పరిశోధన

అది వెన్నెల రాత్రి! ఆరుబయట వెన్నెల్లో పరంధామయ్యగారు వాలుకుర్చీలో కూర్చున్నారు. ఆయన ఉన్నత పాఠశాల విశ్రాంత ప్రధానోపాధ్యాయులు. తన మనవలకే కాదు ఇరుగుపొరుగు పిల్లలకొచ్చే రకరకాల సందేహాలకు ఓపిగ్గా సమాధానాలిచ్చి సందేహనివృత్తి చేయడం ఆయనకలవాటు.

ఆరోజు ఆయన చుట్టూ చేరిన పిల్లల్లో ‘బన్నీ’ అనే కుర్రాడున్నాడు. ఆ అబ్బాయి ఆరవ తరగతి చదువుతున్నాడు. చాలా గడసరి; పరంధామయ్యగారు కూర్చున్న కుర్చీకి దగ్గరగా జరుగుతూ, “తాతగారూ! మరి ఎప్పుడో అశోకుడు, హర్షుడు, కనిష్కుడు రాజ్యమేలారు కదా. వాళ్ళు చనిపోయి ఎంతో కాలమయిందికదా. మరివాళ్ళ గురించి పాఠాలు వ్రాసే వాళ్ళకు వాళ్ళ వివరాలన్నీ ఎలా తెలిసాయి. ఆ కాలం నుంచి ఇప్పుడు పాఠాలు వ్రాసేవాళ్ళు ఉండలేదు కదా!” సందేహం వెలిబుచ్చారు.

పరంధామయ్య గారు చిరునవ్వు నవ్వుతూ, “చరిత్ర పాఠాలు వ్రాసేవాళ్ళు ఆ కాలంలో పుట్టి ఉండనక్కరలేదు. ఆ రాజుల కాలం నాటి గ్రంథాలు చదివి అప్పటి విషయాలు తెలుసుకొని కొన్ని ఊహించి వ్రాస్తారు. గ్రంథాలకు తోడుగా త్రవ్వకాలలో లభించే ఆనాటి నాణేలు, వస్తువులను కూడా పరిశీలిస్తారు. వాటి ఆధారాలతో చరిత్ర పరిశోధకులు చరిత్రను ఊహిస్తారు” అని చెప్పారు.

బన్నీ సందేహం తీరింది. అంతలో మరొక సందేహం కలిగింది. “తాతగారూ! ప్రాచీన గ్రంథాలు చదివి ఎవరయినా చరిత్ర తెలుసుకోగలరా?” అని పరంధామయ్య గారిని అడిగాడు.

సమాధానంగా పరంధామయ్యగారు “అందుకు ఊహాశక్తి కావాలి. నీవైనా సరే ఆసక్తితో పుస్తకాలను చదివి ఎవరికీ తెలియని విషయాలు కనుక్కోవచ్చు!” అన్నారు.

బన్నీ వెంటనే, “వేమన చరిత్ర మా ఇంట్లో వుంది తాతయ్యా! ఆ పుస్తకం చదివి ఆనాటి పరిస్థితులను మీకు చెపుతాను!” అన్నాడు.

“అలాగే బన్నీ! నీవు చెప్పే విషయం కొత్తదై ఉండాలి. అప్పుడే నీ పరిశోధనకు విలువ వుంటుంది!” అన్నాడు పరంధామయ్య.

ఆరోజునుంచి బన్నీ తీరిక సమయంలో వేమన చరిత్ర చదవడం ఆరంభించాడు. వేమన పద్యాలను కొన్నింటిని పనిలో పనిగా నేర్చుకున్నాడు. వాటి భావాలను చదివి అప్పటి పరిస్థితులు ఆకళింపుజేసుకున్నాడు. మొత్తానికి పుస్తకం పూర్తి చెయ్యగలిగాడు. ఆ చిన్న బుర్రలో వేమన గురించి ఎంతో కొంత చెప్పగలనన్న ఆత్మవిశ్వాసం కలిగింది.

ఒక నెల గడిచింది. ఒక ఆదివారం నాడు పిల్లలందరూ పరంధామయ్యగారి వద్దకు వచ్చారు. ఆమాటా ఈ మాటా అందరి మధ్య కదిలింది. బన్నీ జోక్యం చేసుకుని, “వేమన చరిత్ర పూర్తిగా చదివేశాను అప్పటి పరిస్థితుల మీద పరిశోధన చేసాను!” అన్నాడు.

“ఏ విషయాలు పరిశోధించావు?” పరంధామయ్యగారడిగారు.

బన్నీ వెంటనే, “అప్పుడు మూఢనమ్మకాలెక్కువ. పరుసవేది అనే మూలిక ఉండేదట. దాంతో బంగారం చేసేవారట” అని అన్నాడు.

పరంధామయ్య గారు బన్నీ మాటలకడ్డుతగులుతూ “నీవు చెప్పిన విషయాలు మన పూర్వీకులెపుడో చెప్పారు. కొత్త విషయం చెపుతేనే అది పరిశోధన అవుతుంది!” అన్నారు.

తోటి పిల్లలు గొల్లున నవ్వారు. బన్నీలో రోషం పెరిగింది. ముక్కుపుటాలెగర వేస్తూ “ఎవరూ కనుక్కోని కొత్త విషయం కనుక్కున్నాను” అన్నాడు.

పరంధామయ్యగారు, “ఆ విషయమేదో చెప్పరా బన్నీ?!” ప్రోత్సహించారు.

“దోమలు వేమన కాలంలో లేవు!” ఠపీమని చెప్పాడు బన్నీ.

పరంధామయ్యగారు బన్నీ సమాధానం విని దిగ్భ్రాంతి చెందారు. తేరుకొని “ఎలా చెప్పగలిగావు? దానికి ఆధారమేమిటి?” అడిగారు.

బన్నీ ఉత్సాహంగా భుజాలెగరేస్తూ, “దోమలే అపుడుండి వుంటే వేమన దిగంబరంగా తిరగగలిగి వుండేవాడా? దోమలు కుట్టి కుట్టి వేమనను రోగాల పాలు చేసి వుండేవి గదా, ఎడిస్ దోమవల్ల డెంగ్యూ, ఎనాఫిలిస్ దోమ వల్ల మలేరియా, క్యూలెక్స్ దోమవల్ల బోదకాలు వచ్చి దేశ సంచారం మధ్యలోనే చనిపోయి వుండేవాడు. ఆంధ్రదేశంలో అతని పద్యరత్నాలు దొరికి వుండేవికావు!” తన పరిశోధన తేటతెల్లం చేశాడు.

బన్నీ మాటలు విన్న పరంధామయ్యగారు బన్నీ పరిశోధనకు ఫక్కున నవ్వారు. పగలూ రాత్రీ తేడా లేకుండా దోమలు కుట్టే బాధను గుర్తు తెచ్చుకుంటూ బన్నీ చెప్పినది నిజమేమో అని అనుకోకుండా ఉండలేకపోయారువాగాడంబరం

సోమలింగ పురానికి కొత్తగా ఒక కుటుంబమొచ్చింది. చేసేది చిన్న ఉద్యోగమయినా ఆ కుటుంబ యజమాని రామలింగం మాటలు కోటలు దాటుతుండేవి. ఊళ్ళో ఎవరితోనయినా పరిచయం చేసుకోవాలను కున్నప్పుడు తాతలు సంపాదించిన ఆస్తిపాస్తులు బోలెడు తనకున్నాయని, బంగారం కడ్డీలు గుప్తంగా దాచుంచామని అయితే తనకు నిరాడంబరంగా ఉండడంలోనే ఆనందముందని చెబుతుండేవాడు. ఆ మాటలు ఆ నోటా ఈ నోటా ప్రాకి చివరకు దొంగల ముఠా వరకు చేరిపోయాయి. దొంగల కన్ను రామలింగం దాచుంచామన్న బంగారు కడ్డీల మీద పడింది.

రామలింగం ఇంటికి కన్నం వెయ్యడానికి దొంగలు తగిన సమయం కోసం ఎదురు చూడసాగారు.ఆరోజు రానే వచ్చింది. రామలింగం కుటుంబ సభ్యులు ఆదమరిచి నిద్రపోతున్న అర్ధరాత్రివేళ దొంగలు ఆ ఇంటికి కన్నం పెట్టనే పెట్టారు. నిద్రపోతున్న రామలింగాన్ని తట్టి లేపి “దాచుంచిన బంగారు కడ్డీలివ్వు? ఇవ్వకపోయావా నిన్నూ, నీ వాళ్ళందరి ప్రాణాలు తీస్తాం!” అని కత్తులు చూపి బెదిరించారు. రామలింగం హతాశుడయ్యాడు. నోటమాట రాలేదు. ఇవ్వడానికి తన దగ్గరేముంది? రోజులు గడపడానికి దినభత్యం తప్పించి! దొంగలకు ఆ విషయం ఎలాచెప్పాలో తెలియక నీళ్ళు నమలసాగాడు.

రామలింగం భార్యకు విషయం అర్థమయింది. దొంగలతో “నాయనలారా! మా వారికి వాగాడంబరం ఎక్కువ. ఎవరితో మాట్లాడినా బోలెడు ఆస్తిపాస్తులున్నాయని చెప్పడం తనకలవాటు. ఆ వరుసలోనే బంగారపు కడ్డీలున్నాయని చెబుతుంటాడు. నిజానికి మా వద్ద బంగారపు కడ్డీలు లేవు. నా మాట నమ్మండి. నామెడలో మా కన్నవారు పెట్టిన ఈ నగ మాత్రమే వుంది!” అని నగను తీసి దొంగలకిచ్చింది.

ఆమె మాటలను దొంగలు నమ్మలేదు. బంగారు కడ్డీలందజేయమని రామలింగానికి రెండు తగలనిచ్చారు. రామలింగానికి కళ్ళు బైర్లు కమ్మాయి. కొద్దిగా తేరుకున్నాక దొంగలతో “భగవంతుడి సాక్షి. నా భార్యా బిడ్డల మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. నన్ను నమ్మండి. నిజానికి నా వద్ద బంగారు కడ్డీలు లేవు. ఆస్తిపాస్తులు లేవు. అవి వున్నట్టు చెప్పుకుంటే అప్పులు సప్పులు దొరుకుతాయని నా ఆశ. అందుకే నేనలా ప్రచారం చేశాను!” ఏడుస్తూ దొంగల నాయకుడి కాళ్లమీద పడ్డాడు.

అంతలో ఇల్లంతా గాలించిన మిగిలిన దొంగలు తమ నాయకుడితో “ఎంత వెదకి చూచినా ఏమీ దొరకలేదు. ఈ రెండొందలు రూపాయలు తప్పించి!” అన్నారు. ఇంతలో తెల్లవారి పోతోంది. కాస్సేపటికి చిల్లర డబ్బులు, నగతో అక్కడ నుంచి ఉడాయించారు దొంగలు!.

“మీ వాగాడంబరంతో మా కన్నవారు పెట్టిన నగను కూడా పోగొట్టుకున్నాను. ఉన్న చిల్లర డబ్బులు కూడా ఎగిరిపోయాయి. రేపెలా గడుస్తుంది?” రామలింగం భార్య నెత్తీ నోరూ కొట్టుకుంటూ భర్తను నిందించింది.

భార్యకు సమాధానమిచ్చే ఓపిక కూడా లేకపోయింది రామలింగానికి. దొంగలు కొట్టిన దెబ్బలు తలుచుకుంటూ మరెప్పుడూ బడాయి మాటలు పలుకకూడదని నిర్ణయించుకున్నాడు!

Leave a Comment