శివుణ్ణి అర్చించడానికి ఒక భక్తుడు శివాలయానికి వెళ్ళాడు.

ఆలయం వెలువల ఉన్న ఒక దుకాణంలో అర్చన నిమిత్తం కొబ్బరికాయ, అరటిపండ్లు, కర్పూరం, పువ్వులు, అగరువత్తులు, విభూతి మొదలైనవి కొన్నాడు.
ఈ పూజా సామగ్రిని ఆ భక్తుడు ఆలయంలో గర్భగుడిలో ఉన్న అర్చకునికి ఇచ్చి అర్చన చెయ్యమని చెప్పాడు.
అర్చకుడు అర్చన పూర్తిచేసి, కొబ్బరికాయను రెండుగా పగలగొట్టి విగ్రహం ముందు ఉంచాడు; ఒక అరటిపండును కాస్తగిల్లి దానిని విగ్రహం ముందు ఉంచాడు.
ఆ తరువాత అర్చకుడు దైవానికి కర్పూర హారతి ఇచ్చాడు. అప్పుడు భక్తులు ‘శంభోశంకర’ అంటూ చేతులు జోడించి ప్రణామాలు అర్పించారు.
తమ ముందుకు కర్పూర హారతి ఇచ్చిన పళ్ళెరాన్ని తెచ్చినప్పుడు భక్తులు హారతిని కళ్ళకు అద్దుకున్నారు. తరువాత పళ్ళెరాన్ని అర్చకుడు కొబ్బరికాయ, అరటిపళ్ళు ఉంచిన చోట పెట్టాడు.
అప్పుడు కొబ్బరికాయ, అరటిపండు పరస్పరం దిగులుపడుతూ ఇలా మాట్లాడుకున్నాయి:
కొబ్బరికాయ (అరటిపండుతో) : నన్ను రెండుగా పగులగొట్టి
దైవవిగ్రహం ముందు ఉంచారు. నిన్ను గిల్లి విగ్రహం ముందు ఉంచారు. అప్పుడు ఈ భక్తులు మౌనంగా ప్రేక్షకుల్లా చూస్తూ ఉన్నారే తప్ప, చేతులు జోడించి నమస్కరించలేదు. దీన్ని నువ్వు గమనించావా?
(community service as a way of life) “ఊరికోసం పాటుపడడమే యోగం”అరటిపండు: బాగానే గమనించాను. అదే భక్తులు కర్పూర హారతి ఇస్తున్నప్పుడు మాత్రం దైవనామాన్ని ఉచ్చరిస్తూ చేతులు జోడించి నమస్కరించారు ఎందుకని? మనకు లభించని ఈ గౌరవమూ, ప్రాధాన్యమూ ఈ కర్పూరానికి మాత్రం ఎలా దక్కింది?
ఈ విధంగా అవి పరస్పరం మాట్లాడుకోసాగాయి.
విశ్లేషాత్మకమైన ఈ సంభాషణాంతంలో అవి, “కర్పూరం తనను దగ్ధం చేసుకొని భక్తులు దైవవిగ్రహాన్ని బాగా దర్శించడానికి దోహద పడింది. ఆ విధంగా తనను కర్పూరం ఆత్మత్యాగం చేసుకొనడం వలననే, దానికి అంతటి గౌరవమర్యాదలు లభించాయి” అని తేల్చుకున్నాయి.
తన కోసం మాత్రమే జీవించే వ్యక్తిని లోకం స్మరించి, కీర్తించదు. జనుల హితం కోసం ఎవరు తమను త్యాగం చేసుకొంటారో. వారినే స్మరిస్తూ శ్లాఘిస్తారు.
“యోగం అంటే ఏమిటి?” అన్న దానికి ఒక మహాత్ముడు ఇలా వివరణ ఇచ్చాడు. “ఊరుకై పాటుపడడమే యోగం.”
శ్రేష్ఠత్వానికి గీటురాయి త్యాగమే. అది వ్యక్తిమాత్రుని ఉన్నతుని గావిస్తుంది, సమాజాన్ని ఉద్దరిస్తుంది.
తక్కిన సాధనలకన్నా త్యాగం మనిషిని భగవంతుని వద్దకు సత్వరమే తీసుకుపోతుంది.
“నిష్కామబుద్ధి ఒకనిలో ఎంత ఎక్కువగా ఉంటుందో, అతడు అంత ఆధ్యాత్మికపరుడు, శివసాన్నిధ్యం పొందినవాడూ అవుతాడు. అతడు విద్యావంతుడైనా లేక నిరక్షరకుక్షి అయినా, శివునికి ఇతరులకన్నా దగ్గరైన వాడే! అతడికి ఈ సంగతి తెలిసి ఉండవచ్చు.
తెలియకపోవచ్చు” అని స్వామి వివేకానంద రామేశ్వర ఆలయ సందర్శన సమయంలో చేసిన ప్రసంగంలో చెప్పారు.
మనుషులను మూడు కోవలుగా వర్గీకరించవచ్చు.https://www.facebook.com/share/1Akg5uqtUk/
ఒక కోవకు చెందిన వ్యక్తులు కేవలం తమకోసం మాత్రమే జీవిస్తారు. తమ భార్యాపిల్లల నిమిత్తమే బతుకుతారు, కరడుగట్టిన స్వార్థంతో జీవిస్తారు – వీరు మృగాలు,
రెండవ కోవకు చెందిన వారు తాము జీవిస్తూ, తక్కిన వారిని కూడా జీవింపజేస్తారు. వీరు మనుష్యులు.
మూడవ కోవకు చెందిన వ్యక్తులు కొందరు ఉంటారు. వీరు ఇతరుల కోసమే జీవిస్తారు, వీరిలో మచ్చుకి రవ్వంత స్వార్థం కూడా ఉండదు, తమ కోసం వీరు ససేమిరా జీవించరు. ఇతరుల నిమిత్తం మాత్రమే జీవించే వీరు ‘మహామనీషి’గా పేర్కొనబడుతున్నారు.