Dommari Vaadu Vinyasalu – Amazing Traditional Acrobat Show

ఒక ఊళ్ళో ఒక దొమ్మరివాడు ఉండేవాడు. అతడు వీధుల్లో గడకట్టి దాని మీద విన్యాసాలు ప్రదర్శిస్తూండేవాడు.

అతడు ఊళ్ళు తిరుగుతూ తన విన్యాసాలు జనులకు ప్రదర్శించి చూపుతుండేవాడు. అందుమూలంగా వచ్చే కొద్దిపాటి రాబడితో జీవించసాగాడు.

అతడు ఒక రోజు ఒక ఊళ్ళో, జనులు ఎక్కువగా సంచరించే చోట, గడకట్టి తాడు మీద నిరాధారంగా నడుస్తూ విన్యాసాలు ప్రదర్శించసాగాడు.

విన్యాసాలు

ఇప్పుడు అతడు తన చేతిలోకి ఒక ఇనుప వలయాన్ని తీసుకున్నాడు.

“ఈ ఇనుప వలయంలోకి ఇప్పుడు నేను దూరబోతున్నాను!” అన్నాడు. జనులను ఉద్దేశించి.

అంతే! జనులు జయఘోష చేస్తూ తమ ప్రశంసలవర్షం కురిపించారు.

ఆ తరువాత ఆ దొమ్మరివాడు ఇంకా చిన్నదైన ఒక ఇనుప వలయాన్ని తీసుకుని, “ఈ వలయంలోకి నేను దూరబోవడాన్ని మీరు చూడబోతున్నారు!” అంటూ జనులను చూస్తూ చెప్పాడు.

అప్పుడు జనులు, ‘ఈ వలయంలోకి కచ్చితంగా ఇతడు దూరి బైటకు రాలేడు. ఇదో చిన్న వలయం. దీన్లోకి ఎలా దూరగలడు? ఒకవేళ దూరగలిగినా, ఇతడు బైటకు రావడం ఎలా సాధ్యం?’ అని అనుకోసాగారు.

జనుల మనోభావాన్ని అర్థం చేసుకున్న ఆ దొమ్మరివాడు, “ఈసారి మీరంతా మరింత గట్టిగా చప్పట్లుకొట్టండి!” అని ఎలుగెత్తి చెప్పాడు.

జనులు అతణ్ణి మరింత ప్రోత్సహించే రీతిలో చప్పట్లతో ఆ ప్రదేశాన్ని మార్మోగించారు. యువకులు కొందరు ఉత్సాహంతో ఈలలు వేశారు.

అదే సమయంలో దొమ్మరివాడు తన శరీరాన్ని తీగలా అనూహ్యంగా సన్నబరచి, నిటారుగా చేసి, హఠాత్తుగా చిన్నవలయంలోకి దూరి క్షణంలో బైటకు వచ్చేశాడు. ఆ విన్యాసం చూసి అక్కడ గుమిగూడిన జనులంతా అవాక్కయ్యారు.

చూపరులకు దొమ్మరివాడు ప్రదర్శించిన ఈ విన్యాసం ఒక గొప్ప అద్భుతంగా తోచింది. వారి ఉత్సాహం మేర మీరింది. దాంతో ఇంకా గట్టిగా చప్పట్లు కొట్టనారంభించారు.

గుమిగూడిన జనంలో ఒక దొంగ ఉన్నాడు. దొమ్మరివాడు మూడవ చిన్న వలయంలో లాఘవంగా దూరి బైటకు రావడం చూసి అతడు అమిత ఆశ్చర్యం చెందాడు.

తరువాత ఆ దొంగ దుర్బుద్ధితో ఇలా ఆలోచించాడు: ‘నేను ధనవంతుల ఇళ్ళకు దొంగతనానికి వెళుతుంటాను. ఆ ఇళ్ళ కిటికీల చువ్వల మధ్య ఉన్న ఖాళీ, ఇప్పుడు ఈ దొమ్మరివాడు చివరగా దూరి, బైటకు వచ్చిన వలయం కన్నా కాస్త ఎక్కువగానే ఉంటుంది.

‘కాబట్టి దొంగిలించాలనుకునే ఇంటి కిటికీ చువ్వల మధ్యన ఉన్న ఖాళీలో ఈ దొమ్మరివాడు దూరి, లోపలకు వెళ్ళి ఇంటి తలుపును తెరిస్తే చాలు! నేను ఇంట్లోకి పోయి బోలెడంత దొంగలించుకుని రావచ్చు.’

ఇంతలో దొమ్మరివాడు తన విన్యాస ప్రదర్శనలు ముగించాడు. గుమిగూడిన జనం అక్కణ్ణుండి మెల్లగా కదలి వెళ్ళిపోసాగారు.

దొమ్మరివాడు కూడా సిద్ధమయ్యాడు. చోటునుండి వెళ్ళిపోవడానికి

అప్పుడు ఈ దొంగ యథాలాపంగా దొమ్మరివాడి వద్దకు వచ్చి, “మీకు ఈ వృత్తిలో మంచి రాబడి లభిస్తున్నదా?” అని అడిగాడు.

అందుకు దొమ్మరివాడు, “దీన్లో నాకు ఏం పెద్ద రాబడి లభిస్తుంది? జనులు చప్పట్లుకొట్టి ప్రశంసించడంతో సరి…. వారు ఎక్కడ నాకు చిల్లర పడేస్తున్నారు? ఈ వృత్తిలో లభించే కొద్దిపాటి రాబడితో నేను కడుపునిండా కూడా తినలేకపోతున్నాను. ఇలాగే నా జీవితం ఏదో సాగుతోంది…” అంటూ వాపోయాడు.

అంతా విని ఆ దొంగ అతణ్ణి “నేను నీకు రోజూ ఒక చిన్న పని అప్పగిస్తాను. ఆ పని ఎక్కువసేపు పట్టదు. ఆ పని పూర్తిచేస్తే నీకు రోజుకు వెయ్యి రూపాయలు ముట్టచెబుతాను. నీకు ఇష్టమేనా?

“నిజానికి నేనొక దొంగను. నేను దొంగతనం చేయబోయే ఇళ్ళలో, కిటికీల వద్దకు నిన్ను తోడ్కొని వెళతాను. అప్పుడు నువ్వు అదను చూసి కిటికీ చువ్వల మధ్యగల ఖాళీస్థలం గుండా దూరి లోపలకు వెళ్ళి వీధి తలుపు చడీచప్పుడు కాకుండా తియ్యాలి. ఈ పని చెయ్యడానికి నీకు ఇష్టమేనా?” అని అడిగాడు.

మారుమాట్లాడకుండా ఆ పని చేయడానికి దొమ్మరివాడు సమ్మతించాడు.

నాడు అమావాస్య, అర్ధరాత్రి సమయం.

దొంగ, దొమ్మరివాణ్ణి ఒక పెద్ద ధనవంతుడి భవంతికి తోడ్కొని వెళ్ళాడు.

అక్కడ దొమ్మరివాడికి, ఒక కిటికీ చూపించి దొంగ, “ఈ కిటికీ చువ్వల మధ్య ఉన్న జాగాలో నువ్వు దూరి లోపలికి వెళ్ళు. తరువాత వీధి తలుపు గడియ తీసి బైటకు వచ్చెయ్యి.

వెంటనే నేను నీకు వెయ్యి రూపాయలు ఇస్తాను. ఆ డబ్బు పుచ్చుకుని నువ్వు ఇక్కణ్ణుండి వెళ్ళిపో!” అని చెప్పాడు.

దొంగ చూపించిన కిటికీ చువ్వల మధ్యగల ఖాళీ స్థలం గుండా దొమ్మరివాడు దూరిపోవడానికి ప్రయత్నించాడు. కాని అతడి వల్ల దాన్లో దూరిపోవడానికి సాధ్యం కాలేదు.

దాంతో అతడు మళ్ళీ మళ్ళీ ఆ కిటికీలో గుండా దూరి పోవడానికి శతథా ప్రయత్నించాడు. అయినప్పటికీ అతడి ప్రయత్నాలు ఫలించలేదు.

అందువల్ల అతడు దొంగతో, “దీన్లోగుండా నేను దూరలేకపోతున్నాను!” అన్నాడు విచారం వ్యక్తం చేస్తూ.

అది విన్న దొంగ, “నువ్వు ఏమంటున్నావు? దీనికన్నా చిన్న ఇనుప వలయంలోకి నువ్వు దూరి బైటకు రావడం నేను ఈ రోజు ప్రత్యక్షంగా చూశానే! అలాంటప్పుడు ఈ వలయంలోకి దూరలేకపోతున్నానని చెబుతున్నావే! ఎందుకు ఇలా అంటున్నావు?” అని విస్తుబోతూ అడిగాడు.

అందుకు ఆ దొమ్మరివాడు, “అయ్యా, ఇప్పటికీ ఏం మించిపోలేదు. ఒక పదిమందిని తోడ్కొని వచ్చి, చప్పట్లు కొట్టించండి. వెంటనే నేను ఈ కిటికీ చువ్వల ఖాళీజాగాలో దూరిపోతాను!” అన్నాడు భరోసా ఇస్తూ.

ఆ మాటలు విన్న దొంగ, “ఏం మనిషివయ్యా నువ్వు! ఇక్కడకు పదిమందిని రావించి చప్పట్లు కొట్టిస్తే, ఇంట్లో నిద్రిస్తున్న వాళ్ళు మేలుకోరా? ఆ తరువాత ఈ ఇంట్లో నేనెలా దొంగతనం చెయ్యగలను?” అన్నాడు.

అందుకు దొమ్మరివాడు, “అయ్యా, నేనూ మీ వంటి వాడినే. మీరు ఏ ఏ పనులు చెయ్యగలరో, వాటినే నేను కూడా చెయ్యగలను. నేనొక సగటు మనిషిని, ఒక సామాన్యుడైన మనిషిని.

“నేను జన సమూహం ముందు విన్యాసాలు ప్రదర్శిస్తాను. అది చూసి జనులు చప్పట్లుకొట్టి నన్ను ఉత్సాహపరిచి, ప్రోత్సహిస్తారు. వారు అందించే ప్రేరణా, ఉత్సాహమూ నా మనస్సులో ఒక సమధికోత్సాహాన్ని కల్పించి, నన్ను కష్టసాధ్యమైన విన్యాసాలు చేయడానికి పురికొల్పుతాయి… విషయం ఇదే” అని చెప్పాడు.

అది విన్న తరువాత దొంగ, ‘ఈ దొమ్మరివాడు నా వృత్తికి ఏమాత్రమూ ఉపయోగపడడు’ అని అర్థం చేసుకొన్నాడు.

కాబట్టి అతడు, దొమ్మరివాడితో, “నువ్వు వెళ్ళి ఇంతకు క్రితంలానే వీథుల్లో విన్యాసాలు ప్రదర్శిస్తూ జీవించు” అని చెప్పి పంపించివేశాడు.

పై ఉదంతం ద్వారా ఏం తెలియవస్తోంది?

జనులలో అత్యధిక సంఖ్యాకులు సామాన్యమైనవారే, సగటు మనుషులే!

ఇటువంటి సామాన్యమైనవారు కూడా, సరైన రీతిలో ప్రేరణా, ఉత్సాహమూ, అంగీకారమూ పొందితే-పెద్ద సాధనలలో కృతకృత్యులు కాగలుగుతారు.

కాబట్టి సత్కార్య ప్రయత్నాలు చేగొనేవారికి, మనం సరైన రీతిలో ప్రేరణా, ఉత్సాహమూ, ప్రోత్సాహమూ అందించాలి. ఈ విధంగానే ఇతరుల నుండి మనమూ ప్రేరణా, ప్రోత్సాహమూ పొందాలి.

దీనినే మన పెద్దలు, “మండుతున్న దీపానికి సైతం అప్పుడప్పుడు వత్తిని పైకి ఎగుదోస్తూ ఉండడం అవసరం” అని చెబుతుంటారు.

ప్రతి విషయంలోనూ మంచిని మాత్రం చూడడానికి మనం సదా ప్రయత్నించాలి. ప్రతి విషయంలోను ఏదో కొంత మంచి ఉండనే ఉంటుంది.

స్వామి వివేకానంద, “ఒక నీటి బిందువులో సముద్రాన్నే దర్శించగల వారు శ్రీరామకృష్ణులు!” అని చెప్పారు.

అంటే, ‘ఒకరిలో ఉన్న స్వల్పమైన మంచి గుణాన్ని గొప్పగా ప్రశంసించి ప్రేరణను కల్పించే వారు శ్రీరామకృష్ణులు’ అని దీనికి అర్థం చెప్పుకోవచ్చు.

Leave a Comment