shiva purana “ఓ తపోధనులారా! ఇంతకు ముందు మీరడిగిన ప్రశ్నలకు, ఇంకా మీ మనస్సులో ఉన్న సందేహాలకు సమాధానంగా “శివమహాపురాణము”ను మీకు పరిచయం చేస్తున్నాను. తార్కిక ప్రధానమైన బుద్ధితో కాకుండా అనుభవప్రధానము, స్పందన శీలము ఐన హృదయంతో, ఆస్తిక్య ప్రధానమైన బుద్ధితో, భక్తి భావంతో, అసూయ లేకుండా ఏకాత్మ భావంతో ఏకాగ్రతతో శ్రవణం చేయండి.

ఈ “శివపురాణం” లో సకలోపనిషత్సారం. ఇది శ్రేష్ఠమైన పురాణం. సర్వమానవులను ఇహంలో పాపాలనుండి ఉద్ధరించి పరంలో పరమార్ధాన్ని చేరుస్తుంది. ఇది కలికల్మష నాశకం. చతుర్విధ పురుషార్థ సాధకం. ఇందులో మహా దేవుని కీర్తి స్వచ్ఛమైన శరత్కాల కౌముదిలా విస్తరించి ఉంది. ఈ పురాణాన్ని అధ్యయనం చేసిన మాత్రాన సర్వులు సద్గతిని పొందుతారు.
ఈ శివపురాణం వ్యాప్తిలోకి రానంత వరకు మాత్రమే లోకంలో పాపాలు ప్రబలి ఉంటాయి. ఘోరమైన ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి. ఇది పరిచయం కానంత వరకు మాత్రమే ఇతర శాస్త్రాలు, పురాణాలు పరస్పరాధిక్యతను నిరూపించు కొనటం కోసం. తగవులాడు కొంటూ ఉంటాయి.
పుణ్యతీర్థములన్నీ అహమికతో స్పర్ధ వహించి ఉంటాయి.
ఇతర మంత్రాలన్ని తమ ఆధికత్యను చాటు కొనటం కోసం పోటీ పడుతూ ఉంటాయి. ఇతర పీఠాలు, పుణ్యక్షేత్రాలు దేవతలు వేయేల ఏ ఇతర సిద్ధాంతాలైనా సరే వాటి మహిమ ఈ శివపురాణం ప్రకటితం కానంత వరకు మాత్రమే.
సూర్యోదయానంతరం చీకట్లన్నీ పటాపంచలైనట్లే ఈ శివపురాణ పఠనానంతరం మానవులకు అవిద్య, అజ్ఞానం నశించి కల్మషాలన్నీ హరించుకు పోతాయి. మునులారా! మానవునకు మృత్యుభయాన్ని మించిన భయం లేదు గదా! అట్టి మహా భయంకరమైన మరణభయం కేవలం శివ మహాపురాణ శ్రవణం వల్లనే తొలగి పోతుంది.
దీని పఠన, శ్రవణాదుల వల్ల వచ్చే మహాపుణ్య ఫలాన్ని సంపూర్ణంగా ఎవరు వర్ణించ గలరు? అనేక లోకా లోకాలతో, బ్రహ్మాండాలతో నిండియున్న ఈ అనంతమైన సృష్టికి కారణభూతులైన శివ-శక్తుల అనంతత్త్వాన్ని లేశ మాత్రంగా నైనా మనసులో భావిస్తే; ఆ మానవునకు పునర్జన్మ ఎక్కడిది? నిస్సందేహంగా ఆ జీవుడు సాక్షాత్తు శివుడవుతాడు. సాక్షాత్తు మోక్ష లక్ష్మి వచ్చి గుమ్మం ముందు నిరీక్షిస్తుందంటే ఇతరమైన లౌకిక ప్రయోజనాలన్నీ ఇట్టే నెరవేరుతాయి అని వేరే చెప్పాలా?
వేద, శాస్త్రాదులు అధ్యయనం చేస్తే వచ్చే మహాపుణ్యం ఈ పురాణ పఠన, శ్రవణాదుల వల్ల వస్తుంది. తపోధనులైన మునులారా! ఒక్క మాట చెపుతున్నాను. విశ్వాసంతో వినండి.
సమస్తమైన వేద, శాస్త్ర, పురాణ, ఇతిహాస, మంత్ర, తంత్ర, జప, తప, ధ్యాన యోగాదుల సారభూతమైన జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం యొక్క స్వరూపం ఈ పురాణం.
పాల యొక్క సారం వెన్నకదా! అలాటి వెన్నముద్ద ఇది! క్షీర సాగర సారం అమృతం. అట్టి అమృత భాండం ఈ పురాణం.
ఈ పురాణాన్ని గృహంలో భద్ర పరిస్తే చాలు వాడుఅమృతుడవుతాడు.
ఈ శివ మహా పురాణం లోని ఒక్క శ్లోకాన్ని పఠించినా, కనీసం భక్తితో నమస్కరించినా సర్వ దేవతా పూజాఫలం లభిస్తుంది.
ఎవరైతే చతుర్దశి నాడు ఉపవాస ముండి శివ భక్తుల సన్నిధిలో ప్రవచనం చేస్తాడో ఆ ఉత్తమునికి గాయత్రీ మంత్ర పురశ్చరణ ఫలం లభిస్తుంది.
రాత్రి జాగరణ చేసి దీనిని పఠిస్తే ఆ పుణ్య పురుషునికి వచ్చే పుణ్యం అంతింత అనరానిది.shiva purana
కురుక్షేత్రం, గయ, ప్రయాగ, ఇత్యాది పుణ్య క్షేత్రాలలో తన బరువు తూగే హిరణ్యాన్ని వ్యాస భగవానునికి దానం చేస్తే వచ్చే పుణ్యఫలాన్ని మించిన తరగనంత అనంత పుణ్యఫలం వస్తుంది.
ఇందులో ఉన్న రుద్ర సంహితను రాగయుక్తంగా అహర్నిశలు గానం చేసిన భక్తుని ముందు ఇంద్రాది దేవతలు వాని ఆజ్ఞకోసం ఎందురు చూస్తూ ఉంటారు.
వేల సంవత్సరాలు తపస్సు చేస్తే వచ్చే అంతఃకరణ శుద్ధి ఈ రుద్రసంహితా పఠనం వల్ల సిద్ధిస్తుంది.
భైరవ ప్రతిమ ముందుగాని, మర్రి చెట్టు లేక మారేడు చెట్టుకు ప్రదక్షిణం చేస్తూగాని పఠిస్తే ఫలితం కోటి గుణితం అవుతుంది.
ఇక ఇందులో ఉన్న కైలాస సంహిత పరమోత్కృష్టమైనది.shiva Puranam
శ్లో॥ కైలాస సంహితా తత్ర తతో పి పరమా స్మృతా ॥ బ్రహ్మ స్వరూపిణీ సాక్షా – త్ప్రణవార్ధ ప్రకాశికా || కైలాస సంహితాయాస్తు మహాత్మ్యం వేత్తి శంకరః ॥ కృత్స్నం తదర్ధ వ్యాసశ్చ – తదర్ధం వేద్మ్యహం ద్విజాః ||
ఇది సాక్షాత్తు వేదమే. ఈ సంహితలో ప్రణవార్ధము, తత్త్వము నిరూపింప బడ్డాయి. దీని మహాత్మ్యం శంకరునకు పూర్ణంగా తెలుసు. వ్యాస భగవానునకు సగం తెలుసు. అందులో సగం నాకు తెలుసు.
నేను ఆర్జించిన జ్ఞాన భిక్షను మీకనుగ్రహిస్తున్నాను. ఈ సంహితా తత్త్వాన్ని లెస్సగా బోధ పరచుకొన్న వానికి మరుక్షణంలో చిత్తశుద్ధి కలుగుతుంది.
మనసు స్వాధీనమైన వానికి విశ్వమంతా వశమౌతుంది. సాధనలన్నీ మనోలయాన్ని సిద్ధింపచేసికొనుట కొరకే కదా!
ఓ ద్విజులారా! ఈ రుద్ర సంహిత నాశనం చేయలేని పాపం లోకంలో లేదు. ఈ అమృత భాండాన్ని ఈ మహాదేవుడు తొలుత కుమార స్వామికిచ్చాడు. ఆ కారణంగానే కుమారుడు జ్ఞానమూర్తి ఐనాడు.
మానవుడు తనకు తెలియకుండానే అనేక పాపకృత్యాలను ఆచరిస్తూంటాడు. దుష్టుల నుండి దానాలను స్వీకరించటం, తినకూడని వాటిని తినటం,దురాలాపాలాడటం ఇత్యాదులు.
వాటికి నిష్కృతి ఈ సంహితాధ్యయనమే. కనీసం శ్రవణం చెయ్యాలి.
శివాలయంలోని బిల్వవనంలో పఠిస్తే వచ్చే ఫలం అనంతం, పితృకర్మలాచరించే సమయంలో ఈ రుద్ర సంహితను భక్తితో పఠిస్తే వారి పితరులందరు, రుద్రలోకాన్ని పొందుతారు.