The Minister’s Wise Counsel blends common governance advice

ఒక అపార ఐశ్వర్యవంతుడి వద్ద బుద్ధిమంతుడనే బానిస ఒకడు పని చేస్తుండేవాడు. ఈ బానిస విశ్వాసంతో, నిజాయితీతో, యజమానిని సేవిస్తూ వచ్చాడు. దాంతో యజమాని ఆదరాభిమానాలను చూరగొన్నాడు.

ఇలా కొంతకాలం జరిగిన తరువాత ఆనందభరితుడైన ఆ యజమాని, తన బానిస అయిన బుద్ధిమంతుడికి స్వతంత్రం ఇచ్చాడు. అంతేకాక అతడు బుద్ధిమంతుడికి ఒక ఓడ నిండా సరకులు నింపి ఇచ్చి, ఇలా అన్నాడు: “ఈ ఓడ, దాన్లోని సరకులు ఇకపై నీ సొంతం. ఈ సరకులను నువ్వు విదేశాలకు తీసుకుపోయి విక్రయించి, గొప్ప ధనవంతుడవై, సుఖసంతోషాలతో జీవించాలని నా అభిమతం. నీకు నా శుభాకాంక్షలు!”

ఆశ్చర్యానందాలలో తేలిపోయిన బుద్ధిమంతుడు తన యజమానికి సాష్టాంగ ప్రణామం చేసి, ఆయన ఆశీస్సులు పొంది, సరకులున్న ఓడతో సముద్ర యానం ప్రారంభించాడు.

కొన్ని రోజుల పాటు ఓడ నిరాటంకంగా సముద్ర జలాల మీద పయనించింది. ఆ తరువాత ఒక రోజు, నడిసముద్రంలో పోతున్నప్పుడు.

హఠాత్తుగా గాలివాన వీయసాగింది. ఆ గాలివాన క్షణక్షణానికీ ఉద్ధృతమై ఓడను అటూ ఇటూ కుదిపివేయసాగింది. ప్రచండమైన ఆ గాలివాన తాకిడికి కాసేపటికల్లా ఆ ఓడ రెండుగా ముక్కలై, సముద్రంలో మునిగిపోయింది.

ఓడలో ఉన్న వారందరూ, సరకులతో సహా ఆ అనంత జలరాశిలో మునిగిపోయారు. అదృష్టవశాత్తు బుద్ధిమంతుడు మాత్రం ముక్కలైన ఓడకు గల ఒక పెద్ద కొయ్యదుంగను దొరకపుచ్చుకొని దాని మీద తేలుతూ ఆ రాత్రంతా నానా అగచాట్లు పడి ఎట్టకేలకు మర్నాటి ఉదయం ఒక దీవి ఇసుక తీరాన్ని చేరుకొన్నాడు.

అక్కడ ఇసుక తీరంలో కూర్చుని తన దయనీయ స్థితిని తలచుకొని ఏడ్చాడు.

‘ఓ… ఇప్పుడు నేనొక అనాథను! నాకంటూ లోకంలో ఎవరూ లేరు… నాకు అయాచితంగా లభించిన ఓడనూ, దాన్లోని సరకులనూ కోల్పోయాను! సర్వం నాశనమైపోయింది!

‘భవిష్యత్తు గురించి నేను కన్న కలలు కల్లలైపోయాయి! ఇక నేను ఏం చెయ్యగలను? ఈ దుస్థితి దాపురించిందే! ఇక నేను ఎందుకు జీవించాలి?’ అంటూ తలచుకొని తలచుకొని విలపించసాగాడు.

బుద్ధిమంతుడు ఇలా విలపిస్తూ ఉన్నప్పుడు, అక్కడ ఊహించని ఒక సంఘటన జరిగింది.

అతడి వైపుగా ఊరేగింపుగా కొందరు రాసాగారు; మంగళ తూర్యారావాలు వినవచ్చాయి. “రాజుగారికి స్వాగతం! రాజుగారికి సుస్వాగతం! రాజుగారికీ జై!” అంటూ నినాదాలు కూడా వినిపించాయి.

ఇంతలో ఆ ఊరేగింపు బుద్దిమంతుడి వద్దకు వచ్చేసింది. ఏనుగు .అతడి మెడలో మాల వేసి, అతణ్ణి తన తొండంతో పైకెత్తి, అంబారీలో ఆసీనుని చేసింది.

ఆ తరువాత వారంతా బుద్దిమంతుణ్ణి రాచమర్యాదలతో ఊరేగింపుగా అంతఃపురానికి తోడ్కొని వెళ్ళారు.

అక్కడ వారు సింహాసనం మీద బుద్ధిమంతుణ్ణి అధిష్ఠింపజేసి “ఈ క్షణం నుండి మీరే మా దీవి రాజు!” అని ప్రకటించారు.

ఆ రోజు జరిగినదంతా బుద్ధిమంతుడు నెమరువేసుకొన్నాడు. అదంతా అతడికి విచిత్రంగా అనిపించింది.

అతడు ఇదంతా ఏమిటో తెలుసుకోగోరి తన పక్కనే నిలబడి ఉన్న ఒక వృద్ధుని,

“ఇదంతా ఏమిటి? నాకూ ఈ దీవికీ ఎటువంటి సంబంధమూ లేదే! నన్ను వీళ్ళు ‘రాజు’ అని సంబోధిస్తున్నారు… నాకు ఏమీ అర్థం కావడం లేదు. ఇంతకీ మీరెవరు?” అని ప్రశ్నించాడు.

అందుకు ఆ వృద్ధుడు, “నేను ఈ రాజ్యపు మంత్రిని, మా దీవికి ఒక ఆనవాయితీ ఉంది. అది ఏమిటంటే: ఈ దీవికి అనాథగా వచ్చి ఆశ్రయం పొందిన వ్యక్తిని మేం రాజును చేస్తాం. ఆ ఆనవాయితీ ప్రకారం ఇప్పుడు మీరే మా దీవికి రాజు!” అని జవాబు ఇచ్చాడు.

బుద్దిమంతుడు: అలాగా! ఇంతకు మునుపు ఈ దీవికి రాజు లేనే లేడా?

మంత్రి: మునుపు, ఒకరు ఉండేవారు.

బుద్ధిమంతుడు: ఇప్పుడు ఆయన ఎక్కడ?

మంత్రి: మా దీవికి అనాథగా వచ్చి ఆశ్రయం పొందిన వ్యక్తిని రాజుగా చేస్తామని చెప్పాను గదా!

బుద్ధిమంతుడు: అవును, చెప్పారు.

మంత్రి: అలా రాజైన వ్యక్తి ఈ దీవికి ఐదేళ్ళకు మాత్రమే రాజుగా ఉండగలడు.

బుద్ధిమంతుడు: ఐదేళ్ళ తరువాత…?

మంత్రి: ఐదేళ్ళు గడిచిన తరువాత, ఈ దీవికి రాజుగా ఉన్న వ్యక్తిని, దూరంలో ఉన్న ఒక దీవిలో తీసుకువెళ్ళి వదలివేస్తాం.

బుద్ధిమంతుడు: ఇంతకు మునుపు ఇక్కడ రాజులుగా వ్యవహరించిన వారంతా ఇప్పుడు ఆ దీవిలోనే జీవిస్తున్నారా?

మంత్రి: వారు ఇప్పుడు ఆ దీవిలో ఎలా జీవిస్తూ ఉంటారు?

వాళ్ళను అక్కడ వదలి వేయగానే, అక్కడ సంచరిస్తున్న క్రూరమృగాలు వారిని చంపి తినివేస్తాయి గదా!

బుద్దిమంతుడు: అయ్యో! ఐదేళ్ళ తరువాత ఆ దీవిలో వదలివేసినప్పుడు క్రూరమృగాలు నన్నూ చంపేస్తాయా?

మంత్రి: అవును. మీరు ముందు జాగ్రత్తలు తీసుకోకపోతే, మీకు అదే గతి పడుతుంది! దాన్లో ఏం సంశయం ఉంది?

బుద్దిమంతుడు: నేను ముందు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి? నేను ముందు జాగ్రత్తలు తీసుకొంటే ఆ దుర్గతి నుండి బైటపడడం సాధ్యమా?

మంత్రి: సాధ్యమే… మీరు ఇప్పుడు ఈ దీవికి రాజు, కాబట్టి మీ అభిమతం ఏదో – మీ ఆజ్ఞ ఏదో – అది వెంటనే నెరవేర్చబడుతుంది.

మీరు ముందుగా ఆ దీవికి మన సైనికులను పంపించి, అక్కడ అడవుల్లో సంచరిస్తున్న క్రూరమృగాలను వేటాడి అంతం చెయ్యమనండి

తరువాత ఆ దీవికి ఇక్కడున్న జనులను పంపించి, అరణ్యాలను కొట్టించి, జనులు జీవించడానికి అనువుగా ఆ దీవిని మార్పించండి. ఆ తరువాత మనం ఉంటున్న ఈ దీవి జనాభాలో సగం మందిని, అక్కడకు వలస పొమ్మని ఆజ్ఞ జారీ చేయండి. ఈ కార్యక్రమాల వలన అక్కడొక రాజ్యం ఏర్పడుతుంది. ఐదేళ్ళ తరువాత మిమ్మల్ని అక్కడకు తీసుకుపోయి వదలిపెట్టినప్పుడు, మీరు ఆ రాజ్యానికి రాజు అయిపోగలరు.

బుద్ధిమంతుడు: ఇది మంచి యోచనగానే భావిస్తున్నాను. ఇంతకు మునుపు రాజులుగా ఉన్నవారికి మీరు ఈ యోచనను చెప్పలేదా?

మంత్రి: మీకు మునుపు ఇక్కడ రాజులైన వారికి కూడా నేను ఈ యోచనను చెప్పాను. కాని వారు నేను చెప్పిన ఈ యోచనను

కార్యాచరణలో పాటించలేదు. అందుకు బదులుగా తప్ప తాగుతూ, స్త్రీల వ్యామోహానికి బానిసలై కాలాన్ని వృథా చేసుకొన్నారు.

బుద్ధిమంతుడు: నేను అలా ప్రవర్తించను. మీరు చెప్పిన యోచనను అక్షర సత్యం చేస్తాను. నేను ఇక్కడ రాజుగా ఉన్న కాలవ్యవధిలోనే మీరు చెప్పిన ఆ దీవిలో ఒక రాజ్యాన్ని రూపొందిస్తాను.

మంత్రి: రాజా! మీరు ఇక్కడ రాజుగా అధికారం చెలాయించే

ఐదేళ్ళ కాలాన్ని సక్రమంగా వినియోగిస్తే కచ్చితంగా మీరు ఐదేళ్ళ

తదనంతరం ఆ దీవి రాజుగా అయిపోతారు.

ఈ విధంగానే రాజా! మనిషి ఈ లోకంలో మహా అయితే

నూరేళ్ళు జీవిస్తాడు. ఈ లోకంలో జీవించే కాలఘట్టంలో అతడు అల్పమైన లౌకిక కాంక్షలకు తన హృదయంలో చోటు కల్పించకుండా ఆధ్యాత్మిక సాధనలు, మనోనిగ్రహం, సత్ప్రవర్తన, ధ్యానం, సేవ వంటి దైవీగుణాలతో జీవితం గడపాలి. ఆ విధంగా జీవిస్తే అతడికి ఎన్నటికీ నశించని స్థితి అయిన ముక్తి లభిస్తుంది, అతడు అమరుడవుతాడు.

మంత్రి సూచనల మేరకు బుద్ధిమంతుడు జీవితం గడిపాడు.

అందువల్ల మంత్రి చెప్పిన అన్ని మేళ్ళూ అతడికి ఒనగూరాయి.

శాశ్వతం లౌకిక కాని జీవితాన్ని సముచితంగా వినియోగించుకుంటే శాశ్వతమైన భగవంతుణ్ణి ప్రాప్తించుకోవడం సాధ్యమౌతుంది.

Leave a Comment