krishna శ్రీకృష్ణుని దర్శనార్థం ఒకసారి నారదుడు ద్వారకకు వెళ్ళాడు. తనకు ప్రణమిల్లిన నారదుని, శ్రీకృష్ణుడు ఆశీర్వదించాడు.

తరువాత వారిద్దరూ మాట్లాడుకుంటూ వాహ్యాళికి వెళ్ళారు.
అప్పుడు నారదుడు, “శ్రీకృష్ణా! నీ మాయ అమిత శక్తిమంతమైనదని అందరూ చెప్పుకుంటున్నారు. అది నిజమా? నన్ను అందరూ దేవర్షి అని సంబోధిస్తున్నారు. బ్రహ్మజ్ఞాని అయిన నన్ను నీ మాయ ఏం చెయ్యగలదు? మాయకు నేను వశవర్తిని అవుతానా?” అని అడిగాడు.
అది విన్న శ్రీకృష్ణుడు, నారదునికి సూటిగా జవాబివ్వకుండా కాస్త దూరంలో ఉన్న ఒక కొలనును చూపించి, “నారదా! ఆ కొలనులో ఒక మునకవేసి రా…” అని చెప్పాడు.
వెంటనే నారదుడు తన చేతనున్న ‘మహతి’ అనే వీణను కొలను గట్టు మీద పెట్టి, కొలనులో ఒక మునకవేసి, లేచాడు.
కొలను నీటిలో నుండి లేవడమే ఆలస్యం, నారదుడు ఒక అత్యంత అందమైన యువతిగా మారిపోయాడు! ‘నేను నారదుణ్ణి’ అనే పాత జ్ఞాపకాలన్నీ చెరిగిపోయాయి; కొలను గట్టు మీద ఆయన ఉంచిన వీణ కూడా అక్కడ లేదు. శ్రీకృష్ణుడూ అక్కడ లేడు!
యువతిగా మారిపోయిన నారదుడు, కొలను గట్టు మెట్లను ఎక్కి పైకి రాసాగాడు.
ఆ సమయంలో ఆ దారిగుండా ఆ దేశపు రాజు గుర్రం మీద వేగంగా వస్తున్నాడు. అతడు యువకుడు, పైగా అందగాడు కూడా.
అతడు కొలను గట్టు మీద నుండి పైకి వస్తున్న స్త్రీ రూపంలో ఉన్న నారదుణ్ణి చూశాడు. అంతే! ఆమెను వివాహం చేసుకోవాలని అభిలషించాడు.
గుర్రం దిగి ‘నారద స్త్రీని’ సమీపించి ఆ రాజు, “నేను ఈ దేశానికి రాజును, నిన్ను వివాహం చేసుకోవాలని అభిలషిస్తున్నాను.
నీకు సమ్మతమేనా?” అని అడిగాడు.
అందుకు ‘నారద స్త్రీ’ సిగ్గుపడుతూ మెల్లగా తల ఊపి తన అంగీకారం తెలియజేసింది.
వెంటనే రాజు, ‘నారద స్త్రీ’ని తనతో రాజాంతఃపురానికి తోడ్కొని వెళ్ళాడు.
అంతఃపురంలో రాజుకు, నారదస్త్రీకి సముచిత రీతిలో ఘనంగా వివాహం జరిగింది.
ఇద్దరూ ఆనందంగా దాంపత్య జీవితం గడపసాగారు.
కాలక్రమంలో వారికి ఇద్దరు పిల్లలు పుట్టారు.
ఇలా ఉండగా హఠాత్తుగా ఒక రోజు పొరుగు దేశం రాజు, ఈ దేశంపై దండెత్తాడు.
నారద స్త్రీ భర్తకూ, పొరుగు దేశం రాజుకు ఘోరంగా యుద్ధం జరిగింది.
యుద్ధరంగంలో నారదస్త్రీ భర్త నేలకొరిగిపోయాడు. దేశ రాజధానిని కైవసం చేసుకోవడానికి శత్రు సైనికులు ముందుకు దూసుకురాసాగారు.
నారదస్త్రీ భర్తకు ఎంతో నమ్మకస్థులైన కొందరు వీరులు యుద్ధరంగం నుండి హుటాహుటిన వచ్చి ఆమెతో, “మహారాణీ! యుద్ధంలో మన రాజుగారు అసువులుబాసారు. శత్రువులు అంతః పురాన్ని ఆక్రమించడానికి వేగంగా వస్తున్నారు. మీరు ఇప్పుడే మీ పిల్లలతో సహా తప్పించుకొని అడవిలోకి పారిపోండి. మీరు బందీలు కాకముందే ఇక్కణ్ణుండి తప్పించుకుని వెళ్ళిపోండి!” అని హితవు చెప్పారు.
ఆ ప్రకారం నారద స్త్రీ, తన పిల్లలతో అంతఃపురం నుండి తప్పించుకొని పారిపోయింది.
శత్రువులు తనను వెంబడించి తరుముకుని వస్తున్న శబ్దం ఆమెకు వినిపించింది. అంతే, ఆమె వేగంగా ఊపిరి బిగబట్టి సమీపంలో ఉన్న అడవిలోకి పరుగెత్తింది.
అలా వేగంగా పరుగెత్తుతున్నప్పుడు ఆమె తాను చెయ్యి పుచ్చుకుని ఉన్న పెద్ద కుమారుడు ఆమె చేతినుండి జారిపోయాడు. ఇప్పుడు రెండవ కుమారుణ్ణి తన వక్షానికి హత్తుకుని ఆమె పరుగెత్త సాగింది. ఇంతలో శత్రువులు మరింత దగ్గరపడ్డట్లు కేకలు వినవచ్చాయి. శత్రువులు మరింత సమీపించడంతో, భయంతో ఆమె మరింత వేగంగా పరుగెత్తడంతో ఆమె చేతిబిడ్డ కూడా జారి కింద పడిపోయాడు!
శత్రువుల నుండి తప్పించుకోవడానికి ఆమె రాళ్ళ మీద ముళ్ళమీద చూసుకోకుండా గాయాలయ్యాయి. పరుగెత్తడం వలన ఒంటినిండా
నారద స్త్రీ అమిత వేగంగా పరుగెత్తింది. చాలా దూరం పరుగెత్తిన తరువాత, శత్రువులు తరుముకు వస్తున్న శబ్దం వినిపించలేదు. గండం గడిచిందని ఆమె గ్రహించింది.
తరువాత ఆమె అడవిలోని ఒక పెద్ద చెట్టు కింద అలసిపోయి కూర్చుండిపోయింది. తన స్థితిని తలచుకుని ఆమె, “అయ్యో! నా స్థితి ఇలా అయిపోయిందే! భర్తను కోల్పోయాను! పిల్లలనూ కోల్పోయాను… మా రాజ్యాన్నీ శత్రువులు ఆక్రమించుకున్నారు. ఇప్పుడు అనాథను అయ్యాను. ఇక నేను ఎవరి కోసం బతకాలి? రాళ్ళు ముళ్ళు గుచ్చుకుని దేహం నిండా ఏర్పడ్డ గాయాల నొప్పి భరించలేకపోతున్నాను. మరోవంక ఆకలిదప్పికలు పీడిస్తున్నాయి” అంటూ ఆమె భోరున ఏడ్వసాగింది.
ఇంతలో శ్రీకృష్ణుడు ఒక వృద్ధుని రూపంలో అక్కడకు వచ్చి, “అమ్మా! నువ్వు ఎవరివి? ఎందుకు ఈ అడవిలో ఒంటరిగా కూర్చుని విలపిస్తున్నావు?” అని అనునయంగా అడిగాడు.
నారద స్త్రీ, తన దుస్థితినంతా విడమర్చి ఆ వృద్ధుడికి తెలిపింది. అంతా విని ఆ వృద్ధుడు. “అమ్మా! అదుగో అక్కడ కనిపిస్తున్న కొలనులో స్నానం చేసిరా! అందువల్ల నీకు మేలు ఒనగూరుతుంది” అని హితవు చెప్పాడు.
వృద్ధుడు చెప్పినట్లే కొలనులో మునిగి ఆమె లేచింది! వెంటనే నారద స్త్రీ రూపం మాయమై, పాత నారదుని రూపం వచ్చేసింది నారదునికి జరిగింది యావత్తు జ్ఞాపకానికి వచ్చింది.
కొలను గట్టు మెట్ల మీదుగా పైకి వస్తున్న నారదుడు, గట్టు మీద తాను ఉంచిన వీణను తీసుకున్నాడు. కాస్త దూరంలో శ్రీకృష్ణుడు నిలబడి ఉండడం అప్పుడు నారదుడు చూశాడు.
జరిగినదంతా తలచుకొంటూ శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి “భగవాన్! నా గర్వానికి తగిన శాస్తి జరిగింది; నన్ను క్షమించు. నీ మాయ అమిత శక్తిమంతమైనదని నేను ఇప్పుడు ప్రత్యక్షంగా గ్రహించాను. మాయకు ఎన్నడూ నేను వశవర్తిని కాకుండా ఉండేట్లు నన్ను ఆశీర్వదించు” అని చేతులు జోడించి నమస్కరిస్తూ నారదుడు ప్రార్థించాడు. –
శ్రీకృష్ణుడు చిన్నగా నవ్వి, నారదుడు కోరినట్లు ఆశీర్వదించాడు.
“త్రిగుణాత్మికమైన ఈ నా దైవీమాయను దాటడం అసాధ్యం..
కాని నన్నే ఆశ్రయించి ఉండేవారు దీనిని దాటగలుగుతారు.”