Sparrow’s Lesson యువకుడొకడు ఒక జ్ఞాని వద్దకు వెళ్ళాడు.
అతడు జ్ఞానితో, ఇలా చెప్పాడు: “అయ్యా, ఈ ఊళ్ళో నాకు పని దొరకలేదు. ఇక్కడ నాకు ఆదాయానికి మార్గం ఏదీ లేదు. కాబట్టి నేను సుదూరంలో ఉన్న పెద్ద నగరానికి వెళ్ళి ఉద్యోగం చూసుకుంటాను.
అందునిమిత్తం నేడే నేను మన ఊళ్ళోనుండి బయలుదేరుతున్నాను.
“నేను వెళ్ళే నగరంలో నాకు ఒక మంచి ఉద్యోగం లభించి, అక్కడ నేను జీవితంలో స్థిరపడాలని నన్ను ఆశీర్వదించండి.”
అలాగే ఆ యువకుణ్ణి, జ్ఞాని మనసారా ఆశీర్వదించి పంపించాడు. కొన్ని రోజులు గడిచాక జ్ఞాని అదే ఊళ్ళో ఆ యువకుణ్ణి మళ్ళీ చూసి ఆశ్చర్యపోయాడు.
ఆ యువకుడి వద్దకు వెళ్ళి, ఆ జ్ఞాని, “నాయనా! నువ్వు ఇంకా ఆ నగరానికి బయల్దేరి వెళ్ళలేదా? నువ్వు నన్ను కలుసుకున్న రోజునే, ఉద్యోగార్ధం ఊరు విడిచి వెళుతున్నట్లు చెప్పావే?” అని అడిగాడు,
అందుకు ఆ యువకుడు ఇలా జవాబిచ్చాడు: “అయ్యా! నేను ఆ రోజునే, అప్పుడే బయలుదేరాను. దారిలో నిర్మానుష్యమైన ఎడారి వంటి ప్రాంతం తారసపడ్డది. అక్కడున్న ఒక ఈతచెట్టు నీడన కాసేపు విశ్రాంతి కోసం కూర్చున్నాను.
అక్కడ నేనొక దృశ్యం చూశాను.
“నేను కూర్చున్న చోటుకు కాస్త దూరంలో, ఒక చెట్టు కింద కాలు నిరిగిన ఒక పిచ్చుక ఆకలితోనూ, అమిత బాధతోనూ నడవలేక తల్లడిల్లిపోతూండడం కంటపడింది. దాన్ని చూసి నేను ‘ఈ పిచ్చుక దానంతట అదే ఎగిరి వెళ్ళి ఆహారం వెతుక్కోవడానికి దారి లేదే! ఇది ఎలా బతకగలదు?’ అని ఆలోచిస్తూ ఉండిపోయాను.

“ఇలా నా ఆలోచనలు సాగుతూండగా, ఎక్కణ్ణుంచో ఒక పిచ్చుక ఎగిరి వచ్చింది. అది తన నోటితో ఆహారం తెచ్చి, కాలు విరిగిన పిచ్చుక నోట్లో పెట్టి తినిపించింది.
“అది చూసి నేను, ‘ఆహా! కాలు విరిగిన ఈ పిచ్చుకకు కూడా ఆహారం లభించడానికి, భగవంతుడు ఒక ఏర్పాటు చేసి ఉంచాడే! అలాంటప్పుడు, మనిషినైన నేను జీవించడానికి భగవంతుడు నాకొకఏర్పాటు చెయ్యకుండా ఉంటాడా?’ అని అనుకొని, పయనం రద్దుచేసుకొని, మన ఊరికే తిరిగి వచ్చేశాను.”
అంతా విన్న ఆ జ్ఞాని, “నాయనా! నువ్వు ఎందుకు ఆ కాలు విరిగిన పిచ్చుకలా ఉండాలని ఆశిస్తున్నావు? తన శ్రమతో తన ఆహారాన్ని సముపార్జించుకొని, మరో పిచ్చుకకు కూడా ఆహారం తీసుకువచ్చిన ఔదార్యం గల ఆ రెండవ పిచ్చుకగా ఉండాలని నువ్వెందుకు ఆశించడం లేదు?” అని ప్రశ్నించాడు.
‘ఇతరుల శ్రమలో జీవించాలి’ అనుకోవడం హీనాతిహీనం.
తన స్వకీయ శ్రమతో జీవిస్తూ, ఇతరులకు కూడా సహాయపడాలని ఆశించాలి, ఆకాంక్షించాలి. అప్పుడే మనిషి జీవితానికి సార్థకత చేకూరుతుంది.