Life and Teachings of Lord Sri Krishnachandra

గోపేశ్వర శివాలయం ఉన్న ప్రదేశంలో ‘లాలాబాబా మందిర్’ ఉంది.

ఈ ఆలయం క్రీ.శ. 1810లో నిర్మించబడింది.

ఈ ఆలయాన్ని శ్రీకృష్ణచంద్రుడనే ఒక రాజు నిర్మించాడు.

ఆయన బృందావన రాకకు నేపథ్యంలో ఒక ఆసక్తికరమైన సంఘటన ఉంది.

ఒరిస్సాలో ఒక చిన్నరాజ్యానికి శ్రీకృష్ణచంద్రుడు రాజు.

సుఖభోగాలలో మునిగి తేలడమే జీవిత లక్ష్యంగా ఆయన తన జీవితాన్ని గడుపుతూ వచ్చాడు.

ఇలా ఉండగా ఒక రోజు కొద్దిదూరంలో ఉన్న గ్రామంలో ఏవో పనులు చక్కబెట్టడానికి శ్రీకృష్ణచంద్రుడు వెళ్ళాడు. సాయంత్రం ఆయన తన రాజభవనానికి తిరిగి వస్తున్నాడు.

ఆ సమయంలో కాలిబాట మీద ఒక వ్యక్తి తన కుమార్తెతో కలిసి వెళుతున్నాడు.

అప్పుడు ఆ కుమార్తె, తన తండ్రితో, “నాన్నా! పగలు అంతరిస్తోంది. రాత్రి వచ్చేస్తోంది. ఇంకా ఇంట్లో దీపం వెలిగించలేదు. ఇంట్లో చీకటి. కమ్ముకొని ఉంటుంది. రండి, త్వరగా వెళదాం!” అని చెబుతూ తండ్రితో వేగంగా నడిచి పోతూ, శ్రీకృష్ణచంద్రుని దృష్టినుండి కనుమరుగైంది.

ఈ మాటలు సర్వసాధారణంగా అందరూ చెబుతూ ఉండడం. సహజమే! కాని ఈ మాటలు విన్న శ్రీకృష్ణచంద్రుని హృదయంలో అని పెద్ద మార్పును కలిగించాయి. సుఖాలలో తేలిపోయి జీవితం గడుపుతున్న రాజుకు, కాలిబాటలో నడిచిపోతున్న ఆ వ్యక్తి కుమార్తె పలికిన మాటల్లో ఎంతో అంతరార్థం ఉన్నట్లు తోచింది.

‘ఆ బాలిక మాటల్లో ఒక గొప్ప నిజం దాగి ఉంది. నా యౌవన దశ తీరిపోయింది. నేను జీవితపు చరమ దశలోకి అడుగిడబోతున్నాను.

ఇంకా హృదయం అనే ఇంట్లో (జ్ఞాన) దీపం వెలిగించి వెలుగును ప్రసరింపచేయకుండా ఉన్నానే! ఈ అంధకారమయమైన జీవిత సంద్రాన్ని దాటడానికి నేను ఎటువంటి ఏర్పాటూ చేయకుండా ఉండిపోయానే! నేనెంతటి మూర్ఖుణ్ణి!’ అని శ్రీకృష్ణచంద్రుడు దీర్ఘంగా యోచించాడు.

ఇలా తరచి తరచి యోచించిన వెంటనే ఆయన సంసారాన్ని త్యజించాడు. బృందావనానికి వెళ్ళిపోయాడు. ఆయన తన సంపదతో ఒక కృష్ణమందిరాన్ని నిర్మించాడు.

తన వద్ద ఉన్న తక్కిన సంపదనంతా పేదసాదలకు ఉదారంగా పంచిపెట్టాడు. భిక్షాటనతో జీవించ సాగాడు. కాలాంతరంలో ఆయనను జనులు ‘లాలాబాబా’ అని పేర్కొనసాగారు.

లాలాబాబా, బృందావనం(Brindavan)లో ఉన్నప్పుడు కృష్ణాలయం నిర్మించటంతోపాటు, రాధాకుండానికి మెట్లు కూడా కట్టించారు.

ఒక సర్వసామాన్యమైన సంఘటన శ్రీకృష్ణచంద్రుని జీవితాన్నే ఆసాంతం మార్చివేసింది.

Leave a Comment