The Fox’s Healing Advice – Wisdom from a Folktale

Fox’s ఒక మహారణ్యంలో ఒక సింహం రాజులా జీవిస్తోంది. ఆ సింహానికి ఆహారంగా, తక్కిన జంతువులు నిత్యం మాంసం తెచ్చి. ఇస్తూండేవి.

అందువలన ఆ సింహం తన ఆహారం నిమిత్తం అక్కడకు ఇక్కడకు వెళ్ళకుండా, ఒకే చోటనే తిష్ఠవేసి ఉండిపోయింది.

ఈ స్థితిలో బాగా బలిసిపోయి, కొవ్వుపట్టిన ఆ సింహానికి కూర్చున్న చోటునుండి లేవడానికి కూడా సాధ్యం కావడం లేదు.

ఇలా ఉండగా ఒక రోజు ఆ సింహం, తన వద్దకు వచ్చిన నక్కతో ఇలా చెప్పి వాపోయింది: “నా ఒళ్ళు బాగా బలిసిపోవడంతో నేను లేచి నడవను కూడా నడవలేకపోతున్నాను. నా ఒళ్ళు చిక్కడానికి ఏదైనా మంచి మార్గం ఉందేమో కాస్త చెప్పు.”

అందుకు ఆ నక్క ఒకింతసేపు ఆలోచించి ఇలా స్పందించింది:

“లేకేం, ఉంది. సింహరాజా! మీకొక దివ్యమైన ఔషధం నిర్దేశిస్తాను. అది ఏమిటంటే, మీరు నిత్యం వేకువనే లేచి, వేకువన పడే మంచుబిందువులను సేకరించి, రోజూ ఒక గ్లాసెడు తాగుతూ రండి. ఆ విధంగా మీరు చేస్తే, మీ ఒళ్ళు చిక్కి, మంచి దేహారోగ్యం పొందుతారు.” ఇలా చెప్పి నక్క తన దారిన తాను వెళ్ళిపోయింది.

ఆ తరువాత సింహం, వేకువనే కింద పడే మంచుబిందువులను సేకరించి తీసుకువచ్చి తనకు అందించే పనికి కుందేళ్ళను పురమాయించింది.

తన ఉత్తర్వు ప్రకారం రోజూ కుందేళ్ళు సేకరించి తెచ్చి ఇచ్చే గ్లాసెడు మంచుబిందువులను సింహం ఆవురావురుమని తాగుతూ వచ్చింది. ఇలా దాదాపు నాలుగు వారాలు గడిచాయి. అయినా సింహం ఒళ్ళు పిసరంతకూడా చిక్కితే ఒట్టు! మునుపటి లాగానే నడవలేని తీరులో దాని దేహం కొవ్వుపట్టి, బలిసి ఉంది.fox’s

ఔషధం ఏమాత్రమూ గుణం ఇవ్వలేదని నిశ్చయించుకున్న ఆ సింహం, వెంటనే నక్కను తన సమక్షంలోకి రమ్మని కబురు పంపింది.

నక్క బెదురుతూ సింహం సమక్షంలోకి వచ్చింది. అప్పుడు సింహం, “నువ్వు చెప్పినట్లు నాలుగు వారాల పాటు రోజూ ఒక గ్లాసు మంచుబిందువులను తాగుతూ వచ్చాను. కాని నా ఒళ్ళు రవ్వంత కూడా చిక్కలేదు; పైగా ఇంకా కాస్త బలిసినట్లు అనుమానంగా ఉంది. నీ ఔషధ నిర్దేశాన్ని నేను తు.చ. తప్పక పాటించాను. కాని ప్రయోజనం శూన్యం. ఎందువల్ల?” అన్నది నక్కతో కాస్త గద్దిస్తున్న ధోరణిలో,

అందుకు నక్క వినయంగా, “సింహరాజా! మీరు మంచుబిందువులను సేకరించే పనిని కుందేళ్ళకు అప్పగించారు. అలా ‘చెయ్యకుండా స్వయంగా మీరే వేకువనే లేచి మంచుబిందువులను సేకరించి, ఒక గ్లాసు తాగితేనే మీరు ఆకాంక్షించినట్లు మీ శరీరం చిక్కి, ఆరోగ్యవంతంగా తయారవుతారు” అని చెప్పింది.

నక్క చెప్పినట్లే సింహం మర్నాటి నుండి వేకువనే లేచి, స్వయంగా తానే మంచుబిందువులను సేకరించి తాగసాగింది.

ఈ విధంగా నెల గడిచింది. సింహం ఒళ్ళు కొంతమేరకు చిక్కింది. దాని ఆరోగ్యం కొంతలోకొంత మెరుగుపడింది.

తరువాత సింహం, నక్కను రప్పించి, “నువ్వు చెప్పినట్లు నెల రోజులు ఔషధం పుచ్చుకున్నాను. తత్ఫలితంగా ప్రస్తుతం నా ఒళ్ళు కొంతలో కొంత చిక్కి, ఆరోగ్యంలో చెప్పుకోదగ్గ సత్ఫలితం కానవస్తోంది” అంది ప్రశంసాపూర్వకంగా,

అందుకు నక్క “ఓ సింహరాజా! నేను మీకు నిర్దేశించింది ఎటువంటి ఔషధమూ కాదు! వ్యాయామాన్నే మీకు ఒక ఔషధం మాదిరి నిర్దేశించి చెప్పాను. మీ ఒళ్ళు చిక్కడానికీ, ఆరోగ్యంలో మంచిమార్పు రావడానికీ మీరు నిత్యం తాగిన గ్లాసెడు మంచుబిందువులు కారణం కానేకాదు.

*మీ ఒళ్ళు చిక్కి, ఆరోగ్యం బాగుపడడానికి నిజమైన కారణం, క్రమంతప్పకుండా వేకువనే లేచి మీరే స్వయంగా మంచుబిందువుల సేకరణ నిమిత్తం ఇక్కడా అక్కడా తిరగడమే; ఆ వ్యాయామం కారణంగానే మీ ఒళ్ళు చిక్కి, ఆరోగ్యం పొందారు” అని నక్క అసలు విషయం చెప్పింది.

మనిషి ఆరోగ్యంగా ఉండగోరితే, దైనందిన శారీరక వ్యాయామం తప్పనిసరి అని పై ఉదంతం మనకు చెప్పక చెబుతున్న సంజీవిని వంటి ఔషధ నిర్దేశనం కదా!

Leave a Comment